ఆస్తి కోసం పిన్నిపై హత్యాయత్నం
దర్శి(ప్రకాశం): ఆస్తి కోసం పిన్ని (చిన్నాన్న భార్య)పై ఓ యువకుడు హత్యాయత్నం చేశాడు. దర్శి పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో ఈ సంఘటన జరిగింది. మండలంలోని అబ్బాయిపాలేనికి చెందిన పిచ్చాల ఈశ్వరరెడ్డి, పిచ్చాల వెంకటేశ్వరరెడ్డి అన్నదమ్ములు. అన్న వెంకటేశ్వరరెడ్డి దొనకొండ మండలం గుడిపాడులో నివాసం ఉంటున్నారు.
తమ్ముడు ఈశ్వరరెడ్డి, అతని భార్య పోలమ్మ అబ్బాయిపాలెం గ్రామంలోనే ఉంటున్నారు. మూడు సంవత్సరాల క్రితం ఈశ్వరరెడ్డికి చెందిన ఆస్తిలో తమకు కూడా హక్కు ఉందని వెంకటేశ్వరరెడ్డి కుమారుడు కోటిరెడ్డి కోర్టును ఆశ్రయించాడు. మధ్యలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా చేశారు. అయినప్పటికీ ఇద్దరి మధ్యా సయోధ్య కుదరలేదు. వివాదాలు చోటుచేసుకోవడంతో కోర్టు ఎలా తీర్పు ఇస్తే అలా చేద్దామని పోలమ్మ చెప్పింది.
తమకు ఆస్తి రాకుండా పిన్ని పోలమ్మ అడ్డుపడుతుందని భావించిన వెంకటేశ్వరరెడ్డి కుమారుడు కోటిరెడ్డి ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆమెను హత్యచేస్తే ఆస్తి వస్తుందని భావించాడు. సరుకుల కోసం ఆటోలో దర్శి వచ్చిన పోలమ్మపై స్థానిక గడియార స్తంభం సెంటర్‌లో కొబ్బరి బోండాల కత్తితో తల, మెడపై కోటిరెడ్డి దాడిచేసి గాయపరిచాడు. ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తీసుకెళ్లారు. పట్టపగలే ఓ మహిళపై కత్తితో దాడి జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నిందితుడు కోటిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.