ఇవేం‘రక్త’ సంబంధాలు..ఆస్తి కోసం అయిన వారినే తుదముట్టిస్తున్న వైనం | There is a dearth of love even for siblings | Sakshi
Sakshi News home page

ఇవేం‘రక్త’ సంబంధాలు..ఆస్తి కోసం అయిన వారినే తుదముట్టిస్తున్న వైనం

Published Mon, May 29 2023 3:29 AM | Last Updated on Mon, May 29 2023 7:00 AM

There is a dearth of love even for siblings - Sakshi

ఆస్తి కోసం ఒకనాడు అన్నను, ఇప్పుడు తమ్ముడిని హత్య చేశాడో వ్యక్తి. కన్న తండ్రినే చంపేందుకు ప్రయత్నించాడో యువకుడు. వివాహేతర సంబంధం కోసం ఓ భార్య.. భర్తపై హత్యా యత్నం చేస్తే.. ఆవేశంలో అన్నీ మరిచి కన్న తల్లినే చంపిందో కూతురు. బంధాలు, అనుబంధా లన్నీ మాటలకే.. మనిషిలోని మానవత్వం మాయమైపోతోంది. కన్నవారి మీద, తోబుట్టువుల పట్ల కూడా కనీస ప్రేమ కరువైంది. క్షణికావేశమో.. పగ, ప్రతీకారమో.. కుటుంబ సభ్యులను చంపేందుకు వెనుకాడటం లేదు మనిషి. అందుకు ఈ ఘటనలు ఓ ఉదాహరణ మాత్రమే!  

భర్తపై డీజిల్‌ పోసి.. నిప్పంటించి..
♦ ఓ భార్య ఘాతుకం
♦ దాదిగూడ రాంనగర్‌ కాలనీలో ఘటన 

జిన్నారం(పటాన్‌చెరు): వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తపై డీజిల్‌ పోసి హత్య చేసేందుకు ఓ భార్య యత్నించింది. ఈ ఘటన జిన్నారం మండలం ఊట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని రాంనగర్‌ కాలనీలో ఆదివారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఊట్ల గ్రామ పంచాయితీ పరిధిలోని దాదిగూడ గ్రామానికి చెందిన సంకు నర్సింహులు(32)కి దుండిగల్‌కు చెందిన యాదమ్మతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరు దాదిగూడ సమీపంలోని రాంనగర్‌ కాలనీ లో ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం.

భార్యాభర్తలు కూలి పని చేసుకుంటూ బతుకుతున్నారు. యాదమ్మ కొంత కాలంగా వివాహేతర సంబం«ధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త తర చూ కుటుంబ సభ్యులకు చెప్పి బాధపడేవాడు. ఇదే విషయమై 27వ తేదీ రాత్రి భార్యాభర్తల మధ్య గొ  డవ జరిగింది. భర్త తనకు అడ్డంకిగా మారాడని భావించిన యాదమ్మ అత డిని చంపాలని నిర్ణయించుకుంది. గొడవ జరిగాక ఇంటి పక్కనే ఉన్న ఆటో నుంచి డీజిల్‌ తీసి పెట్టుకుంది. భర్త నర్సింహులు గాఢ నిద్రలోకి వెళ్లాక, రాత్రి 12 గంటల తర్వాత అతడిపై డీజిల్‌ పోసి నిప్పంటించింది.

నర్సింహులు అరుపులతో చుట్టు పక్కల వారు వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయ త్నించారు. అప్పటికే 60 శాతం గాయాలయ్యాయి. అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నర్సింహులు పరిస్థితి విషమంగా ఉంది. నర్సింహు లు తమ్ముడు పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు ద ర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ విజయరావు తెలిపారు. యాదమ్మ పోలీసుల అదుపులో ఉంది. 


తల్లిని రోకలితో బాది..
♦ ఓ కుమార్తె దుర్మార్గం
నందిపేట్‌(ఆర్మూర్‌): తల్లీకూతుళ్ల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ హత్యకు దారితీసింది. కూతురు ఆవేశంలో తల్లిని రోకలితో బాది చంపిన ఘటన నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడ గ్రామంలో వెలుగు చూసింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉమ్మెడకు చెందిన నాగం నర్సు(52) భర్త చనిపోవడంతో ఉమ్మెడలో ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కూతుర్లు హరిత, అరుణ. పెద్ద కూతురు హరిత.. తల్లి ఉండే ఇంట్లోని పక్కగదిలోనే వేరుగా నివసిస్తోంది.

కాగా తల్లీకూతుళ్ల మధ్య కొన్నేళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. మృతురాలి రెండో కూతురు అరుణ ఇంట్లో ఈ నెల 26న తొట్లె ఫంక్షన్‌ జరిగింది. తల్లి నర్సు, పెద్ద కూతురు హరిత వెళ్లారు. అక్కడ నర్సు.. రెండో కూతురు అరుణ బంధువులతో గొడవపడి వారిని దూషించింది. ఇంటికి తిరిగొచ్చాక శుక్రవారం రాత్రి పెద్ద కూతురు హరితకు, మృతురాలికి మధ్య ఈ విషయంలో గొడవ జరిగింది. హరిత ఆవేశంలో తల్లి తల, ముఖంపై రోకలితో ఇష్టం వచ్చినట్లు కొట్టి వెళ్లిపోయింది.

శనివారం రాత్రి తన చెల్లిలికి, బంధువులకు ఫోన్‌చేసి జరిగిన విషయాన్ని తెలిపింది. వారు వచ్చి చూడగా నర్సు చనిపోయి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు శనివారం రాత్రి ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతురాలి మేనల్లుడు గణపురం రవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

ఆస్తి కోసం తండ్రిపై తనయుడి దాడి 
♦ కత్తితో ఇష్టారీతిన పొడిచిన వైనం
తొర్రూరు: వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కొడుకు.. ఆస్తి కోసం హత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. ఎస్సై లింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం అమీనాపురం గ్రామ శివారు టీక్యా తండాకు చెందిన మాలోతు రాములు అనే 70 ఏళ్ల వృద్ధుడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

అందరికీ పెళ్లిళ్లు చేసి, తనకున్న మూడెకరాల భూమిని కుమారులిద్దరికి సమానంగా పంచాడు. భూ పంపకాల్లో అన్నకు ఎక్కువ భూమి పంచాడని, కుమార్తెలకు డబ్బులు పంపుతున్నాడని తండ్రితో చిన్న కుమారుడు స్వామి కొంత కాలంగా గొడవపడుతున్నాడు. పలుమార్లు పెద్దమనుషుల్లో పంచాయితీ పెట్టి నచ్చజెప్పినా అతని తీరులో మార్పు రాలేదు. రాములు ఈ నెల 26న దంతాలపల్లి పడమటిగూడెం శివారు చారి తండాలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి ఇంటికివ వెళ్లేందుకు ఆదివారం తొర్రూరు బస్టాండుకు వచ్చాడు.

బస్సు కోసం ఎదురుచూస్తున్న తండ్రిని చాటుగా ఫాలో అవుతున్న స్వామి.. హెల్మెట్‌ ధరించి వెంట తెచ్చుకున్న కత్తితో తండ్రిపై దాడి చేశాడు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే తల, పొట్ట, చేతులపై పదునైన కత్తి గాట్లు పడ్డాయి. బస్టాండ్‌లోని ప్రయాణికులు అడ్డుకోవడంతో అక్కడినుంచి పరారయ్యాడు. తీవ్ర రక్త స్రావంతో అల్లాడుతున్న వృద్ధుడి గురించి పోలీసులకు అక్కడున్న ప్రయాణికులు సమాచారం అందించారు. పోలీసులు 108లో వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. క్షతగాత్రుడి పెద్ద కుమారుడు శంకర్‌నాయక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 


 

నాడు అన్నను.. నేడు తమ్ముడిని..
♦ ఆస్తి కోసం హత్య చేసిన సోదరుడు
మద్నూర్‌(జుక్కల్‌): ఆస్తి తగాదాలు నిండు ప్రా ణాన్ని బలితీసుకున్నాయి. రక్త సంబంధాన్ని మరిచి తోబుట్టువును దారుణంగా హత్య చేశాడో అన్న. కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం  సోనాలలో ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సోనాలకు చెందిన గంగాధర్, గినాన్‌బాయికి ముగ్గురు కొడుకులు సంజయ్‌ పాటిల్, రాజు పా టిల్, విజయ్‌ పాటిల్‌(32). వీరికి 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆస్తి విషయంలో గొడవలతో.. గంగాధర్‌ పెద్ద కొడుకు సంజయ్‌ పాటిల్‌ను తమ్ముడు రాజు పాటిల్‌ 2011లోనే హత్య చేసి, శిక్ష అనుభవించాడు.

జైలు నుంచి బయటకు వచ్చిన రాజు అప్పటి నుంచి పెద్దపల్లి, హైదరాబాద్‌లలో ఇంగ్లిష్‌ టీచర్‌గా ప్రైవేటు స్కూళ్లలో పనిచేసేవాడు. కరోనా సమయంలో సొంతూరుకు తిరిగి వచ్చాడు. అయితే గంగాధర్‌ పేరున ఉన్న 18 ఎకరాల భూమిలోంచి ఐదు ఎకరాల భూమిని అప్పట్లో హత్యకు గురైన సంజయ్‌ భార్య పేరున చేశారు. 13 ఎకరాల్లోంచి మూడెకరాల భూమిని తమ్ముడు విజయ్‌ పాటిల్‌ అమ్మేశాడు. మిగిలిన పదెకరాల భూమిని తాకట్టు పెట్టడంతో రాజుపాటిల్‌ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.

ఆస్తి పంపకాలు జరగక ముందే ఇష్టారాజ్యంగా ఎట్లా అమ్మారని? భూమి తాకట్టు పెట్టి అప్పు చేయడం ఏమిటని? ఇద్దరు అన్నదమ్ముళ్ల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఒడిశా రాష్ట్రానికి వెళ్లి అక్కడే ఏదైనా ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా చేరాలని రాజు పాటిల్‌ అతడి భార్య సీతిక్ష నిర్ణయించుకున్నారు. అయితే ఆదివారం వేకువజామున నాలుగు గంటల ప్రాంతంలో రాజుపాటిల్‌ లేచి అదే ఇంట్లో వేరే గదిలో నిద్రిస్తున్న విజయ్‌పాటిల్‌ను విచక్షణ రహితంగా పొడిచాడు. మెడ, కాళ్లు, కడుపులో పలుమార్లు పొడవడంతో కడుపులోని పేగులు బయటకు వచ్చి విజయ్‌ వెంటనే మృతిచెందాడు.

అక్కడి నుంచి నేరుగా మద్నూర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన రాజు పాటిల్‌ జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. బాన్సువాడ డీఎస్పీ జగన్నాథ్‌రెడ్డి, బిచ్కుంద సీఐ కృష్ణ, మద్నూర్‌ ఎస్సై కృష్ణారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని మద్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడు విజయ్‌ పాటిల్‌కు ఏడాది క్రితమే పెళ్లి జరిగిందని, భార్యాభర్తల మధ్య గొడవలతో భార్య ఇటీవలే పుట్టింటికి వెళ్లిపోయిందని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement