ఆస్తి కోసం దత్తపుత్రుడు ఉన్మాదిగా మారాడు. తనను పెంచి పెద్ద వాడ్ని చేసిన కుటుంబంలో విషాదాన్ని నింపాడు. వృద్ధులు అన్న కనికరం కూడా చూపించకుండా ఇద్దరు వృద్ధురాళ్లను అతి కిరాతకంగా గొంతు కోసి హతమార్చాడు. తిరువేర్కాడు సమీపంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా ఆదివారం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
సాక్షి, చెన్నై: చెన్నై శివారులోని తిరువేర్కాడు, పాదిరివేడు, మేట్టడు వీధిలో చెందిన ఏలుమలై (58) కుటుంబం నివాసం ఉంటోంది. వ్యాపార వేత్తగా ఉన్న ఆయనకు భార్య సబినా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరితోపాటు ఆ ఇంట్లో ఏలుమలై తల్లి రంగనాయకి (85), ఆమె సోదరి కృష్ణవేణి (70) కూడా ఉంటున్నారు. అప్పట్లో రంగనాయకి బాలకృష్ణన్‌ను దత్తతకు తీసుకుని పెంచి పెద్దవాడ్ని చేసింది. చెడు వ్యసనాల బారిన పడ్డ బాలకృష్ణన్ ప్రస్తుతం డ్రైవర్‌గా ఉన్నాడు. ఏలుమలై ఇంటికి సమీపంలోని తన కుటుంబంతో బాలకృష్ణన్ నివాసం ఉంటున్నాడు. తరచూ ఏలుమలై ఇంటి వద్దకు వచ్చి ఆస్తి కోసం రంగనాయకి, కృష్ణవేణి వద్ద బాలకృష్ణన్ గొడవ పడే వాడు. ఆస్తికోసం కోర్టులో కేసు సైతం వేశాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం తన కుటుంబంతో ఏలుమలై హొసూర్‌కు వెళ్లాడు. దీంతో ఇంట్లో రంగనాయకి, కృష్ణవేణి మాత్రమే ఉన్నారు. ఈ ఇద్దరికి బంధువు శరవణన్ ఇంటి నుంచి టీ, కాఫీ, టిఫిన్ వచ్చేది. శనివారం కూడా శరవణన్ ఆ ఇంటికి వచ్చి వెళ్లాడు.
ఆదివారం ఉదయాన్నే అక్కడికి రాగా, తలుపులు తెరిచే ఉండడంతో శరవణన్ ఆందోళనలో పడ్డాడు. లోనికి వెళ్లి చూడగా హాలులో రంగనాయకి రక్తపు మడుగులో గొంతు కోసిన స్థితిలో విగత జీవిగా పడి ఉండడాన్ని గుర్తించారు. అలాగే, బాత్‌రూంలో కృష్ణవేణి గొంతు కోసిన స్థితిలో మృతదేహంగా పడి ఉండడంతో ఆందోళనతో కేకలు పెట్టాడు. దీంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న తిరువేర్కాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. రంగనాయకి, కృష్ణవేణి మృతదేహాలను శవపంచనామాకు తరలించారు. పోలీసు శునకాలు ఆ ఇంటికి సమీపంలోని ఓ ప్రాంతం వద్దకు వెళ్లి ఆగాయి.
దత్త పుత్రుడి కిరాతకం
తొలుత ఈ హత్యలు ఉత్తరాది దొంగల ముఠా పనిగా పోలీసులు భావించారు. అయితే, ఆ ఇంటికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల వైర్లు తెంచి పడేసి ఉండడం, అక్కడున్న పరిస్థితిని బట్టి బాగా తెలిసిన వాళ్లెవరో పథకం ప్రకారం హతమార్చి ఉండవచ్చన్న నిర్ధారణకు పోలీసులు వచ్చారు. దీంతో విచారణను వేగవంతం చేశారు. అదే సమయంలో రంగనాయకి దత్తపుత్రుడు బాలకృష్ణన్ మీద అనుమానాలు బయలుదేరాయి. ఆస్తిలో తనకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదని పదేపదే అతగాడు సాగించిన రాద్ధాంతం, కోర్టు కేసులు పోలీసుల దృష్టికి చేరాయి. దీంతో అతడి మీద అనుమానాలు బలపడ్డాయి. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. తిరువేర్కాడు సమీపంలోని ఓ ప్రాంతంలో నక్కి ఉన్న బాలకృష్ణన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అతడి మోటార్‌సైకిల్‌లో రక్తపు మరకలతో దుస్తులు ఉండడంతో తమ దైన స్టైల్లో విచారించారు. ఆస్తిలో భాగం ఇవ్వలేదన్న ఆగ్రహంతో శనివారం అక్కడకు వచ్చినట్టు, గొడవ ముదరడంతో తానే హతమార్చినట్టుగా బాలకృష్ణన్ విచారణలో అంగీకరించాడు. నగల కోసం వచ్చిన దొంగలు ఈ హత్య చేసినట్టుగా చిత్రీకరించే యత్నం చేసి ఉండడం గమనార్హం. అతగాడి వద్ద నుంచి నగలను సైతం పోలీసులు స్వా«ధీనం చేసుకున్నారు. ఇతడికి ఉత్తరాదికి చెందిన ముగ్గురు వ్యక్తులు సహకరించినట్టు సమాచారం రావడంతో వారి కోసం గాలింపు సాగుతోంది. కాగా, పెంచి పెద్దవాడ్ని చేసిన కుటుంబంలోనే విషాదాన్ని నింపే విధంగా దత్త పుత్రుడు ఉన్మాదిగా మారి కిరాతకానికి పాల్పడడం ఆ పరిసరాల్లో కలకలం రేపింది. ఆ ఇంటి వద్ద పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో వారిని కట్టడి చేయడం పోలీసులకు శ్రమగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment