పెంపుడు కొడుకును ఇంటి నుంచి తరిమేసిన తండ్రి
ఆస్తిలో వాటా ఇవ్యాల్సి వస్తుందని గెంటివేత
ఇంటి ముందు బిడ్డతో ధర్నాకు దిగిన కొడుకు, కోడలు
మల్లాంలో ఘటన.. పోలీసులకు ఫిర్యాదు
అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం.. ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం...అంటూ ఓ సినీ కవి మానవీయత లేని కుటుంబ సంబంధాల్లోని డొల్లతనాన్ని ఏనాడో ఎండగట్టాడు. కన్నప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది అంటారు. కానీ డబ్బు ముందు అన్ని ప్రేమలూ దిగదుడుపే అనడానికి ఇక్కడో తండ్రి నిదర్శనగా నిలిచాడు. ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని 35 ఏళ్లుగా పెంచుకున్న కొడుకును ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు..
బుచ్చెయ్యపేట: కొడుకులు లేరని అన్న కొడుకును 35 ఏళ్ల కిందట దత్తత తీసుకున్నాడు. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాడు. తీరా ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని పెంచిన ప్రేమను పక్కన పెట్టి పెంపుడు కొడుకును, కోడలు, మనవరాళ్ల సహా ఇంట్లోంచి బయటకు గెంటేసిన ఘటన బుచ్చెయ్యపేట మండలం మల్లాంలో జరిగింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన బొట్టా పోతురాజు, దేముడమ్మకు ఆరుగురు ఆడపిల్లలు. పోతురాజు అన్న రామునాయుడుకు ముగ్గురు మగ సంతానం. మగ సంతానం లేని పోతురాజు అన్న కుమారుల్లో ఆఖరివాడైన రమణను 35 ఏళ్ల కిందట దత్తత తీసుకున్నాడు. రమణ నాలుగో ఏడాది నుంచి పోతురాజు, దేముడమ్మ వద్దే పెరిగాడు.
వీరి రేషన్ కార్డులోను, ఆధార్ కార్డులోను రమణ పేరు కూడా నమోదు చేశారు. 15 ఏళ్ల కిందట పోతురాజు, దేముడమ్మల పెద్ద కూతురు వరహాలమ్మ కుమార్తెను రమణకిచ్చి వివాహం చేశారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. ఇప్పటి వరకు ఒకే ఇంట్లో నివాసం ఉంటూ జీవించారు. ఇటీవల పోతురాజు అల్లుడొకరు రమణను ఇంట్లో నుంచి బయటకు పంపేయాలని, లేకపోతే ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని అత్తమామలకు నూరిపోయడంతో రమణ, దేవిలను రెండేళ్లుగా వేరే గదిలో ఉంచారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తక్షణం ఇంట్లోంచి వెళ్లిపోవాలంటూ బుధవారం తన పెంపుడు కొడుకు రమణను, అతని భార్య దేవిలను పోతురాజు ఇంట్లో నుంచి బయటకు గెంటి వేశాడు.
వారి వంట సామాన్లు, బట్టలను బయటకు విసిరేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో రమణ, దేవి ఉదయం నుంచి రాత్రి వరకు ఆరు బయటే అర్ధాకలితో ఉండిపోయారు. రమణ ఇద్దరు కుమార్తెలు కశింకోట హాస్టల్‌లో చదువుతుండగా చిన్న కుమార్తెతో కలిసి భార్తభర్తలిద్దరూ వర్షం కురుస్తున్నా ఇంటి బయటే ఉండిపోయారు. తనను అన్యాయంగా ఇంటి నుంచి గెంటివేయడంపై బాధితుడు రమణ బుచ్చెయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. పోతురాజుకు ఎకరా 20 సెంట్లు జిరాయితీ భూమి, 5 ఎకరాలు డి పట్టా భూమి, ఇల్లు ఉంది. ఈ ఆస్తిలో వాటా ఇవ్వబడుతుందని చిన్నప్పటి నుంచి పెంచిన రమణను అతని భార్య, పిల్లలను ఇలా అర్ధంతరంగా ఇంటి నుంచి వెళ్లగొట్టడంపై గ్రామస్తులు కూడా మండిపడుతున్నారు. అమాయకుడైన రమణకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment