
అనకాపల్లి: తల్లిని కోల్పోయిన పుట్టెడు దుఃఖంలోనూ ఇంటర్మీడియట్ విద్యార్థి పరీక్షకు హాజరైన విషాదకర ఘటన తారువలో శుక్రవారం చోటు చేసుకుంది. దేవరాపల్లి మండలం తారువ గ్రామానికి చెందిన ముత్యాల పరమేశ్వరి గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందింది.
దీంతో ఆమె కుమారుడు ఆకాష్ సహా కుటుంబ సభ్యులంతా రాత్రంతా తల్లి పార్థివదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. చోడవరంలో చదువుతున్న ఆకాష్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సవరం పరీక్షలకు శుక్రవారం హాజరు కావాల్సి ఉంది. అతని భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని కుటుంబ సభ్యులు ఆకాష్‌కు ధైర్యం చెప్పి పరీక్షకు సిద్ధం చేశారు.
గుండెల్లో నుంచి ఉబికివస్తున్న బాధను పంటి బిగువున భరిస్తూ పరీక్షకు హాజరయ్యాడు. పరీక్షకు పయనమయ్యే ముందు ఆకాష్ తన తల్లి పార్థివదేహం వద్ద గుండెలవిలేలా రోదించడం పలువుర్ని కంటతడి పెట్టించింది. తల్లికి నమస్కరించి బాధను దిగమింగుతూ పరీక్ష రాసేందుకు చోడవరం పయనమయ్యాడు. ఆకాష్ పరీక్ష రాసి తిరిగి వచ్చాక ఆశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment