ఏజెన్సీలో ఎదురుకాల్పులు
♦ మావోయిస్టుల స్థావరంపై పోలీసుల దాడి
♦ తప్పించుకున్న ముఖ్యనేతలు సునీల్, సురేష్
♦ కూంబింగ్ జరుపుతున్న రెండు రాష్ట్రాల బలగాలు
అరకులోయ: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టుల కంచుకోటలా చెప్పుకునే గన్నెల పంచాయతీ చీడివలస, కెంటిసడి, సబక, ఒడిశా రాష్ట్రం సింగర్‌గుడ్డి, ముట్టిసింగ, తైడా, బంగారుగుడ్డి గ్రామాల మధ్య కొండపై మావోయిస్టుల స్థావరంపై పోలీసులు దాడి చేయడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఉదంతానికి సంబంధించి సంఘటన ప్రాంతంలో లభించిన ఆధారాలు, గిరిజనులు, అధికారుల కథనం ప్రకారం వివరాలు.. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ డివిజన్ కార్యదర్శి సునీల్, ఒడిశా-ఛత్తీస్‌గఢ్ మావోయిస్టు స్టేట్ కమిటీ సభ్యుడు సురేష్‌లు ఏఓబీ సెక్రటరీ దయ ఆదేశాల మేరకు గురువారం రాత్రి దాదాపు 60 మంది మావోయిస్టులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమాచారం ఆంధ్రా పోలీసులకు రావడంతో శుక్రవారం తెల్లవారుజామున ఆ ప్రాంతాన్ని ముట్టడించారు. గమనించిన మావోలు పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించారు. సునీల్, సురేష్‌లతోపాటు కొందరు మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. సంఘటన స్థలం వద్ద మూడు, నాలుగు ఎస్‌ఎల్‌ఆర్ తుపాకీలు, 40 కిట్ బ్యాగ్‌లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. కాగా, మావోలు తప్పించుకుపోతున్న సమాచారాన్ని ఆంధ్రా పోలీసులు కోరాపుట్ జిల్లా పొట్టంగి పోలీస్ స్టేషన్‌కు చేరవేశారు. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ రంగంలోకి దిగి కోరాపుట్ నుంచి మావోయిస్టులకు ఎదురు వస్తూ కూంబింగ్ మొదలుపెట్టింది. సంఘటన స్థలం నుంచి పోలీసులను, కిట్ బ్యాగులను హెలికాప్టర్లలో తరలించారు. ఏడాదిగా ఇక్కడ మావోలు స్థావరం ఏర్పరుచుకున్నట్టు సమాచారం.