వేదికపై మంత్రి సూర్జో పాత్రో, అధ్యక్షుడు వీవీ రామనరసింగరావు, సంతోష్ సాహు, మనోజ్ పాఢి
బరంపురం: ఒడిశా ప్రభుత్వం అమలు చేసిన కొత్త చట్టం ప్రకారం ఇక నుంచి అన్ని వ్యాపార సంఘాల దుకాణాల బోర్డులు ఒడియా భాషలోనే ఉండాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి సూర్యనారాయణ పాత్రో స్పష్టం చేశారు. గంజాం చాంబర్ అఫ్ కామర్స్ ఆధ్వర్యంలో స్థానిక కొమ్మబాల వీధిలో గల కార్యాలయంలో 50వ వార్షికోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వీవీ రామ నరసింగ రావు అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవాల్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి సూర్యనారాయణ పాత్రో ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మంత్రి సూర్జో పాత్రో మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్తచట్టాన్ని అమలు చేసిందని చెప్పారు.
ఏప్రిల్ 1వ తేదీన ప్రత్యేక ఒడిశా అవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ చట్టం అమలులోకి వచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త చట్టం అనుసారంగా ఒడిశా రాష్ట్రంలో ప్రతి వ్యాపార దుకాణం ముందు వ్యాపార బోర్డులపై మాతృ భాష ఒడియాలోనే పేర్లు ఉండాలని చెప్పారు.
అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో కూడా తప్పని సరిగా ఒడియా భాషలో బోర్డుల్లో పేరు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇక రాష్ట్రంలో గల కలెక్టరేట్ కార్యాలయాల నుంచి అన్ని ప్రభుత్వ కార్యలయాల్లో కూడా ఒడియా భాషలోనే బోర్డులు ఉండాలని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా కలెక్టర్‌లకు ఒడియా భాషలోనే లేఖలు, కరస్పాండింగ్ చేయగలరని లేఖలో కూడా కింద ఒడియా భాషలో తప్పనిసరిగా సంతకం ఉండాలని స్పష్టం చేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రం చేసిన కరస్పాండింగ్ లేఖలు మాత్రం ఆంగ్లంలో ఉంటాయని అన్నారు.
తెలుగులో కూడా బోర్డులు
ఇదే విధంగా రాష్ట్రంలో 4.17 కోట్ల మంది జనాభా ఉన్నా వారిలో రెండో స్థానంలో తెలుగు ప్రజలు ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కువ శాతం తెలుగు ప్రజలు ఉన్న ఊళ్లలో మాత్రం తెలుగులో కూడా బోర్డులు అమర్చగలరని చెప్పారు. వచ్చే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉల్లి, బంగాళా దుంపల ధరలు పెరగనున్నాయని ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలుగా బంగాళాదుంపలు, ఉల్లిపాయల నిల్వలు ఉంచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించిదని చెప్పారు.
వ్యాపారస్తులు ఆన్‌లైన్ బిల్లింగ్ ద్వారా ప్రభుత్వానికి సక్రమంగా పన్ను చెల్లించాలని కోరారు. తద్వారా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జీఎస్‌టీ వల్ల జాతీయ రహదారులలో చెక్‌పోస్ట్‌లు ఎత్తివేశామని అన్నారు.
ఉత్తమ వ్యాపారస్తులకు సన్మానం
అనంతరం గంజాం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వావీ రామ నరసింగ రావు కొత్తగా సంఘంలో చేరిన, ప్రభుత్వానికి సక్రమంగా, సరైన పన్ను చెల్లించిన ఉత్తమ వ్యాపారస్తులను పేరుపేరున పిలవగా మంత్రి సూర్జో పాత్రో వారికి గౌరవ సన్మానం చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి సంతోష్ కుమార్ సాహు, గౌరవ అతిథి మనోజ్ కుమార్ పాఢితో సహా జిల్లాలో గల వివిధ వ్యాపార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment