రాయగడ: కాశీపూర్‌లో ప్రారంభించిన భవనం
భువనేశ్వర్ ఒరిస్సా : రాష్ట్ర పర్యాటక రంగం బహుముఖ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రాల మార్గంలో పలు చోట్ల విరామ కేంద్రాల్ని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంగళవారం ప్రారంభించారు. రాష్ట్ర సచివాలయం నుంచి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో ఆయన ఈ విరామ కేంద్రాల్ని ప్రారంభించారు. పర్యాటక కేంద్రాల్ని అనుసంధాపరిచే జాతీయ, రాష్ట్ర రహదారుల పరిసరాల్లో వేర్వేరు ప్రాంతాల్లో 50 విరామ కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నారు.
వీటిలో 34 కేంద్రాల నిర్మాణం పూర్తి చేసి మంగళవారం ప్రారంభించారు. 4 కేంద్రాల్ని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించగా మిగిలిన కేంద్రాల్ని ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతరేతర ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ప్రారంభించారు. రాష్ట్ర సచివాలయం నుంచి నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో రాష్ట్ర రవాణా–నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ నృసింహ చరణ్ సాహు, పర్యాటక, సాంస్కృతిక, ఒడియా భాష అభివృద్ధి శాఖ మంత్రి అశోక్ చంద్ర పండా, నిర్మాణ శాఖ కార్యదర్శి నళినీ కాంత ప్రధాన్ పాల్గొన్నారు.
పర్యాటకులకు దోహదం
పర్యాటక మార్గాల్లో విరామ కేంద్రాలు పర్యాటకులకు ఎంతగానో దోహదపడతాయి. ప్రధానంగా మహిళలకు ఎంతగానో ఉపకరిస్తాయని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలిపారు. తొలి విడతలో 34 పర్యాటక విరామ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఈ కేంద్రాల్లో మరుగుదొడ్లు, సురక్షిత తాగు నీరు, కెఫేటేరియా సదుపాయాలు కల్పించారు. ప్రయాణంలో పర్యాటకుల అవసరాల దృష్ట్యా ఈ కేంద్రాల్లో సదుపాయాలు కల్పించడం విశేషంగా పేర్కొన్నారు. పర్యాటకులకు చక్కటి పర్యావరణంతో ఈ కేంద్రాలు స్వల్ప కాలిక విడిది కేంద్రాలుగా సేద తీర్చుతాయి.
త్వరలో మరిన్ని సదుపాయాలు
పర్యాటక విరామ కేంద్రాల్లో మరిన్ని సదుపాయాల్ని త్వరలో ప్రవేశ పెట్టనున్నట్లు రాష్ట్ర నిర్మాణ శాఖ కార్యదర్వి నళినీ కాంత ప్రధాన్ తెలిపారు. దీర్ఘకాల ప్రయాణంలో చోదకులు, పర్యాటకులు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల నుంచి ఉపశమనం కల్పించేందుకు పర్యాటక మార్గాల్లో విరామ కేంద్రాల్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ ప్రాంగణాలు, తాగునీరు, మరుగుదొడ్లు, ఆహార కేంద్రాల్ని ఏర్పాటు చేయాలని తమ విభాగం ముఖ్యమంత్రికి ప్రతిపాదించినట్లు తెలిపారు.
పాతబడిన పర్యవేక్షక బంగళాలు, బహిరంగ ప్రభుత్వ స్థలాల్ని సద్వినియోగపరుచు కోవడం ఈ ప్రణాళిక ప్రధాన ధ్యేయంగా ఆయన పేర్కొన్నారు. ఇటువంటి 50 కేంద్రాల నిర్మాణానికి పనులు చేపట్టారు. ఇప్పటివరకు 34 కేంద్రాల నిర్మాణం పూర్తయింది. వీటిని ముఖ్యమంత్రితో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు వగైరా ప్రజా ప్రతినిధులు మంగళవారం ప్రారంభించారు. మరి కొన్ని చోట్ల ఇటువంటి కేంద్రాల్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. అవసరమైన చోట్ల ప్రైవేట్ స్థలాల కొనుగోలుకు ఆయన ఆదేశించినట్లు నిర్మాణ శాఖ కార్యదర్శి తెలిపారు.
హైవేలపై ట్రామా కేంద్రాలు
జాతీయ (ఎన్‌హెచ్) రాష్ట్ర జాతీయ రహదారు(ఎస్‌హెచ్)ల పొడవునా తరచూ దుర్ఘటనలు సంభవిస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో బాధితులకు తక్షణ ఆరోగ్య, చికిత్స సేవల్ని కల్పించేందుకు పర్యాటక విరామ కేంద్రాల పరిసరాల్లో ట్రామా కేంద్రాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని నిర్మాణ శాఖ కార్యదర్శి వివరించారు. ఈ ప్రాంగణాల్లో వాహనాల మరమ్మతు కేంద్రాలు, పిల్లల కోసం ఆట స్థలాలు, వై–ఫై సదుపాయం, మందుల దుకాణాలు కూడా ఏర్పాటు చేసేందుకు విభాగం యోచిస్తోందని తెలిపారు. పర్యాటక విరామ కేంద్రాల నిర్వహణ బాధ్యతల్ని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిర్మాణ విభాగానికి కట్టబెట్టినట్లు ప్రకటించారు.
గుణుపురం, కాశీపూర్‌లలో..
రాయగడ: రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా యాత్రికులు, పర్యాటకులకు వసతి సౌకర్యం కల్పించే భవనాలను ప్రభుత్వం నిర్మించి జాతీయ రహదారుల వద్ద పర్యాటకులు, పాదచారులు, విశ్రాంతి తీసుకునేందుకు సదుపాయం కల్పించింది. ఈ విశ్రాంతి భవనాల్లో భోజన సదుపాయం, సౌచాలయ సదుపాయం ఉంటుంది. వీటికి రుసుం చెల్లించవలసి ఉంటుంది. రాష్ట్రంలో ఇంతవరకు 50భవనాల నిర్మాణం చేపట్టగా అందులో 35భవనాలు పూర్తయ్యాయి.
వాటిలో రాయగడ జిల్లాలోని కాశీపూర్, గుణుపురంలో ఒక్కో భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కాశీపూర్ భవనం ప్రారంభోత్సవానికి కలెక్టర్ గుహపూనాంతపస్‌కుమార్, రాయగడ ఎంఎల్‌ఏ లాల్‌బిహారీ హిమరిక, బీజేడీ నాయకుడు మహాపాత్రో ఇతర సభ్యులు హాజరయ్యారు. అలాగే గుణుపురంలో భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుణుపురం ఎంఎల్‌ఏ త్రినాథ్‌గొమాంగో, రాజ్యసభ సభ్యుడు ఎన్.భాస్కరరావులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment