సాక్షి, మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి బోడ్డగెట్ట పంచాయతీలోని కూర్చు గ్రామానికి చెందిన ఐదు కుటుంబాలను మావోయిస్టులు గ్రామ బహిష్కరణ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఆదివారం రాత్రి గ్రామంలోకి సుమారు 30మంది మావోయిస్టులు వచ్చి గ్రామస్తులను పిలిపించి మాట్లాడారు.
ఈ గ్రామంలోని ఐదు కుటుంబాలు పోలీసులకు ఎక్కువగా సహకరిస్తున్నారని, అలాగే రోడ్డు పనులు, సెల్ టవర్స్ పనులకు హాజరవుతూ సహకారం అందిస్తున్నారని గద్దించారు. ఆ ఐదు కుటుంబాలవారూ గ్రామం వదిలి వెళ్లిపోవాలని తీర్మానించారు. లేని పక్షంలో మరణ దండన తప్పదని హెచ్చరించారు. దీంతో భయాందోళన చెందిన ఆ గ్రామానికి చెందిన ఐదు కుటుంబాల్లోని 20మంది సభ్యులు రాత్రికి రాత్రి సామాన్లు సర్దుకుని కొంతమంది బంధువుల ఇళ్లకు, మరికొంతమంది కలిమెల సమితి కేంద్రానికి చేరుకున్నారు.
ఈ సంఘటనపై మల్కన్‌గిరి ఎస్పీ జోగ్గామోహన్ మిశ్రాను సంప్రదించగా మావోయిస్టుల గ్రామ బహిష్కరణకు గురైన కుటుంబాలకు న్యాయం చేస్తామని, వారికి ఎక్కడైనా కొంత భూమిని చూపించి నివాసితులను చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment