
జయపురం(ఒడిశా): నడిరోడ్లపైన, ఆటోలలోను, ఆరుబయట ప్రదేశాలలోను గర్భిణులు ప్రసవిస్తున్నా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటువంటి సంఘటనలు పునరావృతం కాకండా తగిన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు శూన్యంగా ఉన్నాయి. అందుచేత గర్భిణులు పురిటి నొప్పులతో రోడ్లపై ప్రసవిస్తున్న సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. కొరాపుట్ జిల్లా దశమంతపూర్ సమితిలో ఒక గర్భిణిని ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు 102 అంబులెన్స్ రాకపోవడంతో బంధువులు ఆమెను మోసుకు వెళ్తుండగా రోడ్డుపైనే జోలిలో మగబిడ్డను ప్రసవించింది. ఈ సంఘటన జిల్లాలో జననీ సురక్షా పథకాలు, 102 అంబులెన్స్‌ల పనితీరును, మారుమూల గ్రామీణ ప్రాంతాల దురావస్థను చాటి చెబుతోంది.
కొరాపుట్ జిల్లా దశమంతపూర్ సమితిలోని మారుమూల దుర్గమ ప్రాంతం ముర్జ గ్రామ పంచాయతీలోని కుసుమపుట్ గ్రామం. గ్రామానికి చెందిన జునేశ్ జానీ భార్య సువాలొంగ్ గర్భిణి. ఆమె శనివారం పురిటి నొప్పులతో మెలికలు తిరుగుతూ బాధపడుతుంటే భర్త వెంటనే ఈ విషయం గ్రామంలోని ఆశా కార్యకర్తకు తెలియజేశాడు. ఆమె వచ్చి పరిస్థితిని చూచి 102 అంబులెన్స్‌కు ఫోన్‌చేసి వెంటనే రమ్మని కోరింది. అయితే మచ్ఛపుట్–కుసుముపుట్ గ్రామాల మధ్య రహదారి బాగులేక పోవడం వల్ల అంబులెన్స్ రాలేక పోయింది. మరోమార్గం లేక గర్భిణి బంధువులు ఆమెను ఒక జోలీలో మోసుకువెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో ఆమె ప్రసవించింది. అయితే అమెను హాస్పిటల్‌కు చేర్చాలన్న లక్ష్యంతో అంబులెన్న ఉన్న చోటువరకు తల్లీబిడ్డలను బంధువులు మోసుకువెళ్లారు. అక్కడినుంచి తల్లీబిడ్డలను దశమంతపూర్ కమ్యూనిటీ వైద్య కేంద్రానికి తరలించారు.
అధ్వానంగా రహదారులు
ముఖ్యంగా జిల్లాలో అనేక గ్రామాలకు రహదారులు లేకపోవడం, ఉన్నా అవి గతకుల మయమై వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేకపోవడం, తదితర కారణాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామప్రాంతాలలో రహదారులను అభివృద్ధి చేసేందుకు, పంచాయతీలతో గ్రా మ ప్రాంతాలను సంధానపరిచేందుకు పలు పథకాలు అమలు చేస్తున్నా అత్యధిక గ్రామాలు, ముఖ్యంగా మారు మూల దర్గమ ప్రాంతాలలో గల గ్రామాలకు రోడ్లు లేకపోవడం వల్ల ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.