తాము అందుకున్న వృద్ధాప్య పింఛన్లు చూపిస్తున్న కొఠియా గ్రామస్తులు
ఒడిశా, కొరాపుట్: వివాదాస్పద కొఠియా గ్రామ పంచాయతీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధికారులు తరచూ ప్రవేశిస్తూ ప్రజలను ఆకర్షించే తీరులో పలు ప్రజా సంక్షేమ పథకాలు అందజేయడం పట్ల ఆ ప్రాంత సర్పంచ్‌లు కొరాపుట్ జిల్లా అధికారులపై మండిపడుతున్నారు. ఇటీవల అటవీ భూముల పట్టాలను ఆంధ్రప్రదేశ్ అధికారులు అందజేశారని, అలాగే బుధవారం తొలగంజాపొదర్, ఉపరగంజపొదర్, తొలసెంబి, ఉపరసెంబి, ధుయిపొదర్ గ్రామస్తులకు 40మందికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేసి, రూ. 2, 250 ప్రతి ఒక్క లబ్ధిదారునికి చెల్లించినట్లు తొలగంజపొదర్ మాజీ సర్పంచ్ బిసు గెమేల్ విలేకరులకు సమాచారం అందజేశారు. త్వరలో మరో వందమందికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ అధికారులు హామీ ఇచ్చి వెళ్లినట్లు ఆయన తెలిపారు. అంతకుముందు 19 మంది లబ్ధిదారులకు ఆంధ్రప్రభుత్వం తరఫున అటవీ భూముల పట్టాలను అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ మాదిరి తరచూ ఆంధ్రప్రదేశ్ అధికారులు వివాదాస్పద కొఠియా ప్రజలకు ప్రజా సంక్షేమ పథకాలు సమకూరుస్తున్న విషయమై పొట్టంగి తహసీల్దారు కొరాపుట్ జిల్లా అధికారులకు సమాచారం అందివ్వకపోవడం ఏమిటని ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment