no house
-
‘ఆమె’కు ఉండడానికి ఇల్లు లేదు
ఎన్నో అవార్డులు, మరెన్నో రివార్డులు, సొంత గడ్డకే ప్రతిష్టను తీసుకువచ్చే అంతర్జాతీయ పురస్కారాలు, ఆమె పేరుతో యూనివర్సిటీలో హాస్టల్ భవనాలు, తాజాగా ఒడిశా రాష్ట్ర ప్రణాళిక బోర్డు సభ్యత్వం... అన్నీ ఉన్నాయి. కానీ తలదాచుకోవడానికి మాత్రం గూడు లేదు. పూరి గుడిసెలోనే బతుకు ఈడ్చాల్సిన పరిస్థితి. నీతి, నిజాయితీ, కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవారి దుస్థితి మన దేశంలో ఇంతేనని కమలా పూజారి కథతో మరోసారి కళ్లెదుట నిలుస్తోంది. 68 ఏళ్ల వయసున్న కమలా పూజారి ఒడిశాలో కోరాపుట్ జిల్లాకు చెందిన పత్రపుట్ నివాసి. వ్యవసాయ రంగంలో ఆమె చేసిన కృషి అనన్య సామాన్యమైనది. కోరాపుట్ జిల్లాలో ఆమె పేరు తెలీని వారు లేరంటే అతిశయోక్తి కాదు. జిల్లాలో గ్రామం గ్రామం తిరుగుతూ రసాయన ఎరువుల వాడొద్దంటూ ప్రచారం చేసింది. సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై రైతుల్లో అవగాహన పెంచింది. వ్యవసాయదారులతో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి తమ నేలలో ఎలాంటి పంటలు పండించాలో వివరించింది. అంతే కాదు స్థానికంగా పండే వందలాది రకాల సంప్రదాయ వరిధాన్యాలను పరిరక్షించి ఒడిశా సర్కార్ ప్రశంసలు పొందింది. 2002 సంవత్సరంలో దక్షిణాఫ్రికా ఇచ్చే ఈక్వేటర్ ఇనీషియేటివ్ అవార్డుని గెలుచుకొని సొంత రాష్ట్రానికి గుర్తింపు తీసుకువచ్చింది. ఇన్ని చేసినా ఇప్పుడు ఆమె నివాసం ఉంటున్నది ఒక పూరిగుడిసె. కనీసం పక్కా ఇల్లు కూడా లేదు. ప్రభుత్వ పథకం కింద పక్కా ఇల్లు కేటాయించాలంటూ ఆమె అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఇందిరా ఆవాస్ యోజన కింద సొంతింటి కోసం కమల పూజారి చేసుకున్న దరఖాస్తును కూడా ప్రభుత్వం తిరస్కరించింది . ఇప్పుడు పిలిచి మరీ రాష్ట్ర ప్రణాళిక బోర్డు సభ్యురాలిని చేసింది. ప్రభుత్వ నిర్ణయం ఆమెకు కాస్త సంతోషాన్నే తీసుకువచ్చినా కమలా పూజారి కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ ఈ పదవులు మాకెందుకు ? దానికి బదులుగా ప్రభుత్వం ఇల్లు ఇవ్వొచ్చు కదా. భువనేశ్వర్‌లో వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం హాస్టల్ భవన్‌కి మా నాన్నమ్మ పేరు పెట్టారు. ఈ గౌరవాలకి బదులుగా గౌరవంగా జీవించడానికి ఒక ఇల్లు ఇస్తే ఎంతో సంతోషించే వాళ్లం ‘ అని ఆమె మనవడు సుదామ్ పూజారి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వాస్తవానికి ఒడిశాలో ప్రణాళిక బోర్డు చాలా ఏళ్లుగా నిస్తేజంగా మారింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 18 ఏళ్ల పదవీకాలంలో మూడు సార్లు మాత్రమే సమావేశమైంది. అందుకే ప్రణాళిక బోర్డుని ప్రక్షాళన చేసిన ప్రభుత్వం కమలాపూజారి వంటి సమర్థులకు చోటు కల్పించి రాష్ట్ర పురోగతి బాధ్యతలు అప్పగించింది కానీ, ఆమెకి ఒక గూడు ఇవ్వడంలో మాత్రం నవీన్ పట్నాయక్ ప్రభుత్వం విఫలమైంది. -
మా కష్టాలు తీర్చండి
ఇళ్లు, పింఛన్లు, కరెంట్ లేవు బాత్రూంలు లేక ఆరుబయటే స్నానాలు కలెక్టర్‌కు సమస్యలు విన్నవించిన పిట్టలగూడెం వాసులు రఘునాథపల్లి : ఇళ్లు.. నీళ్లు లేవు.. పింఛన్లు ఇవ్వడం లేదు. కరెంటు లేక కటిక చీకట్లోనే కా లం వెళ్లదీస్తున్నాం. తమ జీవితాలు ఆగమ్యగోచరంగా ఉన్నాయి. మా కష్టాలు తీర్చండి అం టూ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ వద్ద మండలంలోని భాంజీపేట గ్రామ శివారు పిట్టలగూడెం వాసులు గోడు వెళ్లబోసుకున్నారు. పలు శాఖల అధికారులతో కలెక్టర్ మంగళవారం గూడెంను సందర్శించి ఆలయం ఎదుట నేల పైనే కూర్చొని గంటసేపు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇరుకు గదుల్లో 10 నుంచి 15 మంది బతుకుతున్నాం. తాగునీరు లేక అవస్థలు పడుతున్నాం. బాత్రూంలు లేక పాత చీరలతో గుడారాలు ఏర్పాటు చేసుకొని స్నానాలు చేస్తున్నాం. వృద్ధులకు పింఛన్లు ఇవ్వడం లేదని కలెక్టర్‌కు గూడెం వాసులు మొరపెట్టుకున్నారు. చలించిన కలెక్టర్ సత్వర చర్యల కోసం అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పింఛన్లు మంజూరు చేసేందుకు అర్హులను గుర్తించాలని, గూడెంలో 20 మరుగుదొడ్లు వెంటనే నిర్మించాలని ఎంపీడీఓ బానోతు సరితను ఆదేశించారు. గతంలో గూడెం వాసులు కొనుగోలు చేసిన భూములకు పట్టాలివ్వాలని తహసీల్దార్ రవిచంద్రారెడ్డిని ఆదేశించారు. తాగునీటి కోసం గూడెంలో బోరు, వ్యవసాయ భూముల్లో సాగు చేసేం దుకు మరో బోరు పాయింట్‌ను జియాలిస్ట్‌లతో గుర్తించి వేయాలని ఆర్డబ్ల్యూఎస్ డీఈని, విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వేట మానండి.. ఉపాధి కల్పిస్తాం అడవికి వెళ్లి జంతువులను వేటాడడం మానుకోవాలని మెరుగైన జీవనం కోసం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. గూడెంలో బాల వికాస స్వచ్ఛంద సంస్థచే మినరల్ వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. డబుల్బెడ్రూం ఇళ్లు, మేకల పెంపకానికి వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలకు అదనపు గదు లు, అంగన్వాడీ కార్యకర్త నియామకం, ప్రత్యే క వైద్యశిబిరం ఏర్పాటు చేస్తామని చెప్పారు. పరిమిత కుటుంబం కోసం కుటుంబ నియంత్రణ పాటించాలన్నారు. పిట్టలగూడెంను సా మాజిక దృక్పధంతో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మా జీ సభ్యుడు రాజారపు ప్రతాప్ దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ కె.అనితారెడ్డి, ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్, ఆర్డీఓ వెంకట్‌రెడ్డి, జెడ్పీటీసీ బానోతు శారద, గిరిజన సంక్షేమ అధికారి చందన పాల్గొన్నారు.