తడిసిన కల్లంలోని ధాన్యం ,నునావత్ కైక మృతదేహం
రాయికల్(జగిత్యాల): ప్రకృతి కన్నెర్రజేసింది. చేతికందే సమయంలో తాను సాగుచేసిన ఆరు ఎకరాల వరిపంట దెబ్బతినడంతో ఆ పంటను చూసిన మహిళారైతు గుండె ఆగిపోయింది. వివరాల్లోకి వెళ్తే... జగిత్యాల జిల్లా రాయికల్ మండలం తాట్లవాయి గ్రామంలోని లాల్‌నాయక్ తండాకు చెందిన మహిళా రైతు నునావత్ కైక (55) గ్రామంలోని ఆరు ఎకరాల పొలంలో వరిపంట సాగుచేసింది. మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన రాళ్లవాన కురవడంతో చేతికొచ్చిన పంట పూర్తిగా దెబ్బతినడంతో ఆ మహిళ రైతు గుండె తల్లడిల్లింది. ఏడుస్తూ ఇంటికి వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన రాయికల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. మృతురాలికి భర్త పర్శరాం, ఇద్దరు కూతుళ్లు, కొడుకులు ఉన్నారు. ఇటీవలే కొడుకు పెళ్లి కుదిరింది.
వడగండ్ల వానతో పంటనష్టం
రాయికల్ మండలం తాట్లవాయి ధర్మాజీపేట, కట్కాపూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో గ్రామంలోని వేలాది ఎకరాల్లో వరిపంటకు నష్టం జరిగింది. వరి చేలు నేలవాలగా, మామిడి కాయలు రాలిపోయాయి. తాట్లవాయి గ్రామంలో లావుడ్య కిషన్, భూక్యానాయక్, ధర్మాజీపేటలోని సురేశ్‌నాయక్ ఇళ్ల పైకప్పు లేచిపోవడంతో నిత్యావసర వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకునేలా చూడాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment