పంటను ట్రాక్టర్‌తో తొక్కిస్తున్న దృశ్యం ,సాంబర్ దోస కాయలను చూపుతున్న రైతు దంపతులు ఉమ, కృష్ణేగౌడ
దొడ్డబళ్లాపురం: అన్నదాతకు అన్నీ కష్టాలే. భూమి దున్ని, విత్తనాలు చల్లి, నీరుకట్టి, ఎరువులు వేసి పగలు,రాత్రి కంటిపాపలా కాపాడుకున్న పంటకు గిట్టుబాటు ఉండదు. చేతుల కష్టానికి చిల్విగవ్వకూడా దక్కదు. ఇలాంటి పరిస్థితే ఓ మహిళా రైతుకు ఎదురైంది. ధరలేని పంటను తానే ట్రాక్టర్‌తో పొలంలోనే తొక్కించి తన ఆక్రోశాన్ని వెల్లగక్కింది. తాలూకాలోని ఆలహళ్లి గ్రామానికి చెందిన రైతు మహిళ ఉమ మూడు నెలల క్రితం తన రెండెకరాల భూమిలో రెండు లక్షలు ఖర్చు చేసి సాంబార్ దోసకాయ సాగు చేసింది. సాధారణంగా ఈ పంటకు మంచి డిమాండ్ ఉండేది. కేజీ కనీసం రూ.20లు పలికేది.
అయితే ఉన్నఫలంగా ధరలు పడిపోయాయి. రైతు మహిళ ఉమ మొదటి కోతలో పంటకోసి చిక్కబళ్లాపురం, బెంగళూరు పెద్ద మార్కెట్లకు తీసికెళ్లగా కూలీ డబ్బులు కూడా గిట్టుబాటు కాలేదు. రెండో కోతకు ధర వస్తుందని భావించి లోడ్ తెస్తున్నా మని వ్యాపారికి ఫోన్ చేసింది.అయితే సాంబార్ దోసకాయకు డిమాండు లేదని, పంటను తేవద్దని చెప్పారు. దీంతో ఉమ తీవ్ర నిర్వేదానికి గురైంది. ఆరుగాలం పడిన శ్రమంతా వృథా అయిందని మనో వేదనకు గురైంది. ఆక్రోశం తట్టుకోలేక పంటను తనే ట్రాక్టర్‌తో తొక్కించి నాశనం చేసింది. ఆమె మాట్లాడుతూ పంటలకు గిట్టుబాటు ధర,తగిన మార్కెట్టు వ్యవస్థ కల్పించాలని ఉమ అభిప్రాయపడ్డారు. ఉమ భర్త కృష్ణేగౌడ మాట్లాడుతూ రైతుకు దెబ్బమీద దెబ్బ తగిలితే బతికేది ఎలా అని ఆవేదన వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment