నాన్న.. అమ్మలా మారుతున్నాడు. కోపం చిరాకు లేదు.. ఎక్కువటైం పిల్లలతోనే!. కాలం తెచ్చిన మార్పు.. పిల్లలకు తండ్రితోనే ఎక్కువ సాన్నిహిత్యం!
కుటుంబలో నాన్న అంటేనే ఒక ప్రత్యేక క్యారెక్టర్... నాన్న అంటే గాంభీర్యతకు ప్రతీక .. ఎప్పుడూ పనులు.. బాధ్యతలు.. కుటుంబ సమస్యలు.. అప్పులు.. వ్యవసాయం వంటి పనుల్లో బిజీ.. నాన్నను కలవాలంటేనే ముందుగా ప్రిపరేషన్ ఉండాలి. నాన్నతో మాట్లాడడం అంటే హైడ్మాస్టర్ దగ్గర నిలబడినట్లే.. నాన్న ఒక సీరియస్ క్యారెక్టర్... నాన్న వేలు పట్టుకుని నడిస్తే ఎంతబావున్ను.. నాన్న నన్ను తన భుజాలమీద ఎక్కించుకుని జాతరలో తిప్పుతూ.. జీళ్ళు కొనిపెడితే ఎంతబావుణ్ను... నాన్న పక్కన పడుకోబెట్టుకొని కబుర్లు.. కథలు చెప్పే రోజులు నాకు రావా ? ఇదీ సగటు తండ్రి క్యారెక్టరైజేషన్. దాదాపు 1990ల వరకూ నాన్న(Father) పరిస్థితి ఇదే.. ఇంట్లో అందరి బాధ్యతలూ మోస్తూ అందరికీ దూరంగా ఉండే ఒక సెమి విలనీ పాత్ర...
ఎప్పుడూ పనులు.. బాధ్యతల్లో ఉంటూ అసలు పిల్లలతో టైం గడపడం.. వారిని ఆడించడం.. వారితో ముచ్చట్లు ఆడడం అనేది తనకు సంబంధం లేదనుకునే పాత్ర ఆయనది. కేవలం పిల్లల ఖర్చులు.. బట్టలు.. పుస్తకాలు.. జ్వరం వస్తే మందులు వంటివి తేవడం తప్పిస్తే పిల్లలతో టైం గడపడం అనేది తండ్రి డైరీలోలేదు. పిల్లలకు స్నానం చేయడం.. వారిబట్టలు మార్చడం .. ఇలాంటివి అంటే డాడీకి ఎన్నడూ అసలు పరిచయం లేని పనులు. నాన్న కేవలం కొన్ని బాధ్యతలు మోయడం తప్ప పిల్లలతో ప్రేమను పంచుకునే సందర్భాలు.. సన్నివేశాలు దాదాపు తక్కువే. అప్పట్లో అన్నీ ఉమ్మడికుటుంబాలు.. పిల్లలతో టైం గడపడం అనేది ఆయనకు తెలియని పని.. అలాంటివి అన్నీ అమ్మే చూసుకుంటుంది.. పిల్లల విషయంలో తండ్రిది ఎప్పటికీ గెస్ట్ పాత్ర మాత్రమే....
కాలం మారింది .. నాన్నను మార్చింది
1960 ల నుంచి 1990, 2000 వరకు నాన్నది అదే సీరియస్ పాత్ర.. కానీ రోజులు మారుతున్న కొద్దీ నాన్నలోని కాఠిన్యం కరిగిపోతూ వస్తోంది.. నాన్నలో కూడా అమ్మలాంటి సున్నితత్వం... పిల్లలపట్ల ఎనలేని ప్రేమ పొటమరిస్తున్నాయి. ఇవన్నీ కాలం తెస్తున్న మార్పులే. గ్లోబలైజేషన్ కారణంగా ఉపాధి అవకాశాలు పెరగడం.. ఉమ్మడికుటుంబాల ప్రాబల్యం తగ్గడం.. ఎక్కడికక్కడ ఉపాదివేటలో పట్టణాలకు వలసవెళుతున్న కుటుంబాలు(Families) అక్కడే స్థిరపడడం వంటివి నాన్న పాత్రలో మార్పులు తెస్తోంది. పట్టణానికి చేరిన నాన్న.. తన కుటుంబాన్ని తానే చూసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ తమ బిడ్డలకు సాయం చేసేందుకు బామ్మలు.. మామ్మలు లేరు.. తల్లి ఒక్కతీ పనులు చేసుకోదు .. చేసుకోలేదు.. దరిమిలా నాన్న కూడా అమ్మకు పనుల్లో తోడుగా నిలవాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది. ఈక్రమంలోనే నాన్న కూడా సున్నితత్వాన్ని సంతరించుకుంటున్నాడు . గత పాతిక ముప్పై ఏళ్ళ క్రితం జనరేషన్లకు ఊహాకు కూడా అందని సేవలు ఇప్పుడు నాన్న తన బిడ్డలకు చేస్తున్నాడు. 1980ల్లో 43 శాతం మంది తండ్రులకు తమ పిల్లల \డైపర్లు మార్చడం అనేది తెలియదట ప్రస్తుతానికి అది 3 శాతానికి తగ్గింది. అంటే ఇప్పుడు తండ్రులు పిల్లల సేవల్లో(Father-Kids Relation) తల్లితోబాటు సమానంగా బాధ్యత తీసుకుంటున్నారట.
నాన్నతోనే స్నేహం ఇప్పుడు
అప్పట్లో సీరియస్ పాత్రలో ఉండే నాన్న ఇప్పుడు పిల్లలపట్ల అత్యంత ప్రేమతో ఉంటున్నారట. పిల్లలకు కెరీర్ సంబంధ సలహాలు ఇవ్వడం.. వారికి సైకిల్.. బైక్.. నేర్పడం.. వేలు పట్టుకుని నడిపించడం.. సాధ్యమైనంత ఎక్కువటైం పిల్లలతో గడపడం.. కథలు చెప్పడం.. టూర్లకు తీసుకెళ్లడం.. పిల్లలకు స్నానం చేయించడం.. వాళ్లతో పడుకోవడం.. ఇలా ప్రతి పనిలోనూ నాన్న తోడుగా ఉంటున్నాడు.. అమ్మలా మారిపోతున్నాడు. గ్లోబలైజేషన్(Globalisation) తెచ్చిన మార్పులతో నాన్నల పాత్రల్లోనూ మార్పులు వస్తున్నాయి..
:::సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment