మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో అందరినీ ఆశ్చర్యపరిచే ఉదంతం వెలుగు చూసింది. 28 ఏళ్ల క్రితం తప్పిపోయి, ఎక్కడో ఉన్న కుమారుడు అకస్మాత్తుగా ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే అతని స్థానంలో 12 ఏళ్ల క్రితమే ఒక అపరిచితుడు వారి కుమారుడినంటూ వారి ఇంటికి వచ్చి ఉంటున్నాడు.
ఆ ఇంటికి కొత్తగా వచ్చిన కుమారుడు తాను కొన్నేళ్ల క్రితమే సన్యాసం తీసుకున్నానని కుటుంబసభ్యులకు తెలిపాడు. తాను హరిద్వార్‌లో సన్యాసుల మధ్య ఉంటున్నానని, తన పేరును కళ్యాణ్ గిరి మహారాజ్‌గా మార్చుకున్నానని తెలిపాడు. అయితే ఆ కుటుంబ సభ్యులు ఊహించని విధంగా ఒక వ్యక్తి వచ్చి, తాను మీ ఇంటి మనిషినేనని చెప్పడంతో వారంతా తెగ ఆశ్చర్యపోయారు.
వెంటనే కుటుంబ సభ్యులు ఇంతకాలం తమ ఇంటిలోని మనిషిలా ఉన్న వ్యక్తిని ప్రశ్నించగా అతను వారికి అసలు విషయాన్ని చెప్పాడు. సినిమా కథను తలపించే ఈ రియల్ స్టోరీ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఖాండ్వా జిల్లాలోని ఖల్వా గిరిజన డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని కలాం ఖుర్ద్ గ్రామంలో ఈ విచిత్ర ఉదంతం వెలుగు చూసింది. ఈ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఇన్నాళ్లూ కుటుంబానికి దూరంగా ఉన్నాడు. 28 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. కథలో ట్విస్ట్ 12 ఏళ్ల క్రితం అంటే 2011లో చోటు చేసుకుంది. వారి ఇంటికి వచ్చిన ఒక సన్యాసి తాను 16 సంవత్సరాల వయస్సులో ఇంటి నుంచి వెళ్లిపోయిన మీ కుమారుడిని అని చెప్పుకున్నాడు. అప్పటి నుంచి అంటే గత 12 ఏళ్లుగా ఆ కుటుంబంతోపాటు ఉంటున్నాడు. అయితే ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత అసలు కొడుకు ఇంటికి రావడంతో నకిలీ కొడుకు బండారం బయటపడింది.
12 ఏళ్లుగా వారి ఇంట్లో ఉంటున్న వ్యక్తి.. ఇన్నాళ్లూ నాలుగు రోజులు ఇంట్లో ఉంటూ, కొన్ని రోజులు బయట సన్యాసి వేషంలో తిరుగుతూ వచ్చాడు. ఇలా కొన్నేళ్లుగా జరుగుతూ వస్తోంది. అయితే 28 ఏళ్ల తరువాత నిజమైన కుమారుడు తిరిగి రావడంతో.. అంతవరకూ కుమారునిగా నటించిన వ్యక్తి ఉత్తరప్రదేశ్ వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు ఫోనులో అతనితో మాట్లాడగా.. ఇన్నాళ్లూ వారి ఇంటిలో ఏర్పడిన లోటును తీర్చేందుకే తాను వారితో కొడుకునని చెప్పానని, ఇప్పుడు వచ్చిన వ్యక్తే అసలైన కుమారుడు అని చెప్పాడు.
ఇది కూడా చదవండి: ఈ వీడియో చూస్తే.. గాడిద అంటూ ఎవరినీ నిందించరు!
మరిన్ని వార్తల కోసం సాక్షి వాట్సాప్ ఛానల్ వీక్షించండి:
Comments
Please login to add a commentAdd a comment