సబ్‌కలెక్టరేట్‌లో వృద్ధుడు కృష్ణమూర్తిని విచారిస్తున్న ఆర్డీఓ మురళీ
మదనపల్లె : తనకున్న యావదాస్తిని కొడుకు పేరుతో రాసి ఇస్తే.. కనికరం లేకుండా తనను ఇంటి నుంచి గెంటేశాడని, వృద్ధాప్యంలో పోషణకు తనకు మెయింటెన్స్ ఇప్పించాల్సిందిగా ఓ తండ్రి సబ్ కలెక్టరేట్‌లో సీనియర్ సిటిజన్స్ కోర్టులో కేసు వేశాడు. ఇందులోభాగంగా సోమవారం ఆర్డీఓ ఎం.ఎస్.మురళీ కేసును విచారించారు.
మదనపల్లె మండలం కొత్తవారిపల్లె పంచాయతీ అండేవారిపల్లెకు చెందిన అండేకృష్ణమూర్తి (85)కు ఒక కుమారుడు అండే వెంకటనాగేశ్వరం, నలుగురు కుమార్తెలు ఉన్నారు. అండే కృష్ణమూర్తి పెద్ద భూస్వామిగా గ్రామంలో పేరు ఉండటమే కాకుండా మదనపల్లె పట్టణంలో కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి.
వీటన్నంటినీ ఆయన తన నలుగురు కూతుళ్లను కాదని, ఎస్‌బీఐ కాలనీలో నివాసం ఉంటున్న కొడుకు అండే వెంకటనాగేశ్వరం పేరుతో రాసి ఇచ్చాడు. ఆస్తి మొత్తం తన పేరు మీదకు బదలాయింపు జరిగాక వెంకటనాగేశ్వరం తండ్రిని పట్టించుకోకుండా ఇంటి నుంచి బయటకు పంపేశాడు.
దీంతో ఆయన దిక్కుతోచని స్థితిలో భార్యతో కలిసి రెండో కుమార్తె వద్ద ఆశ్రయం పొందాడు. యావదాస్తిని కొడుకు పేరు మీద రాసి, వృద్ధాప్యంలో ఇబ్బందులు పడాల్సి వస్తోందన్న దిగులుతో ఏడాదిన్నర క్రితం అండే కృష్ణమూర్తి భార్య చనిపోయింది.
కుమార్తె వద్ద ఉంటున్న కృష్ణమూర్తికి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తుండటంతో తన వైద్యఖర్చులకు ప్రతినెలా కుమారుడి నుంచి రూ.10,000 మెయింటెన్స్ ఇప్పించాల్సిందిగా సీనియర్ సిటిజన్స్ కోర్టులో కేసు వేశాడు.
దీనిపై ఆర్డీఓ ఎం.ఎస్.మురళీ ఇప్పటికే రెండుసార్లు విచారించి అండే వెంకటనాగేశ్వరంను హాజరుకావాల్సిందిగా కోరినప్పటికీ విచారణకు రాలేదు. దీంతో అతడికి ఫైనల్ నోటీసు పంపుతున్నామని, విచారణకు హాజరుకాని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ ఎం.ఎస్.మురళీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment