ఎవరో కావాలని చేయిస్తున్నారు
మనోవర్తి కేసుపై పృథ్వీరాజ్
సాక్షి, హైదరాబాద్: ఎవరో కావాలని తన కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నారని, ఇది బాధాకరమని ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్ అన్నారు. 2015లో తన కూతురు పెళ్లి జరిపించానని, కుటుంబాన్ని పట్టించుకోకపోతే పెళ్లి ఎలా చేస్తానని ప్రశ్నించారు. తమను పృథ్వీరాజ్ పట్టించుకోవడంలేదని ఆయన భార్య శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఫ్యామిలీ కోర్టు.. మనోవర్తి కింద శ్రీలక్ష్మికి నెలకు రూ. 8 లక్షలు చెల్లించాలని ఉత్తర్వులు జారీచేసింది.
కేసు విషయమై విదేశాల్లో షూటింగ్‌లో ఉన్న పృథ్వీరాజ్‌తో ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా.. ‘కేసు న్యాయస్థానంలో ఉన్నప్పుడు నేనేం మాట్లాడకూడదు. అడిగారు కాబట్టి చెబుతున్నా. నాకెలాంటి నోటీసులు రాలేదు. పైగా విడిపోవడానికి నేను సిద్ధంగా లేను’ అన్నారు. పృథ్వీరాజ్, శ్రీలక్ష్మిల తనయుడు సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అమ్మానాన్నల గొడవలు ఉన్న మాట నిజమేనని, అయితే అవి కోర్టు వరకు వెళ్తాయని అనుకోలేదన్నారు. అమ్మగారు చాలా అమాయకురాలని, ఎవరో తన వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నారన్నారు. విదేశాల నుంచి నాన్న రాగానే పూర్తి వివరాలు తెలియజేస్తారని చెప్పారు.