
జైపూర్ : బాల్య వివాహం అయిన 12 ఏళ్ల తర్వాత తన వివాహాన్ని రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించిందో యువతి. ఈ సంఘటన రాజస్తాన్‌లోని బిల్‌వారా జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... బిల్‌వారా జిల్లా పలాడి గ్రామానికి చెందిన మన్షి అనే యువతికి 7 ఏళ్ల వయసున్నపుడు 2009లో బాల్య వివాహమైంది. ఆ తర్వాతినుంచి ఇంటి వద్దే ఉంటూ చదువు కొనసాగిస్తోంది. ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. ఈ నేపథ్యంలో అత్తంటి వారు కాపురానికి రావాలంటూ యువతిపై ఒత్తిడి తేసాగారు. సదరు యువతి ఇందుకు ఒప్పుకోలేదు.
తనకు జరిగిన బాల్య వివాహం చెల్లదని తేల్చి చెప్పింది. కాపురానికి రాకపోతే పంచాయితీలో పెట్టి కుటుంబాన్ని సామాజికంగా వెలివేయిస్తామని బెదిరింపులకు దిగారు అత్తింటివారు. వారి వేధింపులు ఎక్కువవటంతో దాదాపు 12 ఏళ్ల తర్వాత సారథి ట్రస్ట్ సహకారంతో మన్షి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఫ్యామిలీ కోర్టు జడ్జి ముకేశ్ భార్గవ.. మన్షి భర్తకు సమన్లు జారీ చేశారు. బాల్య వివాహాల విషయంలో కఠినమైన చర్యలుంటాయని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment