రేఖ(ఎడమ), ఉద్యమకారిణి కృతి(కుడి)
ఆ అమ్మాయి వయసు 21 ఏళ్లు. బాగా చదువుతుంది. నర్సు కావాలన్నది ఆమె కల. కానీ, ఊహ తెలియని వయసులో పెద్దలు చేసిన పనికి.. నరకంలో పడింది. మానసికంగా కుమిలిపోయింది. చివరికి.. ఓ ఉద్యమకారిణి సహకారం, కోర్టు తీర్పుతో మొత్తానికి ఆటంకాలు తొలగి ఆమెకు ఇష్టంలేని వివాహ బంధనం నుంచి విముక్తి లభించింది.
రాజస్థాన్ జోధ్‌పూర్‌కు చెందిన రేఖ(21).. విచిత్రమైన పరిస్థితుల నడుమ జోధ్‌పూర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. 2002లో అంటే.. ఏడాది వయసున్నప్పుడు రేఖను అదే ఊరికి చెందిన ఓ పిలగాడికి ఇచ్చి వివాహం చేశారు ఆమె తల్లిదండ్రులు. ఇంటి పెద్ద అనారోగ్యంతో.. బంధువుల ఒత్తిడి మేరకు ఈ చర్యకు ఉపక్రమించారు. అయితే.. ఆ తర్వాత ఆ పసికందు జీవితం సాఫీగానే సాగింది.
ఈమధ్య.. కొన్నాళ్ల కిందట అత్తింటి వాళ్లమంటూ కొందరు రేఖ ఇంటికి రావడంతో.. ఆమె షాక్ తింది. ఇన్నాళ్లూ విషయం తెలియకుండానే పెంచారు ఆమెను. దీంతో తల్లిదండ్రులు, చుట్టాల ఒత్తిడి మేరకు ఆమె బలవంతంగానే మెడలో తాళిబొట్టు వేసుకుని.. ఆ ఇంట కోడలిగా అడుగుపెట్టింది. అయితే.. అక్కడికి వెళ్లాక చదువుకోనీయకుండా భర్త, అతని తల్లిదండ్రులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో మానసికంగా కుమిలిపోయింది. మరోవైపు ఇన్నాళ్లపాటు వివాహం అయ్యిందనే విషయం దాచినందుకు.. తమ దగ్గరికి పంపనందుకు కుల పరిహారం పేరిట రేఖ తల్లిదండ్రుల నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేయసాగారు. ఈ పరిస్థితుల్లో..
రేఖకు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కృతి భారతి గురించి తెలిసింది. కృతి భారతి.. ప్రముఖ ఉద్యమకారణి. అంతేకాదు.. బీబీసీ అత్యంత స్ఫూర్తిదాయకమైన 100 మహిళల్లో ఒకరిగా చోటు సంపాదించుకున్న వ్యక్తి కూడా. ఆమె సాయంతో జోధ్‌పూర్ ఫ్యామిలీకోర్టులో వివాహ రద్దు కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది రేఖ. ఆ కుటుంబం నుంచి విముక్తి కలిగిస్తూ.. చదువుకోవాలనే తన ఆశయానికి సాయపడాలంటూ కోర్టును వేడుకుంది.
దీంతో.. బాల్యవివాహంగా పరిగణిస్తూ.. నేరంగా పేర్కొంటూ న్యాయమూర్తి ప్రదీప్ కుమార్ మోదీ వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. విశేషం ఏంటంటే.. ఆమె పుట్టినరోజు నాడే తీర్పు రావడం. దీంతో ఇష్టం లేకుండా.. అదీ తనకు ఊహతెలియని వయసులో జరిగిన వివాహ రద్దు తీర్పు కాపీలను ఆమె కానుకగా కృతి నుంచి అందుకుంది.
ఇదీ చదవండి: ఇది కథ కాదు.. 75 ఏళ్లకు కలిసిన రక్తసంబంధం
Comments
Please login to add a commentAdd a comment