భోపాల్: కుటుంబ కథా చిత్రాల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన ‘శుభలగ్నం’ సినిమా మీకు గుర్తుంది కదా. ఇందులో ఆమని తన భర్త అయిన జగపతి బాబును రోజాకు కోటి రూపాయలకు అమ్మేస్తుంది. 90లలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా అచ్చం ఈ సినిమాను తలపించే ఓ సంఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. 1.5 కోట్ల రూపాయలు తీసుకుని తన భర్తను మరో మహిళకు సొంతం చేసిన ఈ సంఘటన మంగళవారం భోపాల్ ఫ్యామిలీ కోర్టులో జరిగింది. ఈ కేసు స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాలు.. తన తండ్రి ఆఫీసులో మరో మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకుని తరచూ తన తల్లితో గొడవ పడుతున్నాడంటూ ఓ బాలిక భోపాల్ పోలీసు స్టేషన్‌లో ఇటీవల ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో తన తల్లిదండ్రులు తరచూ గొడవ పడటం వల్ల ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయిందని, దీని వల్ల తాను, తన చెల్లెలు చదువు మీద ధ్యాస పెట్టలేకపోతున్నామంటూ బాలిక పోలీసుల ముందు వాపోయింది.
బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసు విచారణను భోపాల్ ఫ్యామిలీ కోర్టుకు తరలించారు. దీంతో దీనిపై విచారణ ప్రారంభించిన ఫ్యామిలీ కోర్టు బాలిక తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చింది. ఈ కౌన్సిలింగ్‌లో బాలిక తండ్రికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో కోర్టు ఆ వ్యక్తిని తన భార్యతోనే ఉండాలని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయితే అతడు తన ప్రియురాలితోనే ఉంటానని చెప్పాడు. అంతేగాక తన భార్య నుంచి విడాకులు కావాలని కోరాడు. దీనికి అతడి భార్య నిరాకరిస్తూ.. అతను మరో పెళ్లి చేసుకుని తన దారి తను చూసుకుంటూ తన పిల్లల భవిష్యత్తు ఏంటని ప్రశ్నించింది. అయినప్పటికి అతడు తన ప్రియురాలితోనే ఉంటానని స్పష్టం చేశాడు. ఈ క్రమంలో కోర్టు వారికి పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చింది. అయినప్పటికి సమస్యకు పరిష్కారం దొరకలేదు.
ఈ క్రమంలో చివరకు అతడి భార్య ఓ షరతుపై విడాకులకు అంగీకరించింది. అదేంటంటే తన భర్త ఆమెతో ఉండాలంటే సదరు మహిళ తనకు డబ్బులు చెల్లించాలని చెప్పింది. దీనికి కూడా తన భర్త ప్రియురాలు అంగీకరించడంతో ఆ మహిళ తనకు ఖరీదైన ప్లాటుతో పాటు రూ. 1.5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీనికి ఆమె భర్త ప్రియురాలు తాను సెటిల్‌మెంట్ క్యాష్ కింద కేవలం రూ. 27 లక్షలు మాత్రమే ఇవ్వగలనని చెప్పింది. దీనికి సదరు మహిళ తాను అడిగింత డబ్బు చెల్లిస్తేనే విడాకులు ఇస్తానని స్పష్టం చేసింది. అయితే ఈ డబ్బును తన పిల్లల భవిష్యత్తు కోసమే తాను డిమాండ్ చేశానని, తనకు డబ్బు మీద ఆశతో కాదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment