ఉదయాన్నే త్వరగా నిద్ర లేవడం లేదని, రుచికరంగా వంట చేయడం లేదని ఓ భర్త, తన భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్నాడు. కానీ ఇది ఏ మాత్రం సబబు కాదని, ఆ ఆరోపణల్లో ఎలాంటి రుజువు లేదని ఆ విడాకుల పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. వివరాల్లోకి వెళ్తే.. శాంటాక్రూజ్‌కు చెందిన ఓ వ్యక్తి, ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ వేశాడు. అదీ కూడా భార్య సరిగ్గా వంట చేయడం లేదనే సిల్లీ కారణంతో. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్టు, భర్త వేసిన విడాకుల పిటిషన్‌ను కొట్టివేసింది.
భార్య ఉద్యోగిని అని, ఆమె తన భర్త పట్ల ఎలాంటి క్రూరత్వం ప్రదర్శించడం లేదని ఫ్యామిలీ కోర్టు తేల్చింది. అంతేకాక ఆమె అన్ని రకాల పనులను తానే చేస్తుందని, సరుకులు కొనుగోలు చేయడం, ఫిర్యాదుదారునికి, వారి కుటుంబ సభ్యులకు వంట చేసి పెట్టడం, అన్ని ఇతర పనులు ఆమె నిర్వహిస్తుందని ఫ్యామిలీ కోర్టు విచారణలో తేలింది. కానీ ఫ్యామిలీ కోర్టు తీరును నిరసిస్తూ.. ఆ వ్యక్తి బాంబే హైకోర్టుకి వెళ్లాడు. జస్టిస్ కేకే టేటెడ్, సారాం కోట్వాల్ నేతృత్వంలోని బెంచ్ సైతం ఫ్యామిలీ కోర్టు తీర్పునే సమర్థించింది.
రుచికరంగా భోజనం వండటం లేదనే ఆరోపణలతో ఫిర్యాదుదారుడు విడాకులు కోరడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని హైకోర్టు సైతం పేర్కొంది. అయితే ఆమెపై ఆ నిందలు మాత్రమే కాకుండా.. ఉదయాన్నే ఆమెను నిద్ర లేపితే, తమ కుటుంబ సభ్యులని, తనని తిడుతుందనీ ఆరోపించాడు. ఉద్యోగం నుంచి సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి తిరిగి వచ్చాక, నిద్ర పోతుందని, రాత్రి 8.30కు వంట చేస్తుందని, ఆ వంట కూడా రుచికరంగా చేయదంటూ ఆరోపణలు గుప్పించాడు. తనతో కాస్త సమయమైన గడపదంటూ చెప్పుకొచ్చాడు. ఏదైనా పని వల్ల ఇంటికి లేటుగా వస్తే, కనీసం ఒక్క గ్లాస్ మంచినీళ్లు కూడా ఇవ్వదని తెలిపాడు. ఈ ఆరోపణలన్నింటిన్నీ భార్య తోసిపుచ్చింది.
ఉద్యోగానికి వెళ్లే ముందే తమ కుటుంబం మొత్తానికి వంట చేసి వెళతానని చెప్పింది. అన్ని సాక్ష్యాధారాలతో సహా కోర్టుకు సమర్పించింది. తన అత్తింటి వారే వేధిస్తున్నట్టు ఆమె తన పిటిషన్‌లో పేర్కొంది. ఫిర్యాదుదారుడి పేర్కొన్న విషయాలను నమ్మడం చాలా కష్టంగా ఉందని, తాను చెప్పే ఏ విషయంలోనూ భార్య క్రూరత్వం ప్రదర్శిస్తున్నట్టు లేదని బెంచ్ తేల్చింది. కేవలం ఉద్యోగం చేయడం మాత్రమే కాకుండా.. ఉదయం, సాయంత్రం తానే వంట చేయడం, కూరగాయలు, గ్రోసరీలు కొనుక్కోని రావడం అంతా తానే చేస్తుందని బెంచ్ తెలిపింది. ఈ మొత్తం వ్యవహారాన్నంతటిన్నీ పరిశీలించిన అనంతరం భర్త కోరినట్టు విడాకులు మంజూరు చేయలేమని ఆ విడాకుల పిటిషన్‌ను కొట్టిపారేసింది.
Comments
Please login to add a commentAdd a comment