నమస్తే లాయరమ్మా, బాగున్నారా? | namasthe layaramma, Bagunnara? | Sakshi
Sakshi News home page

నమస్తే లాయరమ్మా, బాగున్నారా?

Published Sun, Dec 7 2014 1:26 AM | Last Updated on Wed, May 29 2019 3:25 PM

నమస్తే లాయరమ్మా, బాగున్నారా? - Sakshi

నమస్తే లాయరమ్మా, బాగున్నారా?

తపాలా
ఇది చాన్నాళ్ల క్రితం జరిగిన సంఘటన. నా జీవితంలో నేనెప్పటికీ మర్చిపోలేని సంఘటన.ఫ్యామిలీ కోర్టులో  ఒకావిడకు నన్ను జడ్జిగారు, ‘అమికస్ క్యూరీ’గా అపాయింట్ చేయడం జరిగింది. అంటే ఫీజు ఇచ్చుకోలేనివారికి, ఫ్రీగా కేసు వాదించడానికి ఒప్పుకున్న అడ్వకేట్స్‌ను జడ్జి ‘అమికస్ క్యూరీ’గా నియమిస్తారన్నమాట. ఆ దిగువ మధ్యతరగతి ఇలాల్లిని చూసి జాలితో ఆ కేసు చేయడానికి ఒప్పుకున్నాను. భర్త విడాకుల కేసు ఫైల్ చేస్తే ఈవిడ, ఇద్దరు ఆడపిల్లలకి మెయింటెనెన్స్ కేసు అదే కోర్టులో వేసింది.
 
ఆమె ప్రతి వాయిదాకు మాసిపోయిన అవే పాత బట్టలతో వచ్చేది. దాంతో ఆమె పట్ల జాలితో నా హృదయం నిండిపోయేది. ఇద్దరు బిడ్డలతో ఆమె ఎలా బతుకుతుందో ఏమోనని కేసు గట్టిగానే వాదించాను. మొత్తానికి న్యాయమూర్తి విడాకుల కేసు కొట్టేయడం, భార్య, ఇద్దరు పిల్లలకుగానూ భర్త మనోవర్తి ఇచ్చేలా ఆదేశించడం  జరిగింది. ఆమె కళ్లనీళ్లతో నా చేతులు పట్టుకుని థాంక్స్ చెప్పి వెళ్లిపోయింది.అలాగే, అతడు చెల్లించకపోతే అరియర్స్ కోసం కేసు వేసేది. సంవత్సరానికి ఒకసారి మొత్తంగా ఆ డబ్బు వచ్చేది. ఆవిడ భర్త విమానాశ్రయ ఉద్యోగి కావడంతో తప్పించుకోలేకపోయేవాడు. అరెస్టుకు భయపడి, ఈవిడను తిట్టుకుంటూ అయినా ఒక మొత్తంగా కట్టేసేవాడు.
 
అదలావుండగా- నాకు మా డాక్టర్ సుశీల ఆంటీ (వైజాగ్) వల్ల ఒక మంచి అలవాటు వచ్చింది. నాదైనా, మా వారిదైనా, మా అబ్బాయిదైనా ఎవరిపుట్టిన రోజుకైనా అనాథాశ్రమం, వృద్ధాశ్రమాల్లో డొనేషన్స్ ఇస్తుంటాం. ఆ యేడు కూడా అదే అలవాటుతో సికింద్రాబాద్‌లోని ఒక అనాథాశ్రమానికి వెళ్లాను. గేట్ దగ్గరే కారు ముందు ఒక అందమైన మధ్యవయసు స్త్రీ ఖరీదైన బట్టలతో నిలబడి ఉంది. ఎవరా అని పరికించి చూశానుగానీ గుర్తురాలేదు.
 
నేను లోపలికి వెళ్లి విరాళం ఇచ్చాను. ఆమె కూడా విరాళం ఇవ్వడానికే వచ్చింది. నాకంటే ఎక్కువే పే చేసింది. బయటకు వస్తుండగా- ‘‘నమస్తే లాయరమ్మా! బాగున్నారా?’’ అన్నది. నేను గుర్తుపట్టలేకపోతే, తనే పేరు చెప్పి, గుర్తుచేసింది. నన్ను అమికస్ క్యూరీగా అపాయింట్ చేయించుకున్నది ఈమే! నేను విస్తుపోయాను, ఎప్పుడూ ఒకే చీర, జాకెట్‌తో వచ్చే ఆవిడ, ఖరీదైన బట్టలతో కారులో వచ్చిన ఈవిడా ఒకటేనా అని! కాస్త సంతోషంగా కూడా అనిపించింది.అప్పుడు చెప్పిందావిడ, ‘‘లాయరమ్మా! నేను మంచి ఉద్యోగంలో ఉన్నాను. నాకు, నా పిల్లల పోషణకెటువంటి కష్టం లేదు.

కానీ నన్ను కట్టుకుని, బాధ్యత వదిలేసి, ఇద్దరు ఆడపిల్లల్ని కన్నాననే నెపంతో నన్ను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ, ఇంకొక స్త్రీతో రహస్య జీవనం గడుపుతున్న ఆ మగాడికి నాకు తెల్సినంతలో శిక్ష వేయగలిగాను కదా. కాకపోతే మీకు, కోర్టువారికి నేను పిల్లల్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నానని అబద్ధం చెప్పడం తప్పే. డైవోర్స్ గ్రాంట్ అయ్యుంటే అతన్ని పట్ట సాధ్యమయ్యేది కాదు. నేను మంచి ఉద్యోగంలో ఉన్నానని కోర్టుకు నిజం చెప్తే, నాకు, పిల్లలకు ఇంత మెయింటెనెన్స్ వచ్చేది కాదు.

పిల్లల్ని కన్నందుకు, నన్ను కట్టుకున్నందుకు, మమ్మల్ని పోషించాల్సిన బాధ్యత నా భర్తదే కదా! అందుకే అది తప్పని నాకనిపించడం లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ డబ్బంతా ఈ అనాథ శరణాలయానికి ప్రతిసారీ ఇచ్చేస్తాను. నా హక్కును, నా పిల్లల హక్కును చట్టపరంగా నా భర్త నుండి సాధించుకున్నాను. అందుకు సాయం చేసినందుకు మీకు వేనవేల కృతజ్ఞతలు. మిమ్మల్ని మోసం చేసినందుకు క్షమించండి’’ అని చెప్పింది. ఆ దివ్యమైన రోజు జీవితం నాకో కొత్త పాఠాన్ని నేర్పింది. ఆ పాఠాన్ని నేర్చుకునే అవకాశమిచ్చినందుకు నా వృత్తికి ధన్యవాదాలు.
 - నిశ్చల సిద్ధారెడ్డి,అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement