Amicus Curie
-
మతమార్పిళ్లకు రాజకీయ రంగు పులమొద్దు: సుప్రీం
న్యూఢిల్లీ: ‘‘మతమార్పిళ్లు చాలా సీరియస్ విషయం. దీనికి రాజకీయ రంగు పులమొద్దు’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. బలవంతపు మతమార్పిళ్లను అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టేలా కేంద్ర రాష్ట్రాలను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ఎం షా, జస్టిస్ సి.టి.రవికుమార్ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఇది రాజకీయ ప్రేరేపిత పిటిషన్ అని తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది పి.విల్సన్ చేసిన వాదనను తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘ఇలా వాదించేందుకు మీకు వేరే కారణాలుండొచ్చు. అంతమాత్రాన కోర్టు విచారణను మరోలా మార్చుకునేందుకు ప్రయత్నించకండి. మీ రాష్ట్రంలో కూడా ఇలాంటివి జరుగుతుంటే అది కచ్చితంగా తప్పే. దీన్ని రాజకీయం చేయకండి’’ అంటూ హితవు పలికింది. ఈ కేసులో అమికస్ క్యూరీగా వ్యవహరించి ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచించాలని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణిని కోరింది. -
జాతీయ ప్రణాళిక కావాలి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తుండడం, మరణాల సంఖ్య పెరుగుతుండడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా బాధితులకు ప్రాణవాయువు, అత్యవసర ఔషధాలు అందుబాటులో లేకపోవడం విచారకరమని పేర్కొంది. కరోనా కట్టడి వ్యూహం, ఆక్సిజన్, ఔషధాల సరఫరాపై జాతీయ ప్రణాళిక అవసరమంది. దేశంలో కరోనా కల్లోల పరిస్థితిని సుప్రీంకోర్టు గురువారం సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఇండియాలో కోవిడ్ వ్యాక్సినేషన్ సాగుతున్న విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. మహమ్మారి వ్యాప్తిని అరికట్టడం కోసం రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించే జ్యుడీషియల్ అధికారం హైకోర్టులకు ఉందా? లేదా? అనేది పరిశీలిస్తామంది. దేశంలో కనీసం 6 హైకోర్టుల్లో కోవిడ్ సంబంధిత అంశాలు విచారణలో ఉన్నాయని గుర్తుచేసింది. సుమోటో విచారణలో తమకు సహకరించేందుకు సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వేను అమికస్ క్యూరీగా సుప్రీంకోర్టు ధర్మాసనం నియమించింది. కోర్టులు వాటి అధికారాలను ఉపయోగించుకుంటున్నాయి ఇండియాలో కరోనా ప్రస్తుత పరిస్థితి, నియంత్రణ చర్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. కొన్ని అంశాలపై సుమోటోగా విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు తెలియజేసింది. ఢిల్లీ, బాంబే, సిక్కిం, మధ్యప్రదేశ్, కలకత్తా, అహ్మదాబాద్ హైకోర్టుల్లో కరోనా పరిస్థితికి సంబంధించిన అంశాలు విచారణలో ఉన్నాయని తెలిపింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆయా న్యాయస్థానాలు వాటి పరిధిలోని అధికారాలను ఉపయోగించుకుంటున్నాయని వివరించింది. ఒక కోర్టు ఒక అంశానికి, మరో కోర్టు మరో అంశానికి ప్రాధాన్యం ఇస్తుండడంతో గందరగోళం తలెత్తుతోందని వెల్ల డించింది. కాబట్టి నాలుగు కీలక అంశాలు.. ఆక్సిజన్ సరఫరా, అత్యవసర ఔషధాల పంపిణీ, వ్యాక్సినేషన్ విధానం, లాక్డౌన్ ప్రకటనపై హైకోర్టులకు ఉన్న అధికారంపై దృష్టి పెడతామని స్పష్టం చేసింది. ఈ నాలుగు అంశాలపై ప్రభుత్వానికి నోటీసు ఇస్తున్నామని, వీటిపై జాతీయ ప్రణాళిక తమకు కావాలని వ్యాఖ్యానించింది. జాతీయ ప్రణాళికను హైకోర్టులకు సమర్పించాలని సొలిసిటర్ జనరల్‌కు ధర్మాసనం సూచించింది. -
నమస్తే లాయరమ్మా, బాగున్నారా?
తపాలా ఇది చాన్నాళ్ల క్రితం జరిగిన సంఘటన. నా జీవితంలో నేనెప్పటికీ మర్చిపోలేని సంఘటన.ఫ్యామిలీ కోర్టులో ఒకావిడకు నన్ను జడ్జిగారు, ‘అమికస్ క్యూరీ’గా అపాయింట్ చేయడం జరిగింది. అంటే ఫీజు ఇచ్చుకోలేనివారికి, ఫ్రీగా కేసు వాదించడానికి ఒప్పుకున్న అడ్వకేట్స్ను జడ్జి ‘అమికస్ క్యూరీ’గా నియమిస్తారన్నమాట. ఆ దిగువ మధ్యతరగతి ఇలాల్లిని చూసి జాలితో ఆ కేసు చేయడానికి ఒప్పుకున్నాను. భర్త విడాకుల కేసు ఫైల్ చేస్తే ఈవిడ, ఇద్దరు ఆడపిల్లలకి మెయింటెనెన్స్ కేసు అదే కోర్టులో వేసింది. ఆమె ప్రతి వాయిదాకు మాసిపోయిన అవే పాత బట్టలతో వచ్చేది. దాంతో ఆమె పట్ల జాలితో నా హృదయం నిండిపోయేది. ఇద్దరు బిడ్డలతో ఆమె ఎలా బతుకుతుందో ఏమోనని కేసు గట్టిగానే వాదించాను. మొత్తానికి న్యాయమూర్తి విడాకుల కేసు కొట్టేయడం, భార్య, ఇద్దరు పిల్లలకుగానూ భర్త మనోవర్తి ఇచ్చేలా ఆదేశించడం జరిగింది. ఆమె కళ్లనీళ్లతో నా చేతులు పట్టుకుని థాంక్స్ చెప్పి వెళ్లిపోయింది.అలాగే, అతడు చెల్లించకపోతే అరియర్స్ కోసం కేసు వేసేది. సంవత్సరానికి ఒకసారి మొత్తంగా ఆ డబ్బు వచ్చేది. ఆవిడ భర్త విమానాశ్రయ ఉద్యోగి కావడంతో తప్పించుకోలేకపోయేవాడు. అరెస్టుకు భయపడి, ఈవిడను తిట్టుకుంటూ అయినా ఒక మొత్తంగా కట్టేసేవాడు. అదలావుండగా- నాకు మా డాక్టర్ సుశీల ఆంటీ (వైజాగ్) వల్ల ఒక మంచి అలవాటు వచ్చింది. నాదైనా, మా వారిదైనా, మా అబ్బాయిదైనా ఎవరిపుట్టిన రోజుకైనా అనాథాశ్రమం, వృద్ధాశ్రమాల్లో డొనేషన్స్ ఇస్తుంటాం. ఆ యేడు కూడా అదే అలవాటుతో సికింద్రాబాద్‌లోని ఒక అనాథాశ్రమానికి వెళ్లాను. గేట్ దగ్గరే కారు ముందు ఒక అందమైన మధ్యవయసు స్త్రీ ఖరీదైన బట్టలతో నిలబడి ఉంది. ఎవరా అని పరికించి చూశానుగానీ గుర్తురాలేదు. నేను లోపలికి వెళ్లి విరాళం ఇచ్చాను. ఆమె కూడా విరాళం ఇవ్వడానికే వచ్చింది. నాకంటే ఎక్కువే పే చేసింది. బయటకు వస్తుండగా- ‘‘నమస్తే లాయరమ్మా! బాగున్నారా?’’ అన్నది. నేను గుర్తుపట్టలేకపోతే, తనే పేరు చెప్పి, గుర్తుచేసింది. నన్ను అమికస్ క్యూరీగా అపాయింట్ చేయించుకున్నది ఈమే! నేను విస్తుపోయాను, ఎప్పుడూ ఒకే చీర, జాకెట్‌తో వచ్చే ఆవిడ, ఖరీదైన బట్టలతో కారులో వచ్చిన ఈవిడా ఒకటేనా అని! కాస్త సంతోషంగా కూడా అనిపించింది.అప్పుడు చెప్పిందావిడ, ‘‘లాయరమ్మా! నేను మంచి ఉద్యోగంలో ఉన్నాను. నాకు, నా పిల్లల పోషణకెటువంటి కష్టం లేదు. కానీ నన్ను కట్టుకుని, బాధ్యత వదిలేసి, ఇద్దరు ఆడపిల్లల్ని కన్నాననే నెపంతో నన్ను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ, ఇంకొక స్త్రీతో రహస్య జీవనం గడుపుతున్న ఆ మగాడికి నాకు తెల్సినంతలో శిక్ష వేయగలిగాను కదా. కాకపోతే మీకు, కోర్టువారికి నేను పిల్లల్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నానని అబద్ధం చెప్పడం తప్పే. డైవోర్స్ గ్రాంట్ అయ్యుంటే అతన్ని పట్ట సాధ్యమయ్యేది కాదు. నేను మంచి ఉద్యోగంలో ఉన్నానని కోర్టుకు నిజం చెప్తే, నాకు, పిల్లలకు ఇంత మెయింటెనెన్స్ వచ్చేది కాదు. పిల్లల్ని కన్నందుకు, నన్ను కట్టుకున్నందుకు, మమ్మల్ని పోషించాల్సిన బాధ్యత నా భర్తదే కదా! అందుకే అది తప్పని నాకనిపించడం లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ డబ్బంతా ఈ అనాథ శరణాలయానికి ప్రతిసారీ ఇచ్చేస్తాను. నా హక్కును, నా పిల్లల హక్కును చట్టపరంగా నా భర్త నుండి సాధించుకున్నాను. అందుకు సాయం చేసినందుకు మీకు వేనవేల కృతజ్ఞతలు. మిమ్మల్ని మోసం చేసినందుకు క్షమించండి’’ అని చెప్పింది. ఆ దివ్యమైన రోజు జీవితం నాకో కొత్త పాఠాన్ని నేర్పింది. ఆ పాఠాన్ని నేర్చుకునే అవకాశమిచ్చినందుకు నా వృత్తికి ధన్యవాదాలు. - నిశ్చల సిద్ధారెడ్డి,అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ -
విభజనపై అమికస్ క్యూరీగా రవి
విచారణ సోమవారానికి వాయిదా సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియను వ్యతిరేకిస్తూ, రాష్ట్రపతి పాలనకు ఉద్దేశించిన అధికరణ 356ను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ దాఖలైన వ్యాజ్యంపై కోర్టుకు సహకరించేందుకు వీలుగా సీనియర్ న్యాయవాది ఎస్.రవిని అమికస్ క్యూరీ (కోర్టు ఆదేశం మేరకు అభిప్రాయం వివరించే న్యాయనిపుణుడు, కోర్టుకు సలహాదారు)గా హైకోర్టు నియమించింది. ఈ మొత్తం వ్యవహారంలో తమకు సహకరించాలని రవిని హైకోర్టు కోరింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కేసును తదుపరి విచారణ నిమిత్తం సోమవారానికి వాయిదా వేసింది. ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా, రాజకీయ పార్టీలు చేసిన తీర్మానాలు, ఇచ్చిన లేఖల ఆధారంగా రాష్ట్ర విభజన చేయడం తగదంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది జేపీ రావు ఇటీవల హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని మంగళవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. వాదనలు ప్రారంభంకాగానే జేపీ రావు స్పందిస్తూ, విభజనకు వ్యతిరేకంగా తాను ఇటీవల దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఇదే ధర్మాసనం కొట్టివేసిందని, ఇప్పుడు కూడా అదే అవకాశమున్నందున మరో ధర్మాసనానికి వ్యాజ్యాన్ని నివేదించాలని కోరారు. ఆ అవసరం లేదని, తామే వాదనలు వింటామని జేపీరావుకు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో కోర్టుకు సహకరించాలని సీనియర్ న్యాయవాది ఎస్.రవిని కోరింది. విచారణ సోమవారానికి వాయిదా పడింది.