విచారణ సోమవారానికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియను వ్యతిరేకిస్తూ, రాష్ట్రపతి పాలనకు ఉద్దేశించిన అధికరణ 356ను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ దాఖలైన వ్యాజ్యంపై కోర్టుకు సహకరించేందుకు వీలుగా సీనియర్ న్యాయవాది ఎస్.రవిని అమికస్ క్యూరీ (కోర్టు ఆదేశం మేరకు అభిప్రాయం వివరించే న్యాయనిపుణుడు, కోర్టుకు సలహాదారు)గా హైకోర్టు నియమించింది. ఈ మొత్తం వ్యవహారంలో తమకు సహకరించాలని రవిని హైకోర్టు కోరింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
కేసును తదుపరి విచారణ నిమిత్తం సోమవారానికి వాయిదా వేసింది. ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా, రాజకీయ పార్టీలు చేసిన తీర్మానాలు, ఇచ్చిన లేఖల ఆధారంగా రాష్ట్ర విభజన చేయడం తగదంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది జేపీ రావు ఇటీవల హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని మంగళవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. వాదనలు ప్రారంభంకాగానే జేపీ రావు స్పందిస్తూ, విభజనకు వ్యతిరేకంగా తాను ఇటీవల దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఇదే ధర్మాసనం కొట్టివేసిందని, ఇప్పుడు కూడా అదే అవకాశమున్నందున మరో ధర్మాసనానికి వ్యాజ్యాన్ని నివేదించాలని కోరారు. ఆ అవసరం లేదని, తామే వాదనలు వింటామని జేపీరావుకు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో కోర్టుకు సహకరించాలని సీనియర్ న్యాయవాది ఎస్.రవిని కోరింది. విచారణ సోమవారానికి వాయిదా పడింది.
విభజనపై అమికస్ క్యూరీగా రవి
Published Wed, Oct 30 2013 2:22 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement