న్యూఢిల్లీ: నిర్భయ దోషి వినయ్ శర్మ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తాను పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టాడు. వినయ్ శర్మ తరఫున అతడి లాయర్ ఏపీ సింగ్ ఈమేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కాగా నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తనకు ఉరిశిక్ష రద్దు చేసి, యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అర్జీ పెట్టుకోగా... ఫిబ్రవరి 1న ఆయన తిరస్కరించిన విషయం తెలిసిందే.
ఇక నిర్భయ కేసులో దోషులందరినీ ఒకేసారి ఉరితీయాలనీ, న్యాయపరమైన అవకాశాలన్నింటినీ వినియోగించుకోవడానికి వారికి ఢిల్లీ హైకోర్టు గడువు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన విషయం విదితమే. నిర్భయ దోషుల ఉరితీతపై స్టేకు వ్యతిరేకంగా నోటీసులు జారీ చేయడానికి న్యాయస్థానం విముఖత వ్యక్తం చేసింది. దోషులకు నోటీసులు ఇవ్వాలన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనతో జస్టిస్ భానుమతి జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్.బోపన్నలతో కూడిన ధర్మాసనం ఏకీభవించలేదు.
చదవండి: నిర్భయ కేసు.. ప్రస్తుత స్థితి
కాగా ఈ కేసులో దోషులైన ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్ న్యాయపరమైన అన్ని అవకాశాలు ఉపయోగించుకోగా.. వినయ్ శర్మ పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించగా... పవన్ గుప్తా కేవలం రివ్యూ పిటిషన్ మాత్రమే దాఖలు చేశాడు. ఇంకా అతడికి క్యూరేటివ్ పిటిషన్, క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశం ఉంది. ఇక ఒకే కేసులో దోషులైన వాళ్లందరికీ ఒకేసారి శిక్ష విధించాలని... చట్టపరంగా వాళ్లకు అన్ని అవకాశాలు కల్పించాలని ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాళ్లకు ఏడు రోజుల గడువు ఇస్తున్నట్లు ఫిబ్రవరి 5న పేర్కొంది. ఈ క్రమంలో దోషులు మరోసారి వరుసగా న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment