హక్కులకు ‘సుప్రీం’ ఛత్రం | Editorial On Jammu And Kashmir Restrictions In Supreme Court | Sakshi
Sakshi News home page

హక్కులకు ‘సుప్రీం’ ఛత్రం

Published Sat, Jan 11 2020 12:05 AM | Last Updated on Sat, Jan 11 2020 12:42 AM

Editorial On Jammu And Kashmir Restrictions In Supreme Court - Sakshi

అయిదు నెలలుపైగా ఆంక్షల చట్రంలో నలుగుతున్న జమ్మూ–కశ్మీర్‌కు సర్వోన్నత న్యాయస్థానంలో ఉపశమనం దొరికింది. వారం వ్యవధిలో ఈ ఆంక్షల విషయంలో నిర్ణయం తీసుకోవాలని జమ్మూ– కశ్మీర్‌ అధికారులను ఆదేశించడమే కాదు... తన తీర్పు ద్వారా భావప్రకటనా స్వేచ్ఛకు గ్యారెంటీ ఇస్తున్న రాజ్యాంగంలోని 19వ అధికరణ పరిధిని విస్తృతం చేస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెలువరించిన ఈ తీర్పు ఇంటర్నెట్‌ సేవల పునరుద్ధరణకు నిర్దిష్టమైన వ్యవధిని సూచించకపోయినా, నిరవధికంగా ఈ ఆంక్షలు కొనసాగించడం సరికాదని స్పష్టం చేసింది. పౌర స్వేచ్ఛకూ, వారి భద్రతకూ మధ్య ఉండాల్సిన సమతూకం ఏమిటన్నదే తమ ముందున్న అంశమని ధర్మాసనం చేసిన వ్యాఖ్య గమనించదగ్గది. ఈ తీర్పు వల్ల కశ్మీర్‌ పౌరులకు వెనువెంటనే చేకూరే ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ పౌరహక్కులకు ఎలాంటి ప్రతిబంధకాలూ ఉండరాదని కోరుకునేవారికి ఈ తీర్పు నైతికబలాన్నిస్తుంది.

వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా వదంతులు ప్రచారం కావడం, అవి అమాయక పౌరుల ప్రాణాలు బలిగొనడం గత అయిదారేళ్లుగా ఈ దేశ ప్రజలకు అనుభవమవుతూనే ఉన్నది. కనుక ఆ మాధ్యమాలు దుర్వినియోగం కాకుండా, పౌరుల ప్రాణాలకు ముప్పు కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వుంటుంది. అదే సమయంలో వారి ప్రాథమిక హక్కులకు భంగం కలగ కుండా చూడాలి. ఈ విషయంలో ప్రభుత్వాలు అత్యంత జాగరూకతతో వ్యవహరించినప్పుడే అవి ప్రజాస్వామిక ప్రభుత్వాలు అనిపించుకుంటాయి. జమ్మూ–కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న 370వ అధికరణాన్ని రద్దు చేసి, రాష్ట్ర ప్రతిపత్తిని మార్చి కేంద్రపాలిత ప్రాంతంగా చేసిన వెంటనే అక్కడ పెద్దయెత్తున అల్లర్లు జరగొచ్చునని, శాంతిభద్రతలకు భంగం కలిగించదల్చుకున్న శక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా సమన్వయంతో భద్రతా బలగాలపై దాడులకు పాల్పడవచ్చునని, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించవచ్చునని కేంద్ర ప్రభుత్వం భావించింది. నిరంతరం కల్లోలంగా వుండేచోట ఆ తరహా ముప్పును అంచనా వేయడం సబబే కావచ్చు.

కానీ ఆ సాకుతో నెలల తరబడి ఇంటర్నెట్, ఫోన్‌ సదుపాయాలను అడ్డుకోవడం ఏమాత్రం సమర్థనీయం కాదు. మొబైల్‌ సర్వీసుల పునరుద్ధరణ అక్టోబర్‌లో పాక్షికంగా పూర్తయింది. కానీ ఇంటర్నెట్‌ సదుపాయం ఇంతవరకూ లేదు. వేరే ప్రాంతాలకు చదువుకోసమో, కొలువుకోసమో వెళ్లివుంటున్న అనేకమంది జమ్మూ–కశ్మీర్‌లో వుంటున్న తమవారి యోగక్షేమాలు తెలియక ఎంతగా తల్లడిల్లారో చానెళ్లు చూస్తున్నవారికి తెలు స్తూనే వుంది. అలాగే జమ్మూ–కశ్మీర్‌ వాసులు సైతం బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి తమ సన్నిహితులతో సంభాషించలేక ఎన్నో అగచాట్లు ఎదుర్కొన్నారు. అయితే ఇలాంటి ఆంక్షల వల్ల జనంమధ్య సమాచార ప్రవాహం ఆగదు. కాస్త వెనకా ముందూ కావొచ్చుగానీ అది మనిషి నుంచి మనిషికి నిరంతరాయంగా ప్రవహిస్తూనేవుంటుంది. ఎమర్జెన్సీ చీకటిరోజులే ఇందుకు తార్కా ణం. నిరవధిక ఆంక్షల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినడంతోపాటు వదంతులు రాజ్యమేలతాయి.

సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు పర్యవసానంగా ఇంటర్నెట్‌ను నిలిపేసే ప్రభుత్వాల తీరు మారక తప్పదు. ఇన్నేళ్లుగా ప్రభుత్వాలు ఇంటర్నెట్‌ను అడపా దడపా ఆపుతున్నా న్యాయస్థానాలు జోక్యం చేసుకున్న సందర్భాలు లేవు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2011లో గూగుల్, యాహూ, ఫేస్‌బుక్‌ ప్రతినిధులను పిలిచి వడబోత తర్వాతే ఏ సమాచారాన్నయినా, వ్యాఖ్యలనైనా తమ సైట్లలో ఉంచేవిధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి హుకుం జారీ చేశారు. ఎక్కడ ఏ సమస్య తలెత్తినా, ఆ సాకుతో ఇంటర్నెట్‌ సేవలు నిలిపేయడం ఇటీవల రివాజుగా మారింది. ఇప్పుడు తాజా తీర్పు అలాంటి చర్యలను ప్రశ్నించడానికి పౌరులకు అవకాశం ఇచ్చింది. ఎంతకాలం ఆపుతారన్న స్పష్టత లేకుండా నిరవధికంగా ఈ సేవలను నిలిపేయడం టెలికాం నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. ఇదే కాదు... అవసరమా, అనవసరమా అనేదానితో నిమిత్తం లేకుండా 144వ సెక్షన్‌ విధించే తీరును కూడా ధర్మాసనం తప్పుబట్టింది.

సహేతుకమైన నిరసనలను అణిచేందుకు ఈ సెక్షన్‌ సాధనంగా మారకూడదన్నది ధర్మాసనం ఉద్దేశం. మన దేశంలో బహుశా ఈ సెక్షన్‌ దుర్వినియోగం అవుతున్నంతగా మరేదీ అయివుండదు. 144 సెక్షన్‌కు సంబంధించిన ఉత్తర్వులను కూడా వారం రోజుల వ్యవధిలో సమీక్షించాలని జమ్మూ–కశ్మీర్‌ ప్రభుత్వాన్ని ఆదేశించటం గమనించ దగ్గది. భావప్రకటనా స్వేచ్ఛకు పరిమితులు విధించాలని, వీలైతే దాన్ని శాశ్వతంగా సమాధి చేయాలని ప్రయత్నించని దేశమంటూ ఉండదు. ఆంక్షల తీవ్రతలో తేడావుండొచ్చుగానీ చైనా, రష్యా మొదలుకొని అన్ని దేశాల తీరూ ఒకటే. తమది ‘అత్యంత ప్రజాస్వామిక దేశమ’ని చెప్పుకుంటూ, వివిధ దేశాల ప్రభుత్వాలు విధించే ఆంక్షల గురించి తరచు సుద్దులు చెప్పే అలవాటున్న అమెరికా తన వరకూ వచ్చేసరికి ఏం చేస్తుందో పదేళ్లక్రితమే వికీలీక్స్‌ అధినేత జూలియన్‌ అసాంజ్‌నూ, ఆయనకు సహకరించిన చెల్సియా మానింగ్‌నూ అది వెంటాడిన తీరు తెలియజెబుతుంది.

అయితే ఇంటర్నెట్‌లో దుర్వా్యఖ్యలు, దుష్ప్రచారాలు, విద్వేషపూరిత రాతలు, అశ్లీలత వగైరా అంశాలుం టున్నాయన్న విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండదు. కానీ సమస్యేమంటే వీటిని ఎలా అదుపు చేయాలన్న అంశంలో అందరిదీ అయోమయమే. ప్రభుత్వాలు మాత్రం ఈ సాకుతో సహేతుకమైన అసమ్మతి గొంతు నొక్కే ప్రమాదం ఎప్పుడూ పొంచివుంటుంది. ఇప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ విలువైన తీర్పు వెలుగులో జమ్మూ–కశ్మీర్‌ ప్రభుత్వం తన చర్యల్ని సమీక్షించుకుని సరిదిద్దుకోవాలి. ఏకకాలంలో అటు పౌరుల భద్రతకూ, ఇటు వారి హక్కుల పరిరక్షణకూ పూచీ పడటమెలాగో తెలుసుకోవాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement