బేరాలుండవు
సాక్షి, చెన్నై:ప్రజలు మెచ్చే పార్టీతో రాష్ట్రంలో పొత్తు ఉంటుందని బీజేపీ అధికార ప్రతినిధి నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయం తోపాటుగా పార్టీ నాయకుల ఏకాభిప్రాయం తో అధిష్టానానికి పొత్తుపై నివేదిక పంపుతామన్నారు. అధికారం కోసం ఇతర పార్టీలతో బేరసారాలకు దిగబోమని చెప్పారు. టీ నగర్‌లోని కమలాలయంలో సోమవారం నిర్మల సీతారామన్ విలేకరులతో మాట్లాడారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్రంలో నిర్వహించిన మినీ మారథాన్ విజయవంతం అయిందని చెప్పారు. ఉక్కు మనిషి విగ్రహం కోసం రాష్ట్రం లో ఇనుము, పిడికెడు మట్టి సేకరణ వేగ వంతం చేయనున్నట్లు తెలిపారు. దేశ సమైక్యతకు బీజేపీ అహర్నిశలు శ్రమిస్తోందని వివరించారు. తమిళాస్త్రం: తమిళుల మనోభావాల్ని, హక్కుల్ని కేంద్రంలోని యూపీఏ సర్కారు తుంగలో తొక్కుతోందని ధ్వజమెత్తారు.
ఈలం తమిళులకు సమాన అవకాశాల కల్పనలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో కేంద్రం ఉండటం విచారకరమన్నారు. తమిళ జాలర్లపై దాడులు పేట్రేగుతున్నా మౌనం వహించడం శోచనీయమని మండిపడ్డారు. నదీ జలాల పంపిణీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేని ఈ ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లును మాత్రం బలహీన పరచి చట్టానికి విరుద్ధంగా నడచుకునే పనిలో పడిందని ధ్వజమెత్తారు. దేశంలో బలమైన నాయకత్వం కొరవడిందని, మార్గదర్శకం లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభజనంతో బలమైన నాయకత్వం దేశానికి దక్కబోతోందని ధీమా వ్యక్తం చేశారు. తమిళుల సమస్యల్ని పరిష్కరించే రీతిలో, మనోభావాలు, హక్కుల పరిరక్షణ దిశగా కేంద్రంలో ఏర్పడ బోయే మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుందని ఆకాంక్షించారు.
పొత్తులు: ఢిల్లీలోనే కాదు దేశంలో కాంగ్రెస్ పతనం అంచుకు చేరిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరి మద్దతును బీజేపీ కోరబోదని స్పష్టం చేశారు. ఏ పార్టీతోనూ బేరసారాలకు తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో డీఎంకే తెగ తెంపుల్ని గుర్తు చేస్తూ విలేకరులు ప్రశ్నించగా, ఆ పార్టీ నిర్ణయాన్ని, వ్యక్తిగత అభిప్రాయాన్ని కరుణానిధి వ్యక్తం చేశారని, ఇదే నిర్ణయంతో చివరి వరకు ఉంటారా? అని ప్రశ్నించారు. అవసరం అనుకుంటే జత కట్టడం, వద్దనుకుంటే గుడై బై చెప్పడం డీఎంకేకు పరిపాటేనని గతాన్ని గుర్తు చేశారు. బీజేపీ డీఎంకే జత కట్టే అవకాశాలు ఉన్నట్టున్నాయే అని ప్రశ్నించగా, తాము మాత్రం ఇంత వరకు ఏ పార్టీతోనూ చర్చలు జరపలేదని దాట వేశారు. ఎవరితో పొత్తు అన్నది ప్రజాభీష్టం, పార్టీ నాయకుల నిర్ణయం మేరకు ఉంటుందన్నారు. ప్రజలు మెచ్చే పార్టీతో పొత్తు పెట్టుకుంటామని స్పష్టం చేశారు. అయితే, తుది నిర్ణయం మాత్రం అధిష్టానం తీసుకుంటుందన్నారు. బీజేపీ జాతీయ నేత ఇలగణేషన్ మాట్లాడుతూ, తెగ తెంపులు చేసుకోవడం కరుణానిధికి వెన్నెతో పెట్టిన విద్య అని అభివర్ణించారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాన్ని చివరి వరకు స్థిరత్వంతో ఆయన కొనసాగించేనా అన్నది వేచి చూడాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ కార్యదర్శి తమిళి సై సౌందరరాజన్, రాష్ర్ట కార్యదర్శి వానతీ శ్రీనివాసన్ పాల్గొన్నారు.