స్వతంత్రులకు డిమాండ్
ముగిసిన నామినేషన్ల ఘట్టం
బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా నిర్మలా సీతారామన్ నామినేషన్ దాఖలు
కాంగ్రెస్ తరఫున రాజ్యసభ మూడో అభ్యర్థిగా కేసీ రామమూర్తి నామినేషన్
బెంగళూరు: రాష్ట్ర శాసనసభ నుంచి రాజ్యసభ, శాసనమండలికి జరుగుతున్న ఎన్నికల్లో కర్ణాటకలోని స్వతంత్ర, చిన్నచిన్న పార్టీల శాసనసభ్యులకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో శాసనసభ్యుల మద్దతు కోసం అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, జేడీఎస్‌లు పలు తాయిలాలలను చూపిస్తున్నట్లు సమాచారం. శాసనసభలోని ఆయా పార్టీ బలాబలాలను అనుసరించి.... కాంగ్రెస్ ఇద్దరు సభ్యులను రాజ్యసభకు, నలుగురుని మండలికి సలభంగా పంపించవచ్చు. అయితే రాజ్యసభకు మూడో అభ్యర్థిగా కే.సీ రామమూర్తిని నిలబెట్టి ఆయన్ను గెలిపించడం కోసం ఏమైనా చేయాలని డీ.కే శివకుమార్‌ను సీఎం సిద్ధు ఆదేశించారు. దీంతో ఆయన స్వతంత్ర ఎమ్మెల్యేలతో పాటు జేడీఎస్ పార్టీలో తిరుగు బావుటా ఎగురవేసిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు తీసుకుంటున్నారు. ఇక ఆ పార్టీ శాసనమండలి సభ్యుల ఎన్నికల్లో మాత్రం తనకు ఉన్న సంఖ్యాబలాన్ని అనుసరించి కేవలం నలుగురుని మాత్రమే బరిలో నిలబెట్టింది. ఇక బీజేపీ, జేడీఎస్‌లు తమ పార్టీతరఫున రాజ్యసభ అభ్యర్థులను గెలిపించుకోవాలంటే కచ్చితంగా స్వతంత్య్ర అభ్యర్థుల మద్దతు అవసరం.
ఈ విషయంలో బీజేపీకి ఒకరు, జేడీఎస్‌కు ఐదుగురు స్వతంత్రుల సహకారం అవసరం. ఇదిలా ఉండగా ఈ రెండు పార్టీలు శాసనసభలో తమకు ఉన్న బలాన్ని అనుసరించి ఒక్కొక్కరిని మాత్రమే శాసనమండలికి పంపించవచ్చు. అయితే ఈ రెండు పార్టీలు అదనంగా మరో అభ్యర్థిని నిలబెట్టాయి. అయితే సదరు ఇద్దరిలో ఒక్కరు మాత్రమే గెలవడానికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ అయితే మరో పార్టీని బుజ్జగించడంతో పాటు స్వతంత్రుల మద్దతు కూడా తీసుకుంటుందో సదరు పార్టీ నుంచి రెండో అభ్యర్థిగా ఒకరు శాసనమండలికి వెలుతారు. దీంతో శాసనమండలి అభ్యర్థుల ఎన్నిక విషయంలో అటు జేడీఎస్, ఇటు బీజేపీల నుంచి స్వతంత్రులకు భారీ తాయిలాలను అందించి తమ వైపునకు తిప్పుకోవడానికి కసరత్తులు ప్రారంభించాయి.
ముగిసిన నామినేషన్ల ఘట్టం
రాజ్యసభ, శాసనమండలి ఎన్నికల ప్రక్రియలో భాగమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరి రోజైన మంగళవారం బీజేపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నిర్మలాసీతారామన్ నామినేషన్ వేయగా, శాసనమండలి అభ్యర్థులుగా సోమణ్ణ, లెహర్‌సింగ్‌లను కమలనాథులు ఎన్నికల బరిలో దించారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనమండలికి నాలుగో అభ్యర్థిగా పోటీ చేస్తున్న అల్లం వీరభద్రప్ప కూడా మంగళవారం నామినేషన్ వేశారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులుగా పోటీ చేస్తున్న కే.సీ రామమూర్తి, ఆస్కర్‌ఫెర్నాండెజ్‌లు సోమవారమే నామినేషన్ వేయగా మరోసారి మంగళవారం వీరిద్దరూ వేర్వేరుగా మరోసెట్ నామినేషన్లను వేశారు. దీంతో రాష్ట్ర శాసనసభ నుంచి రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో నాలుగు స్థానాలకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ నుంచి వరుసగా 3,1,1 అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచారు. ఇక ఏడు శాసనమండలి స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నలుగురు, బీజేపీ తరఫున ఇద్దరు, జేడీఎస్ తరఫున ఇద్దరు నామినేషన్లు వేశారు. మొత్తంగా నాలుగు రాజ్యసభ స్థానాలకు స్వతంత్య్ర అభ్యర్థి కే.ఏ మోహన్‌తో కలపి మొత్తం ఆరుగురు నామినేషన్లు దాఖలు చేశారు. అదే విధంగా ఏడు శాసనమండలి స్థానాలకు అనిల్‌కుమార్, కే.ఏ మోహన్ (స్వతంత్ర అభ్యర్థులు)తో కలుపుకుని పదిమంది నామినేషన్లు వేశారు. మొత్తం 224 మంది సభ్యులు కలిగిన కర్ణాటక శాసనసభ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడానికి ఒక్కొక్కరికి 45 ఓట్లు రావాల్సి ఉండగా శాసనమండలి అభ్యర్థులకు కనిష్టంగా 29 ఓట్లు పడాలి. ఇక ప్రస్తుతం కాంగ్రెస్‌కు రాష్ట్ర శాసనసభలో 123 సంఖ్యాబలం ఉండగా విపక్ష బీజేపీ తరఫున 44, జేడీఎస్ నుంచి 40 మంది శాసనసభ్యులు ఉన్నారు. మిగలిన వారిలో తొమ్మిది మంది స్వతంత్రులు పోను మిగిలిన వారు కేజేపీ, బీఎస్సార్ కాంగ్రెస్ తదితర చిన్నచిన్న పార్టీకు చెందిన ఎమ్మెల్యేలు.
జూన్ 10, 11న ఫలితాలు
రాజ్యసభ నోటిఫికేషన్‌ను అనుసరించి జూన్ 3 వరకూ నామినేషన్ల ఉపసహంరణకు అవకాశం ఉండగా జూన్ 11న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం 4 గంటలకు కౌటింగ్ మొదలై మరో గంట తర్వాత అంటే సుమారు 5 గంటలకు ఫలితాలు వెలువడనున్నాయి. ఇక శాసనమండలికి సంబంధించి జూన్ 3 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండగా జూన్ 10న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్ర ఫలితాలు వెలువడవచ్చు.
కన్నడ నేర్చుకుంటా...రాష్ట్రానికి మేలు చేస్తా
రాజ్యసభ అభ్యర్థిగా నిర్మలాసీతారామన్ నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు.‘నాకు కన్నడ అర్థమవుతుంది. అయితే ప్రస్తుతానికి మాట్లాడలేను. కన్నడ నేర్చుకుంటాను. రాష్ట్రంలోని సమస్యలపై రాజ్యసభ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి నా వంతు కృషి చేస్తా. అంతేకాకుండా మీతో తదుపరి కన్నడలోనే మాట్లాడుతా. ప్రధాని నరేంద్రమోదీ మార్గదర్శకత్వంతో యడ్యూరప్ప, జగదీష్‌శెట్టర్ వంటి రాష్ట్ర అగ్రశ్రేణి నాయకులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. - నిర్మలా సీతారామన్
మా రెండో అభ్యర్థి గెలుస్తారు
శాసనమండలికి జరుగుతున్న ఎన్నికల్లో ప్రస్తుతం శాసనసభలో మా సంఖ్యాబలాన్ని అనుసరించి ఒకరిని సులభంగా గెలుపించుకోగలం. అయితే జేడీఎస్ సహకారంతో మా పార్టీ తరఫున రెండో అభ్యర్థి అయిన లెహర్‌సింగ్ కూడా రాష్ట్ర పెద్దలసభకు పంపిస్తాం. జేడీఎస్ వారు కూడా రెండో అభ్యర్థిగా వెంకటాచలపతిని ఎన్నికల బరిలో నిలబెట్టారని తెలుసు. మండలి ఎన్నికల్లో మాకే మద్దతు ఇస్తామని ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి చెప్పారు. - యడ్యూరప్ప