టీడీపీకి బీజేపీ ఝలక్‌ | bjp fires on tdp over nominated posts | Sakshi
Sakshi News home page

టీడీపీకి బీజేపీ ఝలక్‌

Published Thu, Oct 13 2016 2:45 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

టీడీపీకి బీజేపీ ఝలక్‌ - Sakshi

టీడీపీకి బీజేపీ ఝలక్‌

గుంటూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ
యార్డు పాలకవర్గంలో కమలనాథులకు దక్కని చోటు
నామినేటెడ్‌ పదవుల విషయంలోనూ గుర్రు
ఒంటరి పోరుకు సన్నద్ధం


మైత్రిధర్మం పాటించని టీడీపీ వైఖరిపై ఎప్పటినుంచో గుర్రుగా ఉన్న బీజేపీ గుంటూరు నేతలు చివరికి పెద్ద షాకే ఇచ్చారు. త్వరలో జరగబోయే గుంటూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో అన్నిచోట్లా పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ హఠాత్‌ పరిణామంతో కంగుతిన్న తెలుగు తమ్ముళ్లు ప్రస్తుతం ఆలోచనలో పడటంతో గుంటూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

గుంటూరు: నామినేటెడ్‌ పదవుల విషయంలో తెలుగు తమ్ముళ్లు మిత్రధర్మానికి గండి కొడుతున్నారు. దీంతో బీజేపీ నాయకులు టీడీపీకి గట్టి షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రాబోయే కార్పొరేషన్‌ ఎన్నికల్లో నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లకు అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా టీడీపీకి దెబ్బ కొట్టాలని బీజేపీ ముఖ్యశ్రేణులు నిర్ణయించాయి. ఎన్నికల్లో తాము అన్ని డివిజన్ల నుంచి పోటీ చేస్తామని బీజేపీ నగర అధ్యక్షుడు ప్రకటించడంతో అధికార పార్టీలో అంతర్మథనం మొదలైంది. వాస్తవానికి చిన్నపాటి నామినేటెడ్‌ పదవి మొదలుకుని ప్రతి విషయంలో టీడీపీ నాయకత్వం బీజేపీ శ్రేణుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రస్థాయి నామినేట్‌ పదవులు మొదలుకుని గత వారంలో ప్రకటించిన గుంటూరు మార్కెట్‌ యార్డు పాలకవర్గం పదవుల వరకూ ఒక్కదాంట్లో కూడా బీజేపీకి ప్రాధాన్యం దక్కలేదు.  

ఆది నుంచి అవమానమే..
మిత్రధర్మం ప్రకారం నామినేటెడ్‌ పదవుల్లో బీజేపీ శ్రేణులకు కొంతమేర ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే, అధికార పార్టీ దీన్ని పూర్తిగా విస్మరించింది. దీంతో బీజేపీ జిల్లా, నగర స్థాయి నేతలు రగిలిపోతూ ఎప్పటికప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుకు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే, రాష్ట్రస్థాయి ముఖ్యనేతలు ఈ ఫిర్యాదులపై  ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతూ అసంతప్తి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. తాజాగా గతనెల 29న పది రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌లకు చైర్మన్‌లతో పాటు 100 మంది సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీటిలో రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ హస్తకళల అభివద్ధి సంస్థ కనీస వేతనాల సిఫార్సు కమిటీ విజయవాడ, అన్నవరం దేవస్థానాలతోపాటు వివిధ కార్పొరేషన్‌లు ఉన్నాయి. అయితే, బీజేపీ శ్రేణులకు దేవస్థానాల్లో మినహా మరే నామినేటెడ్‌ పోస్టుల్లోనూ          ప్రాధాన్యం కల్పించలేదు. దేవస్థానంలో కూడా పదిమంది సభ్యుల్లో ఒకరికి మాత్రమే అవకాశం ఇస్తున్నారు. ఈ పరిణామాలపై బీజేపీ నేతలు విసిగిపోయారు. గతవారంలో ప్రకటించిన గుంటూరు మార్కెట్‌ యార్డు కమిటీ విషయంలోనూ ఇదే పునరావృతమైంది.

ఆసియాలోనే అతిపెద్ద రెండో యార్డుగా పేరున్న క్రమంలో తమకు పాలకవర్గంలో చోటు కల్పించాలని బీజేపీ నేతలు పలుమార్లు టీడీపీ నేతలను కోరగా, తప్పనిసరిగా చోటు కల్పిస్తామని వారు హామీ ఇచ్చారు. అయితే, ఇచ్చిన మాట తప్పారు. దీంతో బీజేపీ నేతలు యార్డు వ్యవహారంపై కూడా కంభంపాటి హరిబాబుకు ఫిర్యాదు చేశారు.

పొత్తు ఉన్నా ఒంటరిపోరే
తాజా పరిణామాల నేపథ్యంలో మిత్రపక్షం వైఖరితో బీజేపీ శ్రేణులు విసిగిపోయారు. దీనిలో భాగంగా త్వరలో జరగనున్న గుంటూరు మున్సిపల్‌ ఎన్నికల్లో 52 డివిజన్‌లలోనూ పోటీ చేయాలని బీజేపీ శ్రేణులు నిర్ణయించారు. ఇటీవల బీజేపీ నగర అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు విలేకరుల సమావేశం నిర్వహించి మరీ ఈ విషయాన్ని ప్రకటించారు.  ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు ఉన్నప్పటికీ, అన్ని డివిజన్‌లలో డెప్యూటీ మేయర్, మేయర్‌ స్థానాలకు తప్పనిసరిగా పోటీ ఉంటుందని ప్రకటించారు. దీంతో తెలుగుదేశంలో తర్జన భర్జనలు మొదలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement