పదవుల కోసం పోటా పోటీ
►నామినేటెడ్ పోస్టులపై టీడీపీ, బీజేపీ నేతల కన్ను
►పైస్థాయిలో పావులు కదుపుతున్న ఆశావహులు
►20 తరువాత మంత్రి ప్రత్తిపాటితో భేటీకి బీజేపీ సన్నాహాలు
►భర్తీపై భారీగా ఆశలు పెంచుకున్న తెలుగుదేశం నేతలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లాలోని నామినేటెడ్ పదవులపై టీడీపీ, బీజేపీ నేతలు దృష్టి సారించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని నియామకాలను రద్దు చేస్తూ కొత్త ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకోవడంతో నామినేటెడ్ పదవుల రేసులో టీడీపీ, బీజేపీ నేతలు పోటీ పడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మిత్ర పక్షంగా పనిచేసిన ఈ రెండు పార్టీలు నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ అదే పంథాలో పయనించాలని భావిస్తున్నాయి. ఈ మేరకు ఇరు పార్టీల జిల్లా నేతలు ఓసారి సమావేశమై ఓ నిర్ణయానికి రావాలని ఆలోచన చేస్తుంటే, ఆశావహులు ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ఎవరికివారే తమదైన లాబీయింగ్ నడుపుతూ పావులు కదుపుతున్నారు.
రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి, గెలుపొందిన స్థానాలను ఆధారం గా నామినేటెడ్ పోస్టుల సంఖ్య నిర్ణయించాలని టీడీపీ భావిస్తుంటే, తమతో పొత్తు కుదుర్చుకోవడం, సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రచారం చేయడం వల్లనే టీడీపీ గట్టెక్కిందని బీజేపీ నేతలు అంటున్నారు. అంతేకాక తమతో పొత్తులేకపోతే ఓటమి పాలయ్యేదని ఘంటాపథంగా చెబుతున్నారు.
►రెండు పార్టీల నేతల మనోభావాలు పరస్పర విరుద్ధంగా ఉండటంతో నామినేటెడ్ పోస్టుల భర్తీలో సిగపట్లు తప్పవని పరిశీలకులు భావిస్తున్నారు.
►రద్దయిన పోస్టుల్లో ఎక్కువగా మార్కెట్‌యార్డు, ఆలయ కమిటీలు ఉన్నాయి. కృష్ణా,గుంటూరు జిల్లాలకు సంబంధించిన వీజీటీఎం ఉడా కమిటీ కూడా ఉంది.
►కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఆ పార్టీ తరఫున గెలుపొందారు.
►మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు కావడంతో కేంద్ర ప్రభుత్వం నియమించే నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెంచుకోకుండా జిల్లా స్థాయి పోస్టులను బీజేపీ నేతలు ఆశిస్తున్నారు.
►ముఖ్యంగా జిల్లాలోని మార్కెట్ యార్డు, ముఖ్య దేవాలయ కమిటీ చైర్మన్, సభ్యుల పదవులను ఆశిస్తున్నారు.
►ఈ మేరకు బీజేపీలోని ఆశావహుల నుంచి ఒత్తిడి పెరగడం తో నియోజకవర్గాల వారీగా పార్టీకి సేవ చేసిన నేతల పేర్లు తీసుకున్నారు.
►అంతేకాకుండా టీడీపీ బాధ్యులతో ఒకటికి రెండుసార్లు సంప్రదింపులు జరిపారు. రెండు, మూడు రోజుల్లో సమావేశమై అర్హుల జాబితా తయారు చేసే యోచనలో బీజేపీ ఉంది.
►ఈ నెల 20 తరువాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో ఒకసారి సమావేశం కావాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఆ సమావేశానికి జిల్లాలో ఆశిస్తున్న మార్కెట్, ఆలయ కమిటీల వివరాలు తీసుకువెళతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పొట్రు పూర్ణచంద్రరావు ‘సాక్షి’కి వివరించారు. కమిటీల కేటాయింపులో టీడీపీ నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నారు.
►పది సంవత్సరాల తరువాత అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలు నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఆశలు పెంచుకున్నారు. మంత్రులు, శాసన సభ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.