- ఒక్కో స్థానానికి ఒక్కొక్క నామినేషన్
- శాసన మండలికి పరమేశ్వర్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాజ్యసభ, శాసన మండళ్ల ద్వైవార్షిక ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. నామినేషన్లకు చివరి రోజైన సోమవారం కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. రాజ్యసభలో నాలుగు, శాసన మండలిలో ఏడు ఖాళీలకు ఈ నెల 19న ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌లు శాసన సభలో తమకున్న సంఖ్యా బలాన్ని అనుసరించి అభ్యర్థులను రంగంలో దింపాయి.
రాజ్యసభకు కాంగ్రెస్ తరఫున సోమవారం బీకే. హరిప్రసాద్, రాజీవ్ గౌడ నామినేషన్లు సమర్పించారు. ఇదివరకే బీజేపీ తరఫున ప్రభాకర కోరె, జేడీఎస్ తరఫున కుపేంద్ర రెడ్డి నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నలుగురే రంగంలో ఉన్నందున వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. నామినేషన్ల పరిశీలన తర్వాత వీరు ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటిస్తారు.
మండలికీ అంతే...
శాసన మండలికి కాంగ్రెస్ తరఫున కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, మాజీ మంత్రి హెచ్‌ఎం. రేవణ్ణ, పార్టీ సీనియర్ నాయకుడు బోసురాజు, చిత్రదుర్గ జిల్లా పంచాయతీ సభ్యురాలు జయమ్మ బాలరాజ్‌లు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ తరఫున కేఎస్. ఈశ్వరప్ప ఇదివరకే నామినేషన్ దాఖలు చేయగా, జేడీఎస్ తరఫున నగరంలోని శ్రీ సాయి గోల్డ్ ప్యాలెస్ అధిపతి శరవణ సమర్పించారు. బీజేపీ, జేడీఎస్ మద్దతుతో ఇండిపెండెంట్ అభ్యర్థి యూబీ.
మల్లిఖార్జున్ ఇదివరకే నామినేషన్ దాఖలు చేశారు. ఏడు ఖాళీలకు ఏడుగురే రంగంలో ఉన్నందున, వీరు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న శాసన సభ కార్యదర్శి ఓంప్రకాశ్ నామినేషన్లను స్వీకరించారు. కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినప్పుడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు వెంట ఉన్నారు.