కసరత్తు
- తుది ఘట్టానికి నామినేటెడ్ పోస్టుల భర్తీ పర్వం
- జాబితా తయారీ కోసం సిద్ధు, పరమేశ్వర్ సమాలోనలు
సాక్షి, బెంగళూరు : చాలా కాలంగా ఊరిస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం తుది ఘట్టానికి చేరుకుంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ పరమేశ్వర్ ఆదివారం సాయంత్రం భేటీ అయారు. సోమవారం కూడా మరోసారి భేటీ కానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా కార్పొరేషన్లు, బోర్డుల అధ్యక్షులు తదితరనామినేటెడ్ పోస్టులను భర్తీ చేయలేదు. నేడు.. రేపు.. అంటూ ఊరిస్తూ సిద్ధరామయ్య కాలాయాపన చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ నెల 16న బెంగళూరు వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఈ నెలాఖరుకు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని సిద్ధరామయ్య, పరమేశ్వర్‌లకు స్పష్టం చేశారు. దీంతో అప్పటి నుంచి వారు నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై వేర్వేరుగా జాబితాలు తయారు చేసే విషయంలో బిజీగా ఉన్నారు.
ఈ రెండు జాబితాలను ఒక చోటకు చేర్చి అంతిమం గా ఒకే జాబితా తయారు చేయడానికి వీలుగా సిద్ధరామయ్య, పరమేశ్వర్ సమావేశమైనట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో టికెట్టు దక్కనివారు, మంత్రి మండలిలో స్థానం లభించని వారికి ఈ నామినేటెడ్ పోస్టుల్లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.
మరోవైపు గత ఎన్నికల్లో ఓడిన వారికి
నామినేటెడ్ పోస్టులకు ఎంపిక చేయలేమని సిద్ధు, పరమేశ్వర్‌లు ఇప్పటికే స్పష్టం చేశారు. అయినా నలె నరేంద్రబాబు తదితర నాయకులు పట్టు వీడటం లేదు. ఎలాగైనా సరే నామినేటెడ్ పోస్టులను దక్కించుకునేందుకు వారు ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈనెల 30న ఢిల్లీలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమావేశం కానున్నారు. దీంతో ఆ సమావేశంలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది జాబితాకు ఆమోద ముద్ర వేయించుకోవాలని ఇరువురు నాయకులు భావిస్తున్నారు.
మంత్రి మండలి విస్తరణ కూడా...
త్వరలోనే మంత్రి మండలి విస్తరణ కూడా చేపట్టనున్నామని దిగ్విజయ్ సింగ్ తన బెంగళూరు పర్యటనలో స్పష్టం చేశారు. దీంతో ఢిల్లీ పర్యటనలోనే పరమేశ్వర్‌కు మంత్రి మండలిలో స్థానంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ చాలా రోజుల నుంచి ఉపముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన విషయం తెలిసిందే. మరోవైపు మంత్రి మండలి పునర్వవస్థీకరణ కూడా ఉంటుందని దిగ్విజయ్ సింగ్ చెప్పిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ముహుర్తంపై కూడా సిద్ధు, పరమేశ్వర్‌ల పర్యటనలో స్పష్టత రానుంది. మొత్తంగా కన్నడ రాజ్యోత్సవ సంబరాలు జరుపుకునే నవంబర్1న నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన ఘట్టానికి తెరపడనుంది. మరోవైపు మంత్రి మండలి విస్తరణతోపాటు పునర్నిర్మాణ ఘట్టాలకు తెరలేయనుందని కేపీసీసీ నాయకులు చెబుతున్నారు.