parameswar
-
ఒక్క ఓటమి.. సీఎం కుర్చీ దూరం
తుమకూరు: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తిని రేపుతున్న నియోజకవర్గాల్లో తుమకూరు జిల్లాలోని కొరటగెరె ఒకటి. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ప్రత్యర్థులుగా బరిలో దిగిన కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్, కొరటగెరె జేడీఎస్ ఎమ్మెల్యే సుధాకర్లాల్లు ఈసారి కూడా ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో దిగనుండడంతో కొరటగెరె ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2013 ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో పరమేశ్వర్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు.కొరటగెరె నియోజకవర్గంలో విజయం తమదేనన్న ధీమాతో నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారు. దీంతో జేడీఎస్ అభ్యర్థి సుధాకర్లాల్ 18 వేల ఓట్ల మెజారిటీతో అనూహ్యంగా విజయం సాధించారు. ఈ ఓటమి పరమేశ్వర్ ఆశలను చిదిమేసింది. చేతికి అందిన ముఖ్యమంత్రి పీఠాన్ని నోటికి అందకుండా చేసింది. దీంతో కొరటగెరె నియోజకవర్గంలో విజయంతో పాటు కలలు కన్న ముఖ్యమంత్రి పీఠం కూడా దూరమవడంతో ఎమ్మెల్సీ కోటాలో హోంమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సుమారు ఏడాది కిదంట ఆ పదవిని కూడా వదులుకున్నారు. పట్టు పెంచుకుంటున్న పరమేశ్వర్ పరమేశ్వర్ ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ప్రత్యర్థి సుధాకర్లాల్పై ప్రతీకారం తీర్చుకోవాలని ఆయన కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా గత ఎన్నికల్లో చేసిన తప్పును పునరావృతం చేయకుండా గత రెండు నెలలుగా కొరటగెరెలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. హోంమంత్రిగా ఉండగా కొరటగెరె నియోజకవర్గం అభివృద్ధి కోసం పరమేశ్వర్ ప్రభుత్వం నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో నిధులు విడుదల చేయించడంలో సఫలీకృతులయ్యారు. నియోజకవర్గంలో ఏకలవ్య పాఠశాల, కేఎస్ఆర్పీ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయగలిగారు. తరచూ పల్లె నిద్రలతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. త్రిముఖ పోటీ కలకలం అయితే గత ఎన్నికల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత తమ పార్టీలో లేకపోవడంతో బీజేపీ అభ్యర్థిని బరిలో దించకపోవడంతో కేవలం కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య మాత్రమే పోటీ నెలకొంది. అయితే ఈసారి కాంగ్రెస్,జేడీఎస్‌లతో పాటు ఎస్సీ వర్గానికి చెందిన బీజేపీ నేత హుచ్చయ్య పోటీలో ఉంటారని వార్తులు వస్తుండడంతో కొరటగెరెలో త్రిముఖ పోటీ తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇతర వర్గాలూ ప్రధానమే ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 1.97లక్షలు ఉండగా అందులో ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓట్లు 60వేలు ఉండగా లింగాయత్‌లు ఓట్లు 40వేలు, ఒక్కళిగల ఓట్లు 30వేలు ఉన్నాయి. ఇక ముస్లింలు, కురుబలు, గొల్ల సామాజిక వర్గానికి చెందిన ఓట్లు సుమారు 50వేల వరకూ ఉండగా, మిగిలిన వర్గాల ఓట్లు పదివేల లోపు ఉన్నాయి. త్రిముఖ పోటీ భయంతో ముగ్గురు నేతల తమ సామాజిక వర్గాల ఓట్లతో పాటు గెలుపోటములపై ప్రభావం చూపగలిగే లింగాయత్, ఒక్కళిగల ఓటర్లపై కూడా దృష్టి సారించారు. -
యోగి.. నోరు అదుపులో పెట్టుకో!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం సిద్దరామయ్యపై అనాలోచితంగా ఆరోపణలు, విమర్శలు చేసిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నోరు అదుపులో పెట్టుకోవడం ఉత్తమమంటూ కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ వ్యాఖ్యానించారు. మంగళవారం పరమేశ్వర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్ బీజేపీ సిద్ధాంతాలు, పరివర్తన ర్యాలీ, తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి గురించి ప్రస్తావించకుండా కేవలం సీఎం సిద్దరామయ్య లక్ష్యంగా విమర్శలు, ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. కర్ణాటకలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, అవినీతి పెరిగిపోయిందని అందుకు సిద్దరామయ్య అసమర్థ పాలనే కారణమంటూ యూపీ సీఎం యోగి చేసిన ఆరోపణలు గురివింద నలుపు సామెతను గుర్తు చేస్తున్నాయన్నారు. దేశంలో అవినీతిలో, నేరాల్లో మొదటిస్థానంలో నిలిచే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేవలం ఉత్తరప్రదేశ్ మాత్రమేనన్న విషయాన్ని యోగి ఆదిత్యనాథ్ విస్మరించారని పేర్కొన్నారు. ముందు యూపీలో అవినీతి, నేరాలను అదుపు చేసిన తర్వాత యోగి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులపై విమర్శలు చేయాలంటూ హితవు పలికారు. కర్ణాటకలో రైతుల ఆత్మహత్యల గురించి బాధపడ్డ యోగికి నిజంగానే రైతులపై ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వంతో చర్చించి వెంటనే జాతీయ బ్యాంకుల్లో రాష్ట్ర రైతుల రుణాలను మాఫీ చేయించాలంటూ డిమాండ్ చేశారు. సీఎం సిద్దరామయ్య మతం, ఆహారపు అలవాట్లపై హిందూ యువతను రెచ్చగొడుతూ మతవిద్వేషాల వైపు వెళ్లే విధంగా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. సిద్దరామయ్యతో పాటు తాము కూడా హిందువులేమనని అయితే తాము అన్ని మతాలు, వర్గాల ప్రజలను సమానదృష్టితోనే చూస్తామని బీజేపీ నేతల్లా తాము ప్రజల మధ్య మతవిద్వేషాలు రెచ్చగొట్టలేదన్నారు. గుజరాత్ ఎన్నికల సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అక్కడి హిందూ దేవాలయాల్లో పూజలు నిర్వహించిన సందర్భాలను బీజేపీ నేతలు గుర్తు చేసుకోవాలన్నారు. చివరికి పర్తివర్తన ర్యాలీలో తాము చేయబోయే అభివృద్ధి గురించి కాకుండా కేవలం మత ఘర్షణల గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నారంటూ విమర్శించారు. చావులపై కూడా బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇటీవల మంగళూరులో హత్యకు గురైన దీపక్‌రావ్ హత్య వెనుక బీజేపీ కార్పొరేటర్ హస్తం ఉందని ఆరోపించారు. త్వరలోనే ఈ విషయం పోలీసుల విచారణతో రాష్ట్ర ప్రజలకు తెలుస్తుందన్నారు. -
తెరపైకి దళిత గళం
ఉన్నత పదవుల కోసం ఢిల్లీకి ఆశావహులు సోనియాను కలిసిన మునియప్ప కేపీసీసీ చీఫ్ కోసం యత్నాలు మంత్రి పదవి కోసం మోటమ్మ కూడా బెంగళూరు: అధికార కాంగ్రెస్ పార్టీలో దళిత గళం ప్రతిధ్వనిస్తోంది. అటు పార్టీతో పాటు ఇటు ప్రభుత్వంలో ఉన్నత పదవులు దక్కించుకోవ డానికి ఆశావహులు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ జరుపుతుండగా మరికొం త మంది దళిత నాయకులకు కీలక పదవులు దక్కాల్సిందేనంటూ బహిరంగంగా పేర్కొంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి మార్పుతో పాటు మంత్రి మండలి పునఃవ్యవస్థీకరణ జరగనున్నట్లు సమాచారం. అంతేకాకుండా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ జీ పరమేశ్వర్ పదవీకాలం కూడా ఇప్పటికే పూర్తయ్యింది. దీంతో కేపీసీసీ అధ్యక్షస్థానానికి కూడా నూతన నాయకుడిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీలో దళితులకు సరైన పదవులు దక్కలేదన్న విషయం ఆ పార్టీకి చెందిన నాయకులే బహిరంగంగా పేర్కొంటున్నారు. దీంతో పదవుల పంపకాలకు సమయం సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలోని దళిత వర్గానికి చెందిన పలువురు నాయకులు సదరు పదవులను దక్కించుకోవడానికి శక్తి వంచనలేకుండా కృషి చేస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్... పార్లమెంటు సభ్యుడైన కే.హెచ్ మునియప్ప గత శాసనసభ ఎన్నికల సమయంలోనే కేపీసీసీ అధ్యక్ష పదవి కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. అయితే చివరికి ఆ పదవి పరమేశ్వర్‌ను వరించింది. అయితే ప్రస్తుతం పరమేశ్వర్ పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో తిరిగీ ఆ పదవి కోసం కే.హెచ్. మునియప్ప తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఢిల్లీలో ఆమె నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తనకు కేపీసీసీ పదవి ఇవ్వాలని అభ్యర్థించడంతో పాటు ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, ‘దళిత సీఎం’ ఆవశ్యకత తదితర విషయాలను కూడా కే.హెచ్ మునియప్ప ‘మేడం’కు వివరించారు. భేటీ అనంతరం మునియప్ప మీడియాతో మాట్లాడుతూ...‘నేను ఏడు సార్లు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాను. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నాను. రాష్ట్ర రాజకీయాలపై మంచి అవగాహన ఉంది. సీనియర్ నాయకుల మద్దతు నాకే ఉంది. అందువల్ల నాకు కేపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాల్సిందిగా హైకమాండ్‌ను కోరాను. అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని కేపీసీసీ పదవి అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని సోనియాగాంధీ తెలిపారు. ఆ పదవి నాకే దక్కుతుందని నమ్మకంతో ఉన్నా.’ అని పేర్కొన్నారు. అదేవిధంగా శాసనమండలి సభ్యురాలు, మాజీ మంత్రి మోటమ్మ కూడా సోనియాగాంధీని బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యి మంత్రి మండలిలో తనకు అవకాశం కల్పించాల్సిందిగా కోరారు. -
డీకే రవి మృతిపై సీబీఐకి లేఖ
కృష్ణరాజపురం : దివంగత ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు వేగవంతం చేసి నిజానిజాలు వెలికితీయాలని సీబీఐకి లేఖ రాస్తానని కర్ణాటక హోం శాఖ మంత్రి డాక్టర్.జీ. పరమేశ్వర్ పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది వసతి కోసం కృష్ణరాజపురంలో రూ.69 కోట్లతో చేపట్టిన 360 గృహాల నిర్మాణ పనులకు గురువారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. డీకే రవి ఎలా చనిపోయాడో తేల్చాలని డిమాండ్ చేస్తూ ఆనందరావ్ సర్కిల్లో ధర్నా చేపట్టిన అతని తల్లిదండ్రులను తాను పరామర్శించానని, రవి మృతిపై నిజాన్ని బయట పెట్టాలని వారు కోరారన్నారు. ఈ విషయంపై దర్యాప్తు వేగవంతం చేయాలని తాను సీబీఐకి లేఖ రాస్తానన్నారు. బెంగళూరు నగరంలో ఇళ్లు లభించక పోలీసు సిబ్బంది నానా పాట్లు పడుతున్నారన్నారు. వారి ఇబ్బందులు తీర్చేందుకు సీఎం సిద్ధరామయ్య పోలీసు గృహ 20-20 పథకాన్ని ప్రవేశపెట్టి 11వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చిందన్నారు. ఇప్పటికే 3వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పోలీసులకు అప్పగించామన్నారు.ఈ యేడాది చివరి నాటికి మరో 5 వేల నిర్మాణాలు పూర్తి చేసేలా సీఎంకు విన్నవిస్తామన్నారు. ఇటీవల మినీ విధానసౌధ ముట్టడికి వచ్చిన రైతులను చెదరగొట్టారు తప్పితే లాఠీచార్జ్ చేయలేదని స్పష్టం చేశారు. బెంగళూరు నగరంలో 2800 మంది పోలీసు సిబ్బంది నియామకానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కృష్ణరాజపురంలో కూడా పోలీసు సిబ్బందికొరతన నివారిస్తామన్నారు. కృష్ణరాజపురంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. -
ఢిల్లీకి రండి !
బెంగళూరు: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, పునఃరచన విషయమై మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఈ విషయంపై కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.ఎం.కృష్ణతో సమావేశమయ్యారు. ఇక మంత్రి వర్గ విస్తరణపై చర్చించేందుకు ఢిల్లీకి రావాల్సిందిగా పరమేశ్వర్‌కు హైకమాండ్ నుంచి పిలుపు అందింది. దీంతో శనివారం సాయంత్రమే కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి. పరమేశ్వర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. దసరా పండుగ అనంతరం మంత్రివర్గ విస్తరణ చేపడతామని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన కంటే ముందు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేడు (ఆదివారం) ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ చేరుకున్న అనంతరం రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, పునఃరచన విషయాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హైకమాండ్‌తో చర్చించనున్నారు. కాగా, ఇదే సందర్భంలో కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్‌కు సైతం కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు అందింది. మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు దిల్లీకి రావాల్సిందిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ నుంచి పరమేశ్వర్‌కు పిలుపు అందింది. దీంతో శనివారం సాయంత్రమే పరమేశ్వర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఎస్.ఎం.కృష్ణతో భేటీ... కాగా, ఢిల్లీ బయలుదేరి వెళ్లడానికి ముందు కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.ఎం.కృష్ణతో భేటీ అయ్యారు. శనివారం ఉదయమిక్కడి ఎస్.ఎం.కృష్ణ నివాసానికి చేరుకున్న పరమేశ్వర్ మంత్రి వర్గ విస్తరణతో పాటు తన ఢిల్లీ పయనంపై చర్చించారు. ఎస్.ఎం.కృష్ణతో, జి.పరమేశ్వర్ భేటీ కావ డం కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర కుతూహలాన్నే రేకెత్తిస్తోంది. రాష్ట్ర రాజకీయాలపై హైకమాండ్‌తో చర్చించేందుకు గాను ఎస్.ఎం.కృష్ణ సైతం ఇటీవలే ఢిల్లీ వెళ్లి వచ్చారు. దీంతో పరమేశ్వర్, ఎస్.ఎం.కృష్ణల భేటీపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. కాగా, ఈ సమావేశం అనంతరం పరమేశ్వర్ విలేకరులతో మాట్లాడుతూ....ఎస్.ఎం.కృష్ణతో తాను సమావేశం కావడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని వివరించారు. కేవలం ఆయనతో వ్యక్తిగత విషయాలు మాట్లాడేందుకు మాత్రమే తాను వచ్చానని చెప్పారు. ఇక ఉప ముఖ్యమంత్రి పదవికి సంబంధించి హైకమాండ్‌దే తుది నిర్ణయమని పరమేశ్వర్ తెలిపారు. ఎస్.ఎం.కృష్ణ ఇంటి వద్ద బారులుతీరిన ఆశావహులు... ఇక మంత్రి వర్గ విస్తరణ తుది ఘట్టానికి చేరుకున్న నేపథ్యంలో మంత్రి వర్గంలో స్థానాన్ని ఆశించే ఆశావహులంతా ఎస్.ఎం.కృష్ణ ఇంటి వద్ద బారులు తీరారు. తమకు మంత్రివర్గంలో స్థానం ఇప్పించాల్సిందిగా సిఫార్సు చేయాలని కోరేందుకు వీరంతా ఎస్.ఎం.కృష్ణ ఇంటికి చేరుకుంటున్నారు. దసరా శుభాకాంక్షలు తెలియజేసేందుకు అంటూ ఎస్.ఎం.కృష్ణ ఇంటికి చేరుకుంటున్నారు. కాగా, ఎస్.ఎం.కృష్ణను కలిసిన ఆశావహుల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి సైతం ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
నల్గొండ: నల్గొండ జిల్లా ఆలేరు శివారులో ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. హైదరాబాద్ నుంచి వరంగల్‌కు కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యానును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. డీసీఎంలో ప్రయాణిస్తున్న వంశీరెడ్డి (28), పరమేశ్వర్ (32) అక్కడికక్కడే మరణించారు. మృతులు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఆలేరు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. -
బిగుస్తున్న పిడికిలి
‘దళిత సీఎం’ నినాదంపై పట్టువీడని ఆ వర్గ నేతలు నేటి నుంచి దశలవారిగా జనజాగృతి కార్యక్రమాలు తొలుత బళ్లారిలో ప్రారంభం బెంగళూరు/బళ్లారి: ‘కర్ణాటకకు దళిత ముఖ్యమంత్రి’ విషయమై ఆ వర్గానికి చెందిన నాయకులు పట్టువీడటం లేదు. ఈ విషయమై ఎవరూ బహిరంగంగా మాట్లాడకూడదని సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక శాఖ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఆదేశాలు జారీ చేసినా ‘దళిత వర్గ నాయకులు’ మాత్రం వెనక్కు తగ్గక పోవడం గమనార్హం. దళిత వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న నినాదం వినిపిస్తోంది. దళిత వర్గానికి చెందిన కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పరమేశ్వర్ కూడా అడపాదడపా ‘నాకు ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు అన్నీ ఉన్నాయి.’ అంటూ మీడియా ప్రకటనలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల ముందు ఆ వర్గానికి చెందిన నాయకులు బెంగళూరులోని ఓ హోటల్లో సమావేశమై ఈనెల 23 లోపు దళిత సీఎం విషయమై ‘హై కమాండ్’ నిర్ణయం తీసుకోకుంటే జిల్లా స్థాయిలో జానజాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇది అటు విపక్షంలోనే కాక స్వపక్షంలోనూ విమర్శలకు దారి తీసింది. ఈ నేపధ్యంలో దళిత సీఎం పై ఎవరూ బహిరంగ వాఖ్యలు చేయకూడదని నిన్నటి రోజే (ఆదివారం) దిగ్విజయ్ సింగ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అయినా దిగ్విజయ్ సింగ్ హెచ్చరికలను ఏమాత్రం లెక్క చేయని దళిత వర్గానికి చెందిన నాయకులు బెంగళూరులోని ఓ హోటల్లో సోమవారం సమావేశమై జిల్లా స్థాయిలో నిర్వహించాల్సిన జనజాగృతి కార్యక్రమాల రూపురేఖల పై చర్చించారు. దశలవారిగా జిల్లా కేంద్రాల్లో ‘దళితసీఎం’ విషయమై జనజాగృతి కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మొదటగా మంగళవారం బళ్లారిలో జనజాగృతి కార్యక్రమం నిర్వహించాలని దళిత నాయకులు భావిస్తున్నారు. బెంగళూరులో దళిత నాయకులు నిర్వహించిన సమీక్ష సమావేశం తర్వాత రాష్ట్ర దళిత సంఘర్షణ సమితి నాయకుడు ఎన్.మూర్తి మీడియాతో మాట్లాడుతూ... ‘కర్ణాటకలో దళిత కాంగ్రెస్ నాయకుడు సీఎం పీఠం మీద కుర్చొనే సమయం వచ్చింది. ఇందుకు హై కమాండ్ సహకరించకపోతే ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్‌కు పట్టిన గతే కర్ణాటకలో రాబోయే ఎలెక్షన్లలో సైతం ఎదురవుతుంది’ అని పేర్కొన్నారు. దీంతో ‘దళిత ముఖ్యమంత్రి’ డిమాండ్ ఎలాంటి మలుపులు తీసుకుంటుందోననే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. బళ్లారి నగరంలోని దళిత నేతలతో రాష్ట్ర దళిత సంఘానికి చెందిన ప్రముఖ నేతలు మంగళవారం బళ్లారిలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దళిత ముఖ్యమంత్రిని చేయాలని ఏర్పాటు చేసిన ఫోరంకు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివరాం నేతృత్వంలో బళ్లారిలో నగరంలోని బీడీఏఏ మైదానంలో నేడు( మంగళవారం) పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి తన గళం విప్పనున్నారు. విలేకరుల సమావేశంలో పాల్గొన్న అనంతరం దళిత ముఖ్యమంత్రిని చేయాలని సమావేశంలో నేతలు ప్రసంగించనున్నారు. ఈ సమావేశానికి పలువురు దళిత కులానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్ర దళిత సంఘం నేతలు శ్రీరాములు, వెంకటస్వామీలు తదితరులు పాల్గొంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా దళిత ముఖ్యమంత్రిని చేయాలని బళ్లారి నుంచి దళిత సంఘం నేతలు తీవ్ర పోరాటానికి తెరలేపే అవకాశం ఉందని చెప్పవచ్చు. -
నోరు జారొద్దు
‘దళిత సీఎం’ నినాదంపై సిద్ధు, పరమేశ్వరకు దిగ్విజయ్ సింగ్ సూచన బెంగళూరు : రాష్ర్ట ముఖ్యమంత్రిగా దళితుడిని నియమించాలన్న నినాదంపై ఎక్కడా అనవసరంగా నోరు జారకూడదంటూ సీఎం సిద్ధరామయ్యతో పాటు కేపీసీసీ చీఫ్ డాక్టర్ పరమేశ్వర్‌కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సూచించారు. ఇందుకు విరుద్ధంగా జరిగితే పార్టీ తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దళితుడిని చేయాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల కొందరు దళిత నేతలు రిసార్ట్ రాజకీయాలకు తెరలేపారు. దీంతో ఈ అంశంపై సిద్ధు, పరమేశ్వర్ ఎవరికి తోచినట్లు వారు బహిరంగంగా విమర్శలు చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణిస్తూ వారిద్దరిని దిగ్విజయ్‌సింగ్ గట్టిగా హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఈ అంశంపై ఎక్కడా నోరు మెదపరాదని ఆయన సూచించినట్లు తెలిసింది. -
సామర్థ్యాన్ని బట్టి శాఖలు...
సతీష్ జారకీహోళీ పై పరమేశ్వర్ పరోక్ష విమర్శలు బెంగళూరు: ‘వ్యక్తి సామర్థ్యాన్ని బట్టి శాఖలను కేటాయిస్తారు, అందరికీ మంచి శాఖలే కావాలంటే ఎలా? ఇచ్చిన శాఖను సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలి’ అంటూ కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) అధ్యక్షుడు పరమేశ్వర్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి సతీష్ జారకీహోళీపై పరోక్ష విమర్శలు చేశారు. బుధవారమిక్కడ తన నివాసంలో తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. తాను, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కలిసి సతీష్ జారకీహోళీ రాజీనామా వెనక్కు తీసుకునేలా ఒప్పిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సతీస్ జారకీహోళీ రాజీనామాను తనకు పంపారని, పదవికి రాజీనామా చేసినా పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని ఆ లేఖలో పేర్కొన్నారని తెలిపారు. ఒకవేళ రాజీనామాను వెనక్కు తీసుకునేందుకు సతీష్ జారకీహోళీ అంగీకరించకపోతే పార్టీని రాష్ట్రంలో మరింత పటిష్టం చేసేందుకు ఆయన సేవలను వినియోగించుకుంటామని చెప్పారు. ఇక పోర్ట్‌ఫోలియో మార్పును కోరుతూనే సతీష్ జారకీహోళీ రాజీనామా చేశారనే అంశంపై తనకెలాంటి సమాచారం లేదని పరమేశ్వర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడైన సతీష్ జారకీహోళీ ఏదో చిన్నపాటి మనస్పర్థ కారణంగా రాజీనామా చేసి ఉండవచ్చని, అయితే అవన్నీ చర్చల ద్వారా సమసిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ప్రభు చౌహాన్‌పై అనర్హత వేటు వేయండి
బెంగళూరు : ఎమ్మెల్యే ప్రభు చౌహాన్‌పై అనర్హత వేటు వేయాలని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ పరమేశ్వర్ స్పీకర్‌ను కోరారు. గురువారం బెళగావిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభలోనే సెల్ఫోన్లో నీలిచిత్రాలు చూసిన చరిత్ర బీజేపీదని ధ్వజమెత్తారు. ఉత్తర కర్ణాటక ప్రజలతో పాటు రైతుల సమస్యలపై సభలో చర్చ జరుగుతున్న సమయంలో సెల్‌ఫోన్ చూస్తూ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన ప్రభు చౌహాన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఇప్పటికే తమ పార్టీ శాసనసభ్యులకు సైతం శాసనసభలోకి ప్రవేశించే ముందే ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాల్సిందిగా సూచించినట్లు వెల్లడించారు. అనంతరం కాంగ్రెస్ ఎమ్మల్సీ వీఎస్ ఉగ్రప్ప మాట్లాడుతూ...అమ్మాయిల ఫొటోలను అసభ్య రీతిలో చూస్తూ బీజేపీ నేతలు మరోసారి తమ గుణాన్ని చాటుకున్నారని విమర్శించారు. శాసనసభ సమావేశాల సమయంలో సెల్‌ఫోన్‌ను వాడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
అంబితో అప్రతిష్ట
కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారిన మంత్రి ప్రవర్తన రాహుల్, దిగ్విజయ్‌లకు లేఖ రాసిన మండ్య కాంగ్రెస్ కార్యకర్తలు లేఖతో పాటు ‘లీలల’ సీడీని జత చేసిన వైనం మండ్య : రాష్ర్ట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌పై బహిరంగ వాఖ్యలు చేస్తూ పలు వివాదాలకు నిలయంగా మారారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, మండ్య జిల్లా ఇన్చార్జ్ మంత్రి అంబరీష్. ఇప్పుడు ఆయన మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. చీకటి వెలుగుల్లో, మద్యం తాగుతూ తన మద్దతుదారులతో కలిసి నృత్యాలు చేస్తున్న వీడియో, యువతికి ముద్దులు పెడుతున్న దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. దాంతో అంబరీష్‌పై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. అతని ప్రవర్తనపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌కు జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో విద్యార్థినులు, మహిళలపైన హత్యాచారాలు, దౌర్జన్యాలతో చెడ్డ పేరు మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అంబరీష్ ప్రవర్తన మరో భారంగా మారింది. ఇటీవల అంబరీష్ బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు కూడా పార్టీకి చెడ్డ పేరును చేస్తున్నాయి. గత వారం కలబుర్గిలో జరిగిన మంత్రివర్గం సమావేశానికి అంబరీష్ గైర్హాజర్ అయ్యారు. ఏఐసీసీ పలుమార్లు సూచించినా కేపీసీసీ కార్యాలయానికి గాని, జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి కాని అంబరీష్ రావడంలేదు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్నేహితులు, మద్దతుదారులతో కలిసి హోటల్లో జల్సా చేస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. అంబరీష్ ప్రవర్తనపై ఇంతకు ముందు ఉన్న రాష్ట్ర గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ కూడా మీడియా ముందు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రిగా ఉండి రేస్‌క్లబ్‌లో కనిపించడంపై ఆయన మండిపడిన విషయం తెల్సిందే. అయినా అంబరీష్లో మార్పు రాలేదు. గత మార్చిలో తీవ్ర శ్వాసకోశ వ్యాధితో అంబరీష్ సింగపూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. దానికి అవసరమైన ఖర్చు మొత్తం 1.22 కోట్లను ప్రభుత్వమే భరించింది. దీనిపై కూడా అప్పుడు వివాదం చెలరేగింది. తాను ఎన్నికైన మండ్య శాసన సభ నియోజకవర్గంలో అంబరీష్ ఎప్పుడూ పర్యటించలేదు. జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉంటూ మండ్యలో చేపట్టిన అభివృద్ధి పనులు శూన్యం. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ పరమేశ్వర్, సీనియర్ నాయకులు కలిసి సిద్ధం చేసిన బోర్డు మెంబర్ల ఎన్నికపై అంబరీష్ బహిరంగంగా విమర్శిలు చేశారు. ఇలా సమావేశాలకు రాకుండా.. కార్యకర్తలను కలువకుండా.. ప్రజల వద్దకు వెళ్లకుండా.. పార్టీ నేతలనే విమర్శిస్తూ అంబరీష్ పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇలాంటి మంత్రిపై చర్యలు తీసుకోవాలని రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో మొత్తం 120 మంది కార్యకర్తలు సంతకాలు చేశారు. ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న అంబరీష్ వీడియో సీడీలను, ఫొటోలను ఆ ఫిర్యాదుకు జతచేసి పంపారు. -
పరమేశ్వర్‌తో విభేదాల్లేవ్
కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌తో తనకు ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టుల నియామకాల్లోనూ ఎలాంటి గందరగోళం లేదని వివరించారు. తుమకూరు : కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌తో తనకు ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని, కొందరు అనవసరంగా గందరగోళం ృసష్టిస్తున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. గురువారం మధుగిరి తాలూకా మిడిగేశిలో సుమారు రూ.560 కోట్లుతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం మాట్లాడారు. నామినేటెడ్ పోస్టుల నియామకంలో ఎలాంటి గందరగోళం లేదన్నారు. అక్రమ గనుల తవ్వకాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని విశ్రాంత లోకాయుక్త సంతోష్‌హెగ్డే చేసిన వ్యాఖ్యలు సత్యదూరమన్నారు. ఇప్పటికే కొన్ని కేసులను సీబీఐ విచారణ చేస్తోందన్నారు. కార్యక్రమంలో మంత్రులు హెచ్‌సీ మహదేవప్ప, టీబీ జయచంద్ర, ఎమ్మెల్యేలు కేఎన్ రాజణ్ణ, రఫీక్ అహ్మద్, జెడీప అధ్యక్షుడు వైఎచ్ హుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. -
కసరత్తు
తుది ఘట్టానికి నామినేటెడ్ పోస్టుల భర్తీ పర్వం జాబితా తయారీ కోసం సిద్ధు, పరమేశ్వర్ సమాలోనలు సాక్షి, బెంగళూరు : చాలా కాలంగా ఊరిస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం తుది ఘట్టానికి చేరుకుంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ పరమేశ్వర్ ఆదివారం సాయంత్రం భేటీ అయారు. సోమవారం కూడా మరోసారి భేటీ కానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా కార్పొరేషన్లు, బోర్డుల అధ్యక్షులు తదితరనామినేటెడ్ పోస్టులను భర్తీ చేయలేదు. నేడు.. రేపు.. అంటూ ఊరిస్తూ సిద్ధరామయ్య కాలాయాపన చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ నెల 16న బెంగళూరు వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఈ నెలాఖరుకు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని సిద్ధరామయ్య, పరమేశ్వర్లకు స్పష్టం చేశారు. దీంతో అప్పటి నుంచి వారు నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై వేర్వేరుగా జాబితాలు తయారు చేసే విషయంలో బిజీగా ఉన్నారు. ఈ రెండు జాబితాలను ఒక చోటకు చేర్చి అంతిమం గా ఒకే జాబితా తయారు చేయడానికి వీలుగా సిద్ధరామయ్య, పరమేశ్వర్ సమావేశమైనట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో టికెట్టు దక్కనివారు, మంత్రి మండలిలో స్థానం లభించని వారికి ఈ నామినేటెడ్ పోస్టుల్లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. మరోవైపు గత ఎన్నికల్లో ఓడిన వారికి నామినేటెడ్ పోస్టులకు ఎంపిక చేయలేమని సిద్ధు, పరమేశ్వర్లు ఇప్పటికే స్పష్టం చేశారు. అయినా నలె నరేంద్రబాబు తదితర నాయకులు పట్టు వీడటం లేదు. ఎలాగైనా సరే నామినేటెడ్ పోస్టులను దక్కించుకునేందుకు వారు ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈనెల 30న ఢిల్లీలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమావేశం కానున్నారు. దీంతో ఆ సమావేశంలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది జాబితాకు ఆమోద ముద్ర వేయించుకోవాలని ఇరువురు నాయకులు భావిస్తున్నారు. మంత్రి మండలి విస్తరణ కూడా... త్వరలోనే మంత్రి మండలి విస్తరణ కూడా చేపట్టనున్నామని దిగ్విజయ్ సింగ్ తన బెంగళూరు పర్యటనలో స్పష్టం చేశారు. దీంతో ఢిల్లీ పర్యటనలోనే పరమేశ్వర్‌కు మంత్రి మండలిలో స్థానంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ చాలా రోజుల నుంచి ఉపముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన విషయం తెలిసిందే. మరోవైపు మంత్రి మండలి పునర్వవస్థీకరణ కూడా ఉంటుందని దిగ్విజయ్ సింగ్ చెప్పిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ముహుర్తంపై కూడా సిద్ధు, పరమేశ్వర్ల పర్యటనలో స్పష్టత రానుంది. మొత్తంగా కన్నడ రాజ్యోత్సవ సంబరాలు జరుపుకునే నవంబర్1న నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన ఘట్టానికి తెరపడనుంది. మరోవైపు మంత్రి మండలి విస్తరణతోపాటు పునర్నిర్మాణ ఘట్టాలకు తెరలేయనుందని కేపీసీసీ నాయకులు చెబుతున్నారు. -
త్వరలో మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ
పరమేశ్వర్‌కు మంత్రి పదవిపై దిగ్విజయ్ సింగ్ ఉప ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన లాబీయింగ్ చేయలేదు ఆయన అనుచరులే హై కమాండ్‌పై ఒత్తిడి తెచ్చారు త్వరలో మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు చేపట్టాలన్నది సీఎం నిర్ణయిస్తారు సాధ్యమైనంత త్వరగా నామినేటెడ్ పోస్టుల భర్తీ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వారికి తప్పక చోటు సాక్షి,బెంగళూరు : కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ పరమేశ్వర్‌కు మంత్రి మండలిలో స్థానం కల్పించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాజకీయ వ్యవహరాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. ‘పరమేశ్వర్ విషయం ప్రత్యేకం. అందుకే ఆయనకు అమాత్య స్థానం ఇస్తున్నాం.’ అని స్పష్టం చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి బెంగళూరు వచ్చిన ఆయన మీడియాతో గురువారం మాట్లాడారు. ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పరమేశ్వర్ ఎప్పుడు కూడా లాబీయింగ్ జరపలేదన్నారు. ఆయన అనుచరులు మాత్రం ఈ విషయంపై హై కమాండ్‌పై ఒత్తిడి తీసుకువచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. మరోవైపు పరమేశ్వర్ విషయాన్ని ప్రత్యేకంగా పరిగణించాల్సి ఉండటం వల్ల ఆయనకు రాబోయే మంత్రి మండలి విస్తరణలో చోటు కల్పిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా త్వరలో మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ కూడా ఉంటుందన్నారు. అయితే ఈ విషయంలో హై కమాండ్ జోక్యం చేసుకోదన్నారు. ఈ విషయం ఎప్పుడు చేపట్టాలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిర్ణయానికే వదిలేస్తున్నామని వివరించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై గందరగోళానికి పూర్తిగా తెరపడిందన్నారు. సాధ్య మైనంత త్వరగా నామినేటెడ్ పోస్టుల భర్తీకు సంబంధిచిన జాబితా హై కమాండ్‌కు పంపాల్సిందిగా సూచించామన్నారు. మార్గదర్శకాలను అనుసరించి ప్రస్తుత, మాజీ శాసనసభ్యులతోపాటు గత ఎన్నికల్లో పార్టీ టికెట్టు పొందిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వబోమని తెలిపారు. పార్టీ పటిష్టత కోసం కృషి చేసిన వారికి నామినేటెడ్ పోస్టుల భర్తీలో తప్పక స్థానం కల్పిస్తామని తెలిపారు. నెలాఖరుకల్లా ఈ ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టంచేశారు. సీఎం సిద్ధు, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయన్నారు. అదేవిధంగా ప్రభుత్వానాకి, పార్టీకి మధ్య ఎటువంటి బేధాభిప్రాయాలు లేవని స్పష్టంచేశారు. అంతకు ముందు సిద్ధరామయ్య, పరమేశ్వర్ ఒకటిగా దిగ్విజయ్ సింగ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈనెల 25లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తిచేస్తామని ఆయనకు భరోసా ఇచ్చారు. అనంతరం వారిరువురూ బెంగళూరులోని శివానందసర్కిల్ వద్ద ఉన్న ఓ హోటల్లో కలిసి టిఫిన్ తిన్నారు. ఈ సందర్భంగా సీఎం సిద్ధు మీడియాతోమాట్లాడుతూ... ‘మేము ఇద్దరం ఫ్రెండ్స్. బయట ఎప్పుడు కలిసినా ఒకటిగా టిఫిన్ తింటాం. ఇందులో ప్రత్యేకత ఏమీలేదు.’ అని అన్నారు. -
కరియప్ప చేరికతో కాంగ్రెస్‌లో లుకలుకలు
సింధనూరు టౌన్ : గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున తెర వెనుక ప్రచారం చేసిన ప్రముఖ నాయకుడు కే.కరియప్ప ఇటీవల బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ.పరమేశ్వర్ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బాదర్లి హంపనగౌడ వర్గం జీర్ణించుకోలేక పోతోంది. మాజీ కాంగ్రెస్ ఎంపీ కే.విరుపాక్షప్ప బంధువైన కరియప్ప గత అసెంబ్లీ ఎన్నికల వరకు విరుపాక్షప్ప వెంటే ఉన్నారు. అయితే ఎన్నికల్లో ఓటమి అనంతరం సంభవించిన పరిణామాలు, స్థానికంగా మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎంపీ కే.విరుపాక్షప్ప బీజేపీలో చేరారు. అప్పుడు కరియప్ప మాత్రం తటస్తంగా ఉన్నాడు. అయితే తెర వెనుక కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేపట్టారు. క్రమంగా విరుపాక్షప్పకు దూరమైన కరియప్ప ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కరియప్పను భవిష్యత్తులో కురుబ సమాజ నాయకుడిగా పార్టీ గుర్తిస్తే విరుపాక్షప్పకే నష్టమనే వదంతులు వినిపిస్తున్నాయి. అంతకు ముందు బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన కే.విరుపాక్షప్ప గత లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించగా అప్పట్లో విరుపాక్షప్ప చేరికను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే హంపనగౌడ వర్గం సీఎం, కేపీసీసీ అధ్యక్షులకు మొర పెట్టుకున్నారు. దీంతో నిరాశ చెందిన విరుపాక్షప్ప చివరకు బీజేపీలో చేరిపోయాడు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బంధువు కాంగ్రెస్ అభ్యర్థి బసవరాజ్ హిట్నాళ్ తరఫున ప్రచారం చేయకుండా బీజేపీ బలపరిచిన అభ్యర్థి కరడి సంగణ్ణకే మద్దతు తెలిపి గెలిపించారు. అదే సమయంలో కరియప్ప కాంగ్రెస్ అభ్యర్థి తరఫున తెర వెనుక ప్రచారం చేసి పార్టీ అగ్రనాయకత్వంతో సంబంధాలు పెంచుకున్నారు. దీంతో పార్టీ అగ్రనాయకత్వం సమక్షంలో పార్టీలో చేరిపోయారు. అయితే ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే వర్గంలోని కొందరు నగరసభ సభ్యులు రాజీనామా చేస్తామని తమ అసంతృప్తి వ్యక్తం చేయగా, మరికొందరు నోరు మెదపడం లేదు. అగ్ర నాయకత్వం సమక్షంలో పార్టీలో చేరినా రాబోయే రోజుల్లో స్థానిక నాయకులతో పొసుగుతారో లేక సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారో వేచి చూడాలి. -
బెల్గాం మనదే..
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సాక్షి, బెంగళూరు/మైసూరు : కర్ణాటకలో బెల్గాం అంతర్భాగమేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. మహాజన్ నివేదికను అనుసరించి బెల్గాం ఎప్పటికీ కర్ణాటకలోనే ఉంటుందన్నారు. మైసూరులో స్థానిక మీడియా ప్రతినిధులతో ఆయన ఆదివారం మాట్లాడారు. ఈ విషయంలో మహారాష్ట్ర అనవసర రాద్ధాంతం చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఉత్తర కర్ణాటక ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలని మాజీ మంత్రి ఉమేష్‌కత్తి పేర్కొనడాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తప్పుపట్టారు. అఖండ కర్ణాటక ప్రతి ఒక్క కన్నడిగుడి కల అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కర్ణాటకను విభజించే ప్రసక్తే లేదన్నారు. స్థానిక సంస్థలతోపాటు వివిధ బోర్డులు, కార్పొరేషన్లలో 50 శాతం పోస్టులు మహిళలకు కేటాయించాలనేది తనతోపాటు తమ పార్టీ అభిమతమన్నారు. ఈ విషయంలో గవర్నర్ వజూభాయ్ రుడాభాయ్ వాలా సలహా తీసుకుంటామని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై నేడు (సోమవారం) బెంగళూరులో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పరమేశ్వర్ కూడా పాల్గొననున్నారని తెలిపారు. పరమేశ్వర్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వకూడదని తాను పార్టీ హై కమాండ్‌కు లేఖ రాశానన్నది ఆధార రహితమని అసహనం వ్యక్తం చేశారు. ఉత్తరకర్ణాటక ప్రాంతంలో ఏర్పడిన అతివృష్టి వల్ల నష్టపోయిన రైతులను, ప్రజలను ఆదుకునేందుకు రూ.426 కోట్ల పరిహారాన్ని అందించాల్సిందిగా కేంద్రానికి లేఖ రాశానన్నారు. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఏర్పడిన కరువు పరిస్థితులపై కేంద్రానికి మరో నివేదిక పంపించనున్నట్లు చెప్పారు. దసరా ఉత్సవాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోబోదన్నారు. ఈ విషయంలో మైసూరు జిల్లా అధికారులతోపాటు ఉత్సవాల నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక కమిటీదే అంతిమ నిర్ణయమని సిద్ధరామయ్య పేర్కొన్నారు. -
కాంగ్రెస్ టికెట్ కోసం స్థానికేతరుల పోటీ
సాక్షి, బళ్లారి : బళ్లారి గ్రామీణ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసేందుకు స్థానికేతరరులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే నెల 21న జరగనున్న ఉప ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. ఆగస్టు 2 వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్‌ను దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. చిత్రదుర్గం మాజీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు శశికుమార్, చిత్రదుర్గం జిల్లా మొళకాల్మూరు మాజీ ఎమ్మెల్యే ఎన్వై. గోపాలకృష్ణ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిద్దరు స్థానికేతరులే. బళ్లారి గ్రామీణ నియోజకవర్గ టికెట్‌ను ఎలాగైనా దక్కించుకోవాలని సీఎం సిద్దరామయ్య, కేసీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ల వద్ద తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్వై గోపాలకృష్ణ మొళకాళ్మూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈయన చిత్రదుర్గం మాజీ ఎంపీ, బళ్లారి నుంచి కాంగ్రెస్ తరుపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఎన్వై. హనుమంతప్పకు స్వయానా సోదరుడు. ఎన్వై గోపాలకృష్ణతోపాటు సినీ నటుడు, మాజీ ఎంపీ శశికుమార్ కూడా టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. బళ్లారి గ్రామీణ నియోజకవర్గంలో శ్రీరాములుకు బలమైన క్యాడర్ ఉందని, ఆయన వర్గీయులు ఎవరిని నిలబెట్టినా బీజేపీ సునాయాసంగా గెలుపొందే అవకాశం ఉంది. అందువల్ల బలమైన అభ్యర్థిని కాంగ్రెస్ తరుపున పోటీకి నిలబెట్టాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బళ్లారి గ్రామీణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓడిపోయిన వండ్రీ (వన్నూరప్ప) ఈసారి తనకే టికెట్ కేటాయించాలని పట్టుబడుతున్నారు. వండ్రీతో పాటు మరో కాంగ్రెస్ నేత రాంప్రసాద్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బళ్లారి జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత, బహిర్గతంగా విభేదాలు ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఒక వర్గానికి టికెట్ కేటాయిస్తే మరొక వర్గం చెందిన నేతలు మద్ధతు ఇస్తారా? లేదా? అన్నది ఆ పార్టీ నేతలకే తెలియడం లేదు. అయితే లోకల్ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలా? లేక నాన్‌లోకల్ అభ్యర్థికి టికెట్ కేటాయిస్తే ఎలా ఉంటుందనే కోణంలో కాంగ్రెస్ హైక మాండ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. -
రూ. 2.32 కోట్ల చోరీ సొత్తు స్వాధీనం
కార్లు అపహరిస్తున్న తమిళనాడు నివాసి అరెస్టు దొంగనోట్లు చలామణి కేసులో మరో ఇద్దరు అసోం వాసులు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి బెంగళూరు : బెంగళూరు ఆగ్నేయ విభాగం పోలీసులు 46 కేసులు దర్యాప్తు చేసి 18 మంది నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 2.32 కోట్ల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి చెప్పారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తమిళనాడులోని మధురైకి చెందిన పరమేశ్వర్ అలియాస్ స్కార్పియో పరమేశ్వర్ అనే నిందితుడిని అరెస్టు చేసి రూ.1.50 కోట్ల విలువైన 14 మారుతి షిఫ్ట్ కార్లు, నాలుగు మారుతి డిజైర్ కార్లు, ఒక స్కార్పియో కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బెంగళూరు చేరుకుని పార్కింగ్ స్థలాల్లో ఉన్న కార్ల వెనుక అద్దాలు పగల గొట్టి వాహనాలను అపహరించుకుని పోయేవాడు. ఈ విధంగా అపహరించిన వాహనాలకు నకిలీ ఆర్సీలు సృష్టించి తమిళనాడులో విక్రయించి వచ్చిన డబ్బుతో జల్సా చేసేవాడు. మరో కేసులో ఇక్కడి బీటీఎం లేఔట్లో నివాసం ఉంటున్న పిలాకల్ నజీర్ అనే నిందితుడిని ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు అరెస్టు చేశారు. ఇతని వద్ద నుంచి రూ. 30 లక్షల విలువైన ఆర్డీ-క్యూ అనే విలాసవంతమైన కారు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఇదే కారులో నిందితుడు వాయువేగంతో ప్రయాణించడంతో పోలీసులు అడ్డుకుని ఆర్సీలు పరిశీలించగా తస్కరించిన కారుగా పోలీసులు గుర్తించారు. ఇక నాగ నాథపురంలో నివాసం ఉంటున్న గురుప్రసాద్, మంజునాథ్, సురేష్ అనే నిందితులను అరెస్టు చేసి టాటా సుమోవాహనం స్వాధీనం చేసుకున్నారు. గతనెల 18న నిందితులు ఇక్కడి రేడియెంటల్ క్యాష్ మేనేజ్మెంట్కు చెందిన వాహనం అపహరించుకుని పోయారు. మరోకేసులో తమిళనాడులోని తిరువుణ్ణామలైకు చెందిన శంకర్ అనే నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి తొమ్మిది ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇక నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న అసోకు చెందిన అక్బర్ హుస్సేన్, నజీర్ రెహమాన్ అనే నిందితులను ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు అరెస్టు చేశారు. అదే విధంగా వివిధ కేసుల్లో 24 కార్లతో పాటు ఆరు బైక్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నామని ఎం.ఎన్. రెడ్డి చెప్పారు. సమావేశంలో అడిషనల్ పోలీసు కమిషనర్ శరత్చంద్ర, డీసీపీ పవార్ తదితరులు పాల్గొన్నారు. -
పింఛన్ ఇయ్యలేదు..
చిత్రంలో కన్పిస్తున్న వృద్ధులు పింఛన్ కోసం వస్తే వారిపై దయచూపాల్సింది పోయి నిర్దయగా మున్సిపల్ కార్యాలయ సిబ్బంది బయటకు గెంటేశారు. వయసు మీదపడి జీవితాన్ని అష్టకష్టాలపై లాక్కొస్తున్న పండుటాకులపై పింఛన్ పంపిణీ చేసే సిబ్బంది సోమవారం దురుసుగా ప్రవర్తించారు. దీంతో వృద్ధులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వృద్ధులు మాట్లాడుతూ ‘ ఇంక పదిరోజులుంటే మే నెల పూర్తవుతుంది. ఇంతవరకూ పింఛన్ ఇవ్వలేదు. పింఛన్ ఇవ్వండని అడగడానికి వస్తే మా గోడు పట్టించుకునేవారు లేరు. పైగా దురుసుగా మాట్లాడుతున్నారు. ఇదెక్కడి న్యాయం ’ అంటూ తీవ్ర ఆవేదన చెందారు. వృద్ధులు ధర్నాకు దిగడంతో మున్సిపల్ అధికారులు పోలీసులను పిలిపించారు. ఏఏ ప్రాంతం వారికి పింఛన్లు పంపిణీ చేస్తామో ఆ వివరాలను కచ్చితంగా తెలియజేస్తామని చెప్పడంతో వృద్ధులు వెనుదిరిగి వెళ్లిపోయారు. కాని కొద్దిరోజుల క్రితం పింఛన్ కోసం వచ్చి వడదెబ్బతగిలి వృద్ధుడు మరణించాడని.. తమకు సరైన సమాచారం ఇవ్వకుండా తిప్పుకుంటే తమకు వడదెబ్బ తగిలితే పరిస్థితి ఏంటని పండుటాకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - న్యూస్‌లైన్ , మైదుకూరు టౌన్ ఉదయం నుంచి పడిగాపులు పెనగలూరు, న్యూస్‌లైన్: సగం నెల దాటిపోయినప్పటికీ నేటికీ పింఛన్లు ఇవ్వకపోవడంతో వృద్ధులు పడిగాపులు కాస్తున్నారు. సోమవారం పింఛన్లు ఇస్తామని తెలపడంతో ఉదయం 7గంటల నుంచే వినాయకస్వామి మంటపం వద్ద పడిగాపులు కాయడం మొదలెట్టారు. అనేక మందికి పింఛన్లు రాలేదని తెలపడంతో నిరుత్సాహంతో మండల అభివృద్ధి కార్యాలయానికి చేరుకున్నారు. సిద్దవరం, పెనగలూరు, సింగనమల, సింగారెడ్డిపల్లె పంచాయతీలతో పాటు పలు పంచాయతీలల్లో డబ్బులు రాలేదని సీఆర్పీలు తెలపడంతో వృద్ధులు.. వికలాంగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. డబ్బులు పంపిణీ చేసే అధికారి పరమేశ్వర్‌కు తమ బాధ విన్నవించారు. దీంతో ఎంపీడీఓ కార్యాలయంలో తిరిగి వేలిముద్రలు, ఫోటోలు తీశారు. రెండు, మూడు నెలలుగా పింఛన్ రాలేదని, తరువాత వస్తుందో, రాదోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధుల ధర్నా రైల్వేకోడూరు అర్బన్, న్యూస్‌లైన్: పింఛన్ ఇవ్వలేదని సోమవారం మండలంలోని వందలాది మంది స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన తెలియచేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ గత రెండు నెలలుగా పింఛన్ ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని, దీంతో తీవ్ర నిరాశకు గురయ్యామని తెలిపారు. జ్యోతి కాలనీకి చెందిన లెప్రసీ కాలనీ వారు మాట్లాడుతూ బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు వేయాలంటే తమకు కష్టంగా ఉందని, అసలే మాకు చేతివేళ్లు, కాలు వేళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని, బయోమెట్రిక్‌లో ముద్రలు లేవని పింఛన్ ఆపడం ఎంత వరకు సమంజసమని వారు వాపోయారు. ఈ విషయమై ఐసీఐసీఐ మండల కో-ఆర్డినేటర్ సురేష్‌ను వివరణ కోరగా బయోమెట్రిక్ విధానం వల్ల వేలి ముద్రలు సరిగా లేని వారికి గత రెండు నెలలుగా పింఛన్‌రావడం లేదన్నారు. త్వరలో పింఛన్ రాని వారందరి వేలిముద్రలు తీసుకుని జూన్నెలలో అందరికీ అందచేస్తామన్నారు. -
హైదరాబాద్-బీజాపూర్ రహదారిని నాలుగు లేన్లుగా మార్చేందుకు కృషి
పరిగి, న్యూస్‌లైన్: అంతర్రాష్ట్ర రహదారి హైదరాబాద్ - బీజాపూర్ మార్గాన్ని నాలుగు లేన్లుగా మార్చేందుకు కృషి చేస్తానని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు పరమేశ్వర్ అన్నారు. ఆదివారం పీసీసీ కార్యదర్శి టీ.రామ్మోహన్‌రెడ్డి, కర్ణాటక మాజీ ఎమ్మెల్యే బోస్‌రాజ్‌లతో కలిసి ఆయన పరిగిలో విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక - హైదరాబాద్‌ల మధ్య ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగించడానికి అంతర్రాష్ట్ర రహదారిని విస్తరించాల్సి ఉందని, ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధ చూపనున్నట్టు చెప్పారు. అలాగే పరిగి మీదుగా వికారాబాద్ - రాయచూర్ రైల్వేలైన్ ఏర్పాటుకు సహకరిస్తానన్నారు. యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ చొరవతో కర్ణాటకలోని ఆరు నైజాం జిల్లాల్లో విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ప్రత్యేకంగా జీఓ అలాగే ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ మంజూరైందని చెప్పారు. ఏఐసీసీ అధినేత్రికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఫిబ్రవరి 1వతేదీన గుల్బర్గాలో 2లక్షల మందితో సభ నిర్వహించనున్నామన్నారు. సభకు సోనియాగాంధీ హాజరు కానున్నారని, హైదరాబాద్ - బీజాపూర్ రోడ్డు విస్తరణ అలాగే రైల్వే ఏర్పాటు ప్రతిపాదనలు ఆమె ముందు ఉంచుతామని పరమేశ్వర్ తెలిపారు. ఏపీసీ కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని అన్నారు. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని సోనియాగాంధీని కోరతానని చెప్పారు. అనంతరం కాంగ్రెస్ పరిగి నాయకులు, కార్యకర్తలు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిని ఘనంగా సన్మానించారు.