త్వరలో మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ
- పరమేశ్వర్‌కు మంత్రి పదవిపై దిగ్విజయ్ సింగ్
- ఉప ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన లాబీయింగ్ చేయలేదు
- ఆయన అనుచరులే హై కమాండ్‌పై ఒత్తిడి తెచ్చారు
- త్వరలో మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ
- ఎప్పుడు చేపట్టాలన్నది సీఎం నిర్ణయిస్తారు
- సాధ్యమైనంత త్వరగా నామినేటెడ్ పోస్టుల భర్తీ
- పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వారికి తప్పక చోటు
సాక్షి,బెంగళూరు : కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ పరమేశ్వర్‌కు మంత్రి మండలిలో స్థానం కల్పించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాజకీయ వ్యవహరాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. ‘పరమేశ్వర్ విషయం ప్రత్యేకం. అందుకే ఆయనకు అమాత్య స్థానం ఇస్తున్నాం.’ అని స్పష్టం చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి బెంగళూరు వచ్చిన ఆయన మీడియాతో గురువారం మాట్లాడారు. ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పరమేశ్వర్ ఎప్పుడు కూడా లాబీయింగ్ జరపలేదన్నారు.
ఆయన అనుచరులు మాత్రం ఈ విషయంపై హై కమాండ్‌పై ఒత్తిడి తీసుకువచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. మరోవైపు పరమేశ్వర్ విషయాన్ని ప్రత్యేకంగా పరిగణించాల్సి ఉండటం వల్ల ఆయనకు రాబోయే మంత్రి మండలి విస్తరణలో చోటు కల్పిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా త్వరలో మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ కూడా ఉంటుందన్నారు. అయితే ఈ విషయంలో హై కమాండ్ జోక్యం చేసుకోదన్నారు. ఈ విషయం ఎప్పుడు చేపట్టాలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిర్ణయానికే వదిలేస్తున్నామని వివరించారు.
నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై గందరగోళానికి పూర్తిగా తెరపడిందన్నారు. సాధ్య మైనంత త్వరగా నామినేటెడ్ పోస్టుల భర్తీకు సంబంధిచిన జాబితా హై కమాండ్‌కు పంపాల్సిందిగా సూచించామన్నారు. మార్గదర్శకాలను అనుసరించి ప్రస్తుత, మాజీ శాసనసభ్యులతోపాటు గత ఎన్నికల్లో పార్టీ టికెట్టు పొందిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వబోమని తెలిపారు. పార్టీ పటిష్టత కోసం కృషి చేసిన వారికి నామినేటెడ్ పోస్టుల భర్తీలో తప్పక స్థానం కల్పిస్తామని తెలిపారు.
నెలాఖరుకల్లా ఈ ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టంచేశారు. సీఎం సిద్ధు, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయన్నారు. అదేవిధంగా ప్రభుత్వానాకి, పార్టీకి మధ్య ఎటువంటి బేధాభిప్రాయాలు లేవని స్పష్టంచేశారు. అంతకు ముందు సిద్ధరామయ్య, పరమేశ్వర్ ఒకటిగా దిగ్విజయ్ సింగ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈనెల 25లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తిచేస్తామని ఆయనకు భరోసా ఇచ్చారు. అనంతరం వారిరువురూ బెంగళూరులోని శివానందసర్కిల్ వద్ద ఉన్న ఓ హోటల్‌లో కలిసి టిఫిన్ తిన్నారు. ఈ సందర్భంగా సీఎం సిద్ధు మీడియాతోమాట్లాడుతూ... ‘మేము ఇద్దరం ఫ్రెండ్స్. బయట ఎప్పుడు కలిసినా ఒకటిగా టిఫిన్ తింటాం. ఇందులో ప్రత్యేకత ఏమీలేదు.’ అని అన్నారు.