ఇక విస్తరణం
- అమాత్య పదవుల కోసం పైరవీలు
- కలను సాకారం చేసుకునే దిశలో పరమేశ్వర
- ఆశావహుల జాబితాలో స్పీకర్ తిమ్మప్ప!
- రేసులో యువ ఎమ్మెల్యేలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : పాలక కాంగ్రెస్‌లో అమాత్య పదవుల కోసం పైరవీలు ప్రారంభమయ్యాయి. మంత్రి వర్గంలో ఎవరికీ ఉద్వాసన పలికేది లేదని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సీనియర్లు మంత్రి పదవులకు ఇవ్వాలని పట్టుబడుతుండగా, యువ ఎమ్మెల్యేలు కూడా తమ గాడ్ ఫాదర్ల ద్వారా సీఎంపై ఒత్తిడి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు.
నగరంలో ఈ నెల 26న పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరుగనుంది. దిగ్విజయ్ సింగ్ పాల్గొనే ఈ సమావేశంలో మంత్రి వర్గ విస్తరణ గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర సైతం తన కలను నిజం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం మంత్రి వర్గంలో అయిదు ఖాళీలున్నాయి.
ఆశావహుల జాబితా కొండవీటి చాంతాడులా ఉంది. సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డాక్టర్ మాలక రడ్డి, వీరన్న మత్తికట్టి, మనోహర్ తహసిల్దార్, మాలికయ్య గుత్తేదార్, కేబీ. కోళివాడలు మంత్రి పదవుల కోసం పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నాలు సాగిస్తున్నారు. స్పీకర్ కాగోడు తిమ్మప్ప కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. యువ ఎమ్మెల్యేలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు.