- పరమేశ్వర్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ఓ వర్గం డిమాండ్
- వద్దంటూ మరో వర్గం వినతి
- వాహనానికి అడ్డుపడిన కార్యకర్తలు
సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల శాఖ ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్‌కు అసమ్మతి సెగ తగిలింది. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పరమేశ్వర్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పార్టీలోని ఓ వర్గం బహిరంగంగా డిమాండ్ చేయగా, మరోవర్గం మాత్రం వెంటనే ఆయన్ను అధ్యక్షుడి స్థానం నుంచే తొలగించాలని పేర్కొంది.
ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి బెంగళూరుకు వచ్చిన దిగ్విజయ్ సింగ్‌తో కేపీసీసీకి చెందిన కొందరు నాయకులు శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ డంతో పాటు తాజా ఎన్నికల్లో గతంతో పోలిస్తే ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి పరమేశ్వర్ కారణమని తెలిపారు. దీంతో ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కార్యకర్తల విన్నపాన్ని సావధానంగా విన్న దిగ్విజయ్.. ఎటువ ంటి సమాధానం ఇవ్వకుండా కారులో ఎక్కుతుండటంతో ఆగ్రహించిన కార్యకర్తలు కారును అడ్డగించారు. దిగ్విజయ్‌తోపాటు సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొద్దిసేపు అన ంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ సమాచారం తెలుసుకున్న పరమేశ్వర్ వ్యతిరేక వర్గీయులు అక్కడికి చేరుకుని పరమేశ్వర్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ డిప్యూటీ సీఎం పదవి ఇవ్వకూడదని డిగ్గీని కలిసి విన్నవించారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్నా విపక్ష బీజేపీ కంటే తక్కువ సీట్లు గెలుచుకోవడానికి పరమేశ్వర్ తెరవెనుక నడిపిన మంత్రాంగమే కారణమని ఫిర్యాదు చేశారు. ఆయన్ను తక్షణం కేపీసీసీ అధ్యక్ష స్థానం నుంచి తొలగించాలని విన్నవించారు. అయితే వీరితో కూడా దిగ్విజయ్ ఏమీ మాట్లాడలేదని సమాచారం. ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పరమేశ్వర్లు దిగ్విజయ్‌ను కలిసి ప్రభుత్వం, పార్టీ పనితీరును వివరించారు.
రాజ్యసభ, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయం కూడా వీరి మధ్య చర్చకు వచ్చిన ట్లు తెలిసింది. మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులపై కన్నేసిన పలువురు నాయకులు దిగ్విజయ్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఏది ఏమైనా పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మొదటిసారిగా నగరానికి వచ్చిన పార్టీ వ్యవహార ఇన్‌ఛార్జ్‌కు అసమ్మతి సెగ తగలడం నాయకుల మధ్య ఉన్న ఐనైక్యతను తెలియజేస్తోందని ఆ పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.