కోల్డ్ వార్!
- పదవుల పందేరానికి కసరత్తు
- అరగంటకు పైగా సీఎం, కేపీసీపీ చీఫ్ సమావేశం
- ఉప ముఖ్యమంత్రి పదవిపై ప్రస్తావించిన పరమేశ్వర
- ఇది సమయం కాదని వారించిన సిద్ధు
- కాసేపు వాగ్వాదం
- అర్ధంతరంగా ముగిసిన చర్చలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నాయకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కార్పొరేషన్లు, బోర్డుల నియామకాలకు కసరత్తు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వరలు సోమవారం ఓ హోటల్‌లో దీనిపై అర గంటకు పైగా చర్చించినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా పరమేశ్వర ఉప ముఖ్యమంత్రి పదవి గురించి ప్రస్తావించినప్పుడు, ముఖ్యమంత్రి వారించినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ పదవిపై బహిరంగంగా మాట్లాడవద్దని కూడా సీఎం సూచించినట్లు తెలిసింది. ఈ సమావేశాన్ని బోర్డులు, కార్పొరేషన్ల పదవులకు మాత్రమే పరిమితం చేద్దామని ఆయన చెప్పడంతో ఇద్దరి మధ్య కాసేపు విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ బుధవారం బెల్గాంకు వస్తున్నందున, ఆలోగా పార్టీ తరఫున జాబితాను సిద్ధం చేయాలని సీఎం పరమేశ్వరకు సూచించారు. అయితే సీఎంగా మీరిస్తున్న జాబితాలో ఎప్పటి నుంచో కాంగ్రెస్‌ను నమ్ముకున్న వారి పేర్లు లేవని తనకు సమాచారం అందిందని పరమేశ్వర నిష్టూరమాడారు. దీనికి సీఎం సమాధానమిస్తూ పార్టీలో పాత వారు, కొత్త వారు అనే విభాగాలు లేవని, పార్టీకి ఎవరు ఎక్కువగా సేవ చేశారనేది ఎంపికకు ప్రాతిపదిక కావాలని సూచించినట్లు తెలిసింది.
60 మంది పేర్ల ఖరారు
ఇద్దరి మధ్య మనస్పర్థలు పొడ సూపడంతో సమావేశాన్ని అర్ధంతరంగా ముగించినట్లు తెలిసింది. మెట్రో రైలు పనులను పరిశీలించాలనే నెపంతో సీఎం వెళ్లిపోయినట్లు తెలిసింది. ఆయన ముందు ద్వారం నుంచి పరమేశ్వర వెనుక ద్వారం నుంచి నిష్ర్కమించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈలోగానే కార్పొరేషన్లు, బోర్డుల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు 60 మంది పేర్లను ఖరారు చేసినట్లు తెలిసింది.