కృష్ణరాజపురం : దివంగత ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు వేగవంతం చేసి నిజానిజాలు వెలికితీయాలని సీబీఐకి లేఖ రాస్తానని కర్ణాటక హోం శాఖ మంత్రి డాక్టర్.జీ. పరమేశ్వర్ పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది వసతి కోసం కృష్ణరాజపురంలో రూ.69 కోట్లతో చేపట్టిన 360 గృహాల నిర్మాణ పనులకు గురువారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. డీకే రవి ఎలా చనిపోయాడో తేల్చాలని డిమాండ్ చేస్తూ ఆనందరావ్ సర్కిల్‌లో ధర్నా చేపట్టిన అతని తల్లిదండ్రులను తాను పరామర్శించానని, రవి మృతిపై నిజాన్ని బయట పెట్టాలని వారు కోరారన్నారు.
ఈ విషయంపై దర్యాప్తు వేగవంతం చేయాలని తాను సీబీఐకి లేఖ రాస్తానన్నారు. బెంగళూరు నగరంలో ఇళ్లు లభించక పోలీసు సిబ్బంది నానా పాట్లు పడుతున్నారన్నారు. వారి ఇబ్బందులు తీర్చేందుకు సీఎం సిద్ధరామయ్య పోలీసు గృహ 20-20 పథకాన్ని ప్రవేశపెట్టి 11వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చిందన్నారు. ఇప్పటికే 3వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పోలీసులకు అప్పగించామన్నారు.ఈ యేడాది చివరి నాటికి మరో 5 వేల నిర్మాణాలు పూర్తి చేసేలా సీఎంకు విన్నవిస్తామన్నారు.
ఇటీవల మినీ విధానసౌధ ముట్టడికి వచ్చిన రైతులను చెదరగొట్టారు తప్పితే లాఠీచార్జ్ చేయలేదని స్పష్టం చేశారు. బెంగళూరు నగరంలో 2800 మంది పోలీసు సిబ్బంది నియామకానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కృష్ణరాజపురంలో కూడా పోలీసు సిబ్బందికొరతన నివారిస్తామన్నారు. కృష్ణరాజపురంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.