DK Ravi
-
డీకే రవి భార్యకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్
సాక్షి, బెంగళూరు : ఐదేళ్ల క్రితం అనుమానాస్పద రీతిలో ఆత్మహత్యకు పాల్పడిన యువ ఐఏఎస్ అధికారి డీకే రవి సతీమణి డీకే కుసుమ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సమక్షంలో ఆదివారం పార్టీలో జాయిన్ అయ్యారు. త్వరలో జరుగనున్న రాజమహేశ్వరీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆమెను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిలో బరిలోకి దింపే అవకాశం ఉంది. ఎమ్మెల్యే సీటు హామీ మేరకే కుసుమ పార్టీలో చేరినట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ఆమె పేరును కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు సిఫారసు చేసినట్లు డీకే శివ కుమార్ వెల్లడించారు. ఉన్నత విద్యను అభ్యసించిన యువతిని ఆ స్థానంలో నిలబెట్టాలనే ఉద్దేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనిపై హైకమాండ్ నుంచి తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. (మంత్రి పదవికి బీజేపీ నేత రాజీనామా) కాగా కర్ణాటకకు చెందిన డీకే రవి 2015లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసింది. ఈ సంఘటన అప్పట్లో పెను దుమారాన్నే రేపింది. ప్రభుత్వ ఒత్తిడి మేరకే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారని రవి తల్లిదండ్రులు ఆరోపించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతితో ప్రేమ వ్యవహారం కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) రవిది ఆత్మహత్యగానే నిర్ధారించింది. వ్యక్తిగతమైన కారణాల వల్లనే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు నివేదించింది. తాజాగా అతని భార్య కాంగ్రెస్ పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. కాగా రాజమహేశ్వరీ సిట్టింగ్ ఎమ్మెల్యే మునిరత్నం కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. గతంలోనే జరగాల్సిన ఈ ఎన్నిక కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు అభ్యర్థుల వేటులో నిమగ్నమయ్యారు. బీజేపీ నుంచి మునిరత్నం బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆయనపై బలమైన మహిళా అభ్యర్థిని నిలపాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేసింది. దీనిలో భాగంగానే కుసుమను సంప్రదించింది. -
డీకే రవి మృతిపై సీబీఐకి లేఖ
కృష్ణరాజపురం : దివంగత ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు వేగవంతం చేసి నిజానిజాలు వెలికితీయాలని సీబీఐకి లేఖ రాస్తానని కర్ణాటక హోం శాఖ మంత్రి డాక్టర్.జీ. పరమేశ్వర్ పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది వసతి కోసం కృష్ణరాజపురంలో రూ.69 కోట్లతో చేపట్టిన 360 గృహాల నిర్మాణ పనులకు గురువారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. డీకే రవి ఎలా చనిపోయాడో తేల్చాలని డిమాండ్ చేస్తూ ఆనందరావ్ సర్కిల్లో ధర్నా చేపట్టిన అతని తల్లిదండ్రులను తాను పరామర్శించానని, రవి మృతిపై నిజాన్ని బయట పెట్టాలని వారు కోరారన్నారు. ఈ విషయంపై దర్యాప్తు వేగవంతం చేయాలని తాను సీబీఐకి లేఖ రాస్తానన్నారు. బెంగళూరు నగరంలో ఇళ్లు లభించక పోలీసు సిబ్బంది నానా పాట్లు పడుతున్నారన్నారు. వారి ఇబ్బందులు తీర్చేందుకు సీఎం సిద్ధరామయ్య పోలీసు గృహ 20-20 పథకాన్ని ప్రవేశపెట్టి 11వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చిందన్నారు. ఇప్పటికే 3వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పోలీసులకు అప్పగించామన్నారు.ఈ యేడాది చివరి నాటికి మరో 5 వేల నిర్మాణాలు పూర్తి చేసేలా సీఎంకు విన్నవిస్తామన్నారు. ఇటీవల మినీ విధానసౌధ ముట్టడికి వచ్చిన రైతులను చెదరగొట్టారు తప్పితే లాఠీచార్జ్ చేయలేదని స్పష్టం చేశారు. బెంగళూరు నగరంలో 2800 మంది పోలీసు సిబ్బంది నియామకానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కృష్ణరాజపురంలో కూడా పోలీసు సిబ్బందికొరతన నివారిస్తామన్నారు. కృష్ణరాజపురంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. -
నా కొడుకు అస్థిపంజరంతో ధర్నా చేస్తా
నా కుమారుడి మృతికి వారే కారకులు ! ప్రభుత్వానికి వారం రోజులు గడువు ఇస్తున్నా నివేదిక బయటపెట్టకపోతే కుమారుడి అస్థిపంజరంతో ధర్నా చేస్తా ప్రభుత్వాన్ని హెచ్చరించిన డీకే రవి తల్లి బెంగళూరు(బనశంకరి) : ‘నా కుమారుడు, ఐఏఎస్ అధికారి డీ.కే రవి మృతికి ఆయన భార్య కుసుమ, ఆమె తండ్రి హనుమంతరాయప్ప కారణం’ అని గౌరమ్మ ఆరోపించారు. రవి మృతిపై సీబీఐ నివేదిక బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని ఆనందరావు సర్కిల్ వద్ద బుధవారం ఆమె అహోరాత్రి ధర్నాచేపట్టిన విషయం తెలిసిందే. గురువారం ఆమె ధర్నాలో మాట్లాడుతూ కోలారు కలెక్టర్‌గా డీ.కే రవి విధులు నిర్వర్తిస్తున్నప్పుడే ఆయన భార్య కుసుమతో పాటు తండ్రి హనుమంతరాయప్ప పట్టుబట్టి బెంగళూరుకు బదిలీ చేయించారన్నారు. బదిలీ అయిన కొన్ని రోజులకే డీ.కే రవి అనుమానాస్పద స్థితిలో మరణించారన్నారు. ఆ సమయంలో కుసుమ, హనుమంతరాయప్ప ప్రవర్తన, కుసుమ విదేశాలకు వెళ్లిపోవడం, తర్వాత వారిద్దరూ తమ కుటుంబంతో సరిగా మాట్లాడక పోవడం.. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత డీ.కే రవి మరణం వెనక వారి హస్తం కూడా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ప్రభుత్వం దర్యాప్తు జరిపించి కుసుమ, హనుమంత రాయప్పను జైలులో పెట్టించాలని డిమాండ్ చేశారు. రవి మృతిపై పూర్తి వివరాలను వారం రోజుల్లో బయట పెట్టకపోతే డీకే రవి అస్థిపంజరంతో విధానసౌధ ఎదుట ధర్నా చేస్తానని గౌరమ్మ హెచ్చరించారు. డీకే రవిది ఆత్మహత్య, లేక హత్య అనే విషయంలో తేల్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం ఇంతవరకు తమకు ఎలాంటి సాయమందించలేదని మండిపడ్డారు. ఇదిలా ఉంగా ధర్నా సమయంలో గౌరమ్మ సొమ్మసిల్లిపడిపోయారు. ధర్నాలో పాల్గొన్న రైతుకావలి సమితినేత కరిగౌడ ఆత్మహత్యకు యత్నించి కలకలం రేపారు. డికే.రవి మృతిపై సీబీఐ నివేదికను వెల్లడించాలని డిమాండ్ చేస్తూ ఆయన విషం బాటిల్ ముందు పెట్టుకుని తాగుతానని బెదిరించాడు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఏ మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు: గౌరమ్మ ఆరోపణల పై ప్రతిస్పందించాలని హనుమంతరాయప్పను కోరగా...‘ఎందుకు ఆమె అలా మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ నివేదిక ప్రభుత్వానికి చేరి అందులోని విషయాలు వెళ్లడి అయ్యే వరకూ నేను ఏమీ మాట్లాడను. ఇక ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి పరిహారం అందలేదు.’ అని పేర్కొన్నారు. -
బిడ్డ సంవత్సరీకానికి బొట్టు కూడా లేదు !
⇒ దివంగత ఐఏఎస్ అధికారి డీకే రవి తల్లి కన్నీటి గాథ ⇒నగలు తాకట్టు పెట్టి కుమారుడి సంవత్సరీకం చేస్తున్నాం ⇒{పభుత్వమూ ఆదుకోలేదు ⇒సమాధి వద్ద నుంచి 16న బెంగళూరుకు పాదయాత్ర ⇒డి.కె. రవి తల్లి గౌరమ్మ రవికి అభిమానుల ఘన నివాళి తుమకూరు : దేశం గర్వించదగ్గ కలెక్టర్‌ను అందించిన ఆ కుటుంబం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. సదరు కలెక్టర్ సంవత్సరీకానికి కూడా డబ్బులు లేకపోవడంతో బంగారు ఆభరణాలు బ్యాంకులో కుదవ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరే కారణమని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు... నిజాయితీ కలిగిన కలెక్టర్‌గా పేరు గడించిన డీ.కే రవి గత ఏడాది మార్చి 16న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీ.కే రవి సంవ త్సరికాన్ని ఆదివారం ఆయన స్వగ్రామం దొడ్డకుప్పలు గ్రామంలో కుటుంబ సభ్యులు నిర్వహించారు. డీ.కే రవి సమాధి వద్ద ఆయన తల్లిదండ్రులు గౌరమ్మ, కరిప్పలు సంప్రదాయ పద్దతిలో పూజలు నిర్వహించారు. అనంతరం గౌరమ్మ మీడియాతో మాట్లాడారు. ‘చెట్టంత కొడుకు చనిపోవడంతో మా కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది. సవ ంత్సరీకం నిర్వహించడానికి కూడా డబ్బులు లేవు. దీంతో నా కొడుకు కొనిచ్చిన బంగారు నగను స్థానిక విజయాబ్యాంకులో కుదువ పెట్టి లక్ష రూపాయలు అప్పు తీసుకుని వచ్చా. మా కొడుకు చనిపోయిన తర్వాత ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇంతవరకూ మాకు అందలేదు. అంతేకాకుండా డీ.కే రవి మరణం ఎలా జరిగిందో తేల్చాల్సిన సీబీఐ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కనీసం ఒక్కసారి కూడా మా గ్రామానికి రాలేదు. నా కొడుకు డి.కె.రవి ఎలా మరణించాడో ఇటు సీబీఐకాని, అటు ప్రభుత్వం కానీ ఇప్పటి వ రకు ప్రకటించలేదు. ఈనెల 16న తన కుమారుడి సమాధి వద్ద నుంచి బెంగళూరుకి పాదయాత్ర చేస్తాను. అదే రోజు విధానసౌధలోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని న్యాయం జరిగే వరకూ ధర్నా చేస్తాను.’ అని గౌరమ్మ తెలిపారు. ఇదిలా ఉండగా రవి సంవత్సరికంలో తల్లి గౌరమ్మతో పాటు తండ్రి కరియప్ప, అన్న రమేష్, బంధువులు పాల్గొన్నారు. అంతేకాకుండా వివిధ ప్రాంతాల నుంచి సుమారు 15 వందల మందికిపైగా రవి అభిమానులు ఆదివారం ఆయన సమాధి వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. అనంతరం బెంగళూరులోని కెంపెగౌడ వైద్యాలయం ట్రస్టు, మిలీనియం రక్తనిధి, డీకే రవి సేనే ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా పెద్ద సంఖ్యలో యువత రక్తదానం చేశారు. ఇదిలా డికే రవి సమాధి వద్ద అతని తల్లి విలపించడం స్థానికులను కన్నీళ్లు పెట్టించింది. రవి సంవత్సరిక కార్యక్రమంలో ఆయన భార్య కుసుమ, మామ హనుంతరాయప్ప పాల్గొనకపోవడం గమనార్హం. -
ఆ ఐఏఎస్ అధికారిది ఆత్మహత్యే!
కర్ణాటక వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తూ అనుమానాస్పద పరిస్థితిలో మరణించిన ఐఏఎస్ అధికారి డీకే రవిది ఆత్మహత్యేనని సీబీఐ తేల్చింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రవి బాగా నష్టపోయారని సీబీఐ తన నివేదికలో తెలిపింది. చిక్‌బళ్లాపూర్ ప్రాంతంలో 50 ఎకరాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు కూడబెట్టారని, అందులో తీవ్రంగా నష్టం రావడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పింది. అత్యంత అనుమానాస్పద పరిస్థితుల్లో ఈ ఏడాది మార్చిలో ఐఏఎస్ అధికారి డీకే రవి మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంలో ఎలాంటి కుట్రకోణం లేదని సీబీఐ తేల్చిచెప్పింది. రవి చిట్టచివరిసారిగా పనిచేసిన వాణిజ్య పన్నుల శాఖ నుంచి సర్వీసు ఫైళ్లు సేకరించిన సీబీఐ.. ఈ వ్యవహారంపై ఎట్టకేలకు తన తుది నివేదికను వెలువరించింది. -
'ఐఏఎస్ మృతి కేసును మేం విచారించలేం'
ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును తాము స్వీకరించలేమని సీబీఐ.. కర్ణాటక ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దర్యాప్తు విషయంలో సిద్ధరామయ్య సర్కారు ఆంక్షలు విధించడమే ఇందుకు కారణమని తెలిసింది. రవి ఎందుకు మరణించారు, ఎలా మరణించారు అనే విషయాల్ని ఫలానా కోణంలో మాత్రమే దర్యాప్తు చేయడంతోపాటు మూడు నెలలలోగా చార్జిషీటు సిద్ధం చేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించిన దరిమిలా ఇలాంటి కండిషన్ల మధ్య కేసును స్వీకరించలేమని సీబీఐ వర్గాలు తెలిపాయి. కాగా, కర్ణాటక సీఐడీ పోలీసులు పర్యవేక్షిస్తోన్న ఈ కేసు దర్యాప్తును స్వీకరించాలని సీబీఐకి మరోసారి నోటిఫికేషన్ పంపుతామని సీఎం సిద్ధరామయ్య అన్నారు. కొత్త నోటిషికేషన్ అందిన తర్వాత, దానిని పరిశీలించిన మీదట తుది నిర్ణయం తీసుకుంటామని దర్యాప్తు సంస్థ ప్రతినిధులు తెలిపారు. మార్చి 17న తన అధికార నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన ఐఏఎస్ అధికారి రవి.. కోలార్ జిల్లాలోని ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపారు. దీంతో ఆయన బెదిరింపులతోపాటు రాజకీయ ఒత్తిళ్లను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదే ఆయన మరణానికి ప్రధాన కారణమని కుటుంబ సభ్యులతోపాటు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం మరో ఐఏఎస్ అధికారిణితో ప్రేమ వ్యవహారమే రవి మృతికి కారణమని పేర్కొనడం గమనార్హం. -
44 కాదు.. మూడుసార్లే ఫోన్ చేశాడు!
ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది. విచారణ కేవలం ప్రేమ కోణంలోనే జరుపుతుండటాన్ని ఆక్షేపిస్తూ రవి బ్యాచ్‌మేట్.. ఐఏఎస్ అధికారిణి రోహిణి బెంగళూరు హైకోర్టును ఆశ్రయించారు. గురువారం జరిగిన విచారణలో రోహిణి తరఫు న్యాయవాది మాట్లాడుతూ మరణానికి ముందు రవి.. 44 సార్లు ఫోన్ చేసినట్లు సీఎం సిద్ధరామయ్య పేర్కొనడం అభ్యంతరకరమన్నారు. 44 సార్లుకాదు.. కేవలం మూడుసార్లు మాత్రమే రవి ఫోన్ చేశాడని, ఆ సమయంలో రోహిణి వెంట ఆమె భర్త శ్రీధర్ రెడ్డి కూడా ఉన్నారని కోర్టుకు తెలిపారు. కేసు దర్యాప్తుపై కర్ణాటక అసెంబ్లీలో సోమవారం సీఎం సిద్ధరామయ్య ప్రకటన చేయనున్న నేపథ్యంలో ఆ ప్రకటన వెలువడకుండా చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు. వాదనల అనంతరం విచారణ ఏప్రిల్ 6కు వాయిదాపడింది. కాగా, రవి మృతిపై విచారణను పక్కదోవ పట్టిస్తున్నారంటూ మాజీ సీఎం, జేడీ(ఎస్) నేత కుమారస్వామి గౌడ ఆగ్రహం వ్యక్తంచేశారు. మృతిచెందిన అధికారి 44 సార్లు ఫోన్ చేశాడని చెప్పిన సీఎం.. దానిని నిరూపిస్తేగనుక తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. కేసు విచారణ సీబీఐ చేతికి వెళ్లకముందే సాధ్యమైనంత గందరగోళం సృష్టించేందుకు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతున్నదని విమర్శించారు. -
నిరూపిస్తే రాజకీయ సన్యాసం
మహిళా ఐఏఎస్ అధికారికి డి.కె.రవి 44సార్లు ఫోన్ చేశారన్న సీఎం వ్యాఖ్యలపై కుమారస్వామి సవాల్ బెంగళూరు:డి.కె.రవి అనుమానాస్పద మృతికి సంబంధించి ప్రజల మనసుల్లో విష బీజాలు నాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి విమర్శించారు. సోమవారమిక్కడ తన ను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ....‘ముఖ్యమం త్రి సిద్ధరామయ్య ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐఏఎస్ అధికారి డి.కె.రవి చనిపోవడానికి ముందు ఓ గంట వ్యవధిలో ఓ మహిళా ఐఏఎస్ అధికారికి 44 సార్లు ఫోన్ చేశారని చెప్పారు. తద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపించారు. డి.కె.రవి అన్ని సార్లు మహిళా ఐఏఎస్ అధికారికి ఫోన్ చేశారని సిద్ధరామయ్య కనుక నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచే తప్పుకుంటాను. ఒకవేళ సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలను నిరూపించలేక పోతే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారా?’ అని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వ సీబీఐ విచారణకు ఆదేశించింది వారి హైకమాండ్ ఆదేశాల ప్రకారమే కానీ, ప్రజల మనోభావాలను గౌరవించి కాదని విమర్శించారు. -
ఐఏఎస్ రవి లవ్ ఫెయిల్యూర్‌తో చనిపోయారా..?
బెంగళూరు: అనుమానస్పద స్థితిలో మృతి చెందిన కర్ణాటక ఐఏఎస్ అధికారి డీకే రవి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయన ప్రేమలో విఫలం అవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల తాజా కథనాలు పేర్కొంటున్నాయి. ఆరోజు ఆయన తన ఐఏఎస్ బ్యాచ్ మేట్ అధికారిణికి 44సార్లు ఫోన్ చేశారని వారు చెప్తున్నారు. ఈ నెల 16న డీకే రవి తన ఫ్లాట్‌లో అనుమానాస్పంద స్థితిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర ప్రజాగ్రహ్రం పెల్లుబకడంతో ఈ కేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించగా అది మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక వచ్చిన అనంతరమే పోలీసులు తాజాగా ఈ కథనాలు బయటపెట్టడంతో కేసు పలుమలుపులకు దారితీస్తోంది. మరోపక్క ఈ నివేదికపై సోమవారం చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా కోర్టు నిరాకరించింది. అయితే, ఈ క్రమంలో క్రిమినల్ కేసుల నివేధికను చట్టసభల్లో ప్రవేశపెట్టకూడదని పలువురు వాధిస్తుండగా రవి బ్యాచ్ మేట్ అయిన ఓ మహిళా ఐఏఎస్ అధికారిణి భర్త ఈ నివేదికపై అసెంబ్లీలో చర్చించడాన్ని నిలువరించాలని హైకోర్టుకు వెళ్లారు. ఆ పిటిషన్‌తో ఏకీభవించిన కోర్టు ఆ నివేదికను చట్టసభలో ప్రవేశపెట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. విచారణ మధ్యలో ఉండగా వివరాలు బయటపెట్టొద్దని కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతోపాటు కేసు విచారణ వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది. అప్పటి వరకు ఈ కేసు వివరాలను మధ్యాంతరంగా బయటపెట్టొద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, దర్యాప్తు అధికారికి, పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశించింది. సీఐడీ నివేదిక వచ్చిన తర్వాతే రవి తన బ్యాచ్ మేట్ అయిన ఓ ఐఏఎస్ అధికారిణితో ప్రేమలో విఫలం అయ్యాడని, మానసిక క్షోభతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్తుండటంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ పలువురిలో నెలకొంది. -
28న కర్ణాటక బంద్
పిలుపునిచ్చిన కర్ణాటక ప్రజాసంఘాలు డి.కె.రవి మృతి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ బెంగళూరు:ఐఏఎస్ అధికారి డి.కె.రవి ృుతిపై సీబీఐతో విచారణ జరిపించాలనే డిమాండ్‌తో ఈనెల 28న కర్ణాటక బంద్‌కు రాష్ట్రానికి చెందిన వివిధ ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. శుక్రవారమిక్కడి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కన్నడ చళువళి వాటాల్ పార్టీ వ్యవస్థాపకులు వాటాల్ నాగరాజ్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిజాయితీ గల అధికారిగా ప్రజల ప్రశంసలు అందుకున్న డి.కె.రవి ృుతిపై ప్రజల్లో అనేక అనుమానాలున్నాయని అన్నారు. అందుకే ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలనే డిమాండ్‌తో ఈనెల 28న బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. బంద్‌తో పాటు అదే రోజున నగరంలో మౌన ర్యాలీని సైతం ప్రజా సంఘాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ బంద్‌ను తాము రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేదంటే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగానో ఈ బంద్‌ను పాటించడం లేదని స్పష్టం చేశారు. నిబద్ధత కలిగిన ఓ అధికారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన మరణానికి సంబంధించిన నిజానిజాలు బయటకు రావాలనే ఉద్దేశంతోనే సీబీఐ దర్యాప్తును డిమాండ్ చేస్తూ బంద్‌ను పాటిస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 28 లోపు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తే బంద్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటామని ప్రకటించారు. -
కలెక్టర్ డి.కె.రవి
నాటకంతో ఆకట్టుకుంటున్న విద్యార్థులు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ {పజల్లో చైతన్యం తీసుకువస్తున్న వైనం ఆకట్టుకున్న రవి పాత్రధారి సౌందర్య కోలారు:విధుల నిర్వహణలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన కోలారు జిల్లా మాజీ కలెక్టర్ డి.కె.రవి జీవన విధానంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాలకు విద్యార్థులు శ్రీకారం చుట్టారు. అదే సమయంలో రవి మృతి కేసు దర్యాప్తును సీబీఐకి అ ప్పగించాలన్న నినాదాన్ని కూడా వినిపిస్తున్నారు. శుక్రవారం కోలారు జిల్లా కలెక్టరేట్ వద్ద చింతామణికి చెందిన పట్టు వ్యవసాయ విద్యార్థులు ప్రదర్శిం చిన ‘కలెక్టర్ డి.కె.రవి’ అనే వీధి నాటకం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. నాటకం పూర్తి అయ్యే వర కూ అక్కడి నుంచి ఏ ఒక్కరూ పక్కకు కూడా వెళ్లలేకపోయారు. రవి బాల్యం మొదలు ఐఏఎస్ అధికారి అయ్యే వరకూ, అనంతరం ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలను విద్యార్థులు కళ్లకు కట్టారు. ఓ పేదవాడు చదువుకునేందుకు పడుతున్న తపన చూపరులను కంటతడి పెట్టించింది. అవినీతి పరుల కుట్రలకు రవి ఎలా బలయ్యాడన్న అంశాన్ని విద్యార్థులు ప్రదర్శించేటప్పుడు చూపరుల శరీరం రోమాంచితమైంది. నాటకంలో రవి పాత్రను సౌందర్య, తల్లి పాత్రను లావణ్య, అవినీతి భూతం పాత్రను నాగవేణి పోషించారు. అనంతరం రవి మృతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. -
'డీకే రవి' టైటిల్ కోసం పోటాపోటీ
బెంగళూరు: నైతిక విలువలు పతనమవుతున్న సమాజంలో నీతి నిజాయితీలకు కట్టుబడి సమాజ సేవయే పరమార్థంగా, జీవన సాఫల్యంగా భావించే ప్రభుత్వాధికారులు చాలా అరుదు. ఆ కోవకు చెందిన ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద పరిస్థితుల్లో అర్ధాంతరంగా అశువులు బాసిన విషయం తెల్సిందే. ఇప్పుడు ప్రజల కోసం పాటుపడిన ఆయన పోరాటాన్ని, సాధించిన విజయాలను, ఆయన ఎదుర్కొన్న సామాజిక పరిస్థితులను, మొత్తంగా ఆయన జీవిత నేపథ్యాన్నే ఇతి వృత్తంగా తీసుకొని చిలనచిత్రాన్ని నిర్మించేందుకు కన్నడ సినీ నిర్మాతలు పోటీ పడుతున్నారు. 'డీకే రవి' టైటిల్‌ను రిజిస్టర్ చేయించుకునేందుకు పలువురు కన్నడ సినీ నిర్మాతలు ఇప్పటికే కన్నడ చలనచిత్ర వాణిజ్య మండలి (కేఎఫ్సీసీ)ని ఆశ్రయించారు. వారిలో అనాజి నాగరాజ్, దినేష్ గాంధీ, శంకర్ గౌడ తదిదరులు ఉన్నారు. ఇప్పుడే ఆయన పేరిట సినిమా టైటిల్‌ను రిజిస్టర్ చేయడమంటే తొందరపాటు అవుతుందనే ఉద్దేశంతో ఆ నిర్మాతల దరఖాస్తులను తిరస్కరించినట్టు కేఎఫ్సీసీ కార్యదర్శి బామా హరీష్ తెలియజేశారు. పైగా ఇలాంటి దరఖాస్తులు చేసుకునేమందు రవి కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరని ఆయన చెప్పారు. వారు అనుమతించినప్పుడు ఈ అంశాన్ని మళ్లీ పరిశీలించవచ్చని తెలిపారు. సమాజంతో పేరున్న వ్యక్తుల పేరిట టైటిల్ రిజిస్టర్ చేయకూడదనేది కేఎఫ్సీసీ నిబంధనల్లో ఉంది. అయితే ఈ నిబంధనలను నిర్మాతలు, దర్శకులు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. టైటిలే అభ్యంతరమైనప్పుడు మరో టైటిల్‌తో సినిమా తీసేందుకు తమకు అభ్యంతరం లేదని కొంతమంది నిర్మాతలు చెబుతున్నారు. -
అట్టుడుకుతున్న కర్ణాటక!
బెంగళూరు/న్యూఢిల్లీ : యువ ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద మృతిపై కర్ణాటక వ్యాప్తంగా నిరసన సెగలు చెలరేగుతున్నాయి. ఈ కేసు దర్యాప్తును కర్ణాటక ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. సీఐడీ విచారణతో వాస్తవాలు బయటకు వస్తాయన్న నమ్మకం తమకు లేదని, అందువల్ల విచారణను సీబీఐకి అప్పగించాలని విపక్షాలతో పాటు డీకే రవి తల్లిదండ్రులు, రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్‌తో విపక్షాలు కర్ణాటక ఉభయసభల్లో గురువారం నిరసనకు దిగాయి. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని సీబీఐ దర్యాప్తునకు అంగీకరించే వరకు పట్టు వీడబోమని భీష్మించాయి. దీంతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. బీజేపీ, జేడీఎస్ సభ్యులు విధానసౌధ నుంచి రాజ్‌భవన్ వరకు పాదయాత్ర నిర్వహించారు. గవర్నర్ వాజుభాయ్ రుడాభాయ్ వాలాతో సమావేశమయ్యారు. ఈ కేసును సీబీఐకి అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. విధానసౌధలో ఈ రో్జు నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఇద్దరు మంత్రులు మినహా మిగిలిన అందరూ ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సూచించారు. కాగా, డీకే రవి తల్లిదండ్రులు, బంధువుల నుంచి వివరాలు తెలుసుకునేందుకు ఆయన స్వగ్రామం తుమకూరు జిల్లా కునిగళ్ దొడ్డకుప్పలుకు వెళ్లిన సీఐడీ పోలీసులకు తీవ్ర నిరసన ఎదురైంది. సీఐడీ విచారణపై నమ్మకం లేనందున సీబీఐ అధికారులకు తప్పితే ఎవరికీ ఎలాంటి వివరాలు వెల్లడించబోమని రవి కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మొండిపట్టు వీడటం లేదు. మంత్రి మండలి సమావేశం తర్వాత రాష్ట్ర హోంశాఖ మంత్రి కేజే జార్జ్ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లోనూ సీబీఐకి అప్పగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా, లోక్‌సభలో ఈ రోజు సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమాధానమిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే ఈ కేసును సీబీఐకి తాము సిద్ధంగానే ఉన్నట్లు తెలిపారు. డి.కె.రవి మృతికి సంబంధించిన కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీలు గురువారం సైతం తమ నిరసనను కొనసాగించారు. బీజేపీ ఎంపీ ప్రహ్లాద్‌జోషి లోక్‌సభలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. నిజాయితీ గల అధికారిగా ప్రజల మన్ననలు అందుకున్న రవి ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదని ప్రహ్లాద్‌జోషి తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించిందని, అయితే సీఐడీ విచారణపై రవి తల్లిదండ్రులతో పాటు రాష్ట్ర ప్రజలందరిలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు. అందుకే ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకొని ఈ కేసును సీబీఐకి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ సమాధానమిస్తూ 'రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు మేం సిద్ధంగానే ఉన్నాం' అని చెప్పారు. -
మరో అధికారి బలిదానం
సంపాదకీయం తమలో ఉన్న నిజాయితీ, ముక్కుసూటిదనమూ, సవాళ్లను ఎదుర్కోగల సామర్థ్యమూ ఈ వ్యవస్థ ప్రక్షాళనకు తోడ్పడగలవని త్రికరణశుద్ధిగా నమ్మి సివిల్ సర్వీసును ఎంచుకునే యువతను దిగ్భ్రాంతి పరిచే ఉదంతమిది. కర్ణాటక రాష్ట్రంలో 36 ఏళ్ల ఐఏఎస్ అధికారి డీకే రవి ఆదివారం అనుమానాస్పదస్థితిలో మరణించారు. ఆయన కేవలం ఆరేళ్ల సర్వీసును మాత్రమే పూర్తి చేసుకున్న యువ అధికారి. ఇది ఆత్మహత్యేనని, కుటుంబ సమస్యలే అందుకు కారణమని వెనువెంటనే పోలీసులు ప్రకటించగా, దానికి అనుగుణంగా చట్టసభలో ప్రభుత్వం ప్రకటన వెలువడింది. ఇంత హడావుడి ప్రకటనలే ఈ మరణాన్ని మరింత మిస్టరీగా మార్చాయి. ప్రజలను ఆగ్రహోదగ్రులను చేశాయి. ఆయన పనిచేసి వచ్చిన కోలార్ ప్రాంతంలోనూ, ఆయన స్వస్థలంలోనూ ప్రజలు ఆందోళనకు దిగారు. రవి ఎంతో నిజాయితీగల అధికారని... ప్రభుత్వానికి ఏటా రావలసిన వందల కోట్ల రూపాయల ఆదాయానికి గండికొట్టడమేకాక, పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఇసుక మాఫియాపై చర్యలు తీసుకుని వారి ఆగ్రహానికి గురయ్యాడని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నిజాయితీ ఆయనకు అయిదు నెలల క్రితమే బదిలీని బహుమతిగా ఇచ్చింది. గత అక్టోబర్‌లో కోలార్ నుంచి ఆయన బెంగళూరు మారాల్సివచ్చింది. ఈసారి ఆయనకు వాణిజ్య పన్నుల విభాగం బాధ్యతలు అప్పగించారు. అక్కడ సైతం ఆయన తనదైన ముద్రవేశారు. ప్రభుత్వానికి పన్నుల రూపేణా రావలసిన కోట్లాది రూపాయలను ఎగేస్తున్న బడా బాబులపై ఒత్తిళ్లు తెచ్చారు. ముఖ్యంగా బిల్డర్లపై కఠిన చర్యలకు సమాయత్తమయ్యారు. వారి నుంచి స్వల్పవ్యవధిలో వంద కోట్ల రూపాయలకుపైగా సొమ్ము వసూలు చేశారు. ఇలాంటి చర్యలన్నీ సామాన్య పౌరుల్లో ఆయనను హీరోను చేయడమే కాదు... చట్టబద్ధ పాలనపై విశ్వాసాన్ని పెంచాయి. చట్టాన్ని ధిక్కరించే వారు పర్యవసానాలను అనుభవించక తప్పదన్న సందేశాన్ని పంపాయి. మరో పక్క నిజాయితీగల అధికారికి అండగా నిలబడలేని పాలనా యంత్రాంగం అశక్తత ఆ అధికారిని ప్రమాదంలోకి నెట్టింది. నీతి నిజాయితీగల అధికారులు అడుగడుగునా గండాలను ఎదుర్కోవాల్సి రావడం ఈ దేశంలో కొత్తేమీ కాదు. పదేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఎస్. మంజునాథ్‌ను దుండగులు కాల్చి చంపారు. పెట్రోల్, డీజిల్ కల్తీ చేస్తున్న మాఫియాపై చర్యలు తీసుకోవడమే ఆయన చేసిన నేరం. సుదీర్ఘకాలం నడిచిన ఆ కేసులో ఆరుగురు నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ వారం క్రితమే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇంతలోనే యువ ఐఏఎస్ అధికారి రవి ప్రాణాలు కోల్పోవాల్సివచ్చింది. మంజునాథ్కన్నా ముందు 2003లో సత్యేంద్ర దూబే అనే మరో యువ ఇంజనీరింగ్ అధికారి స్వర్ణ చతుర్భుజి నిర్మాణంలో చోటు చేసుకుంటున్న అక్రమాల గురించి ఆనాటి ప్రధాని వాజపేయికి లేఖ రాసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. దేశంలో పేరు ప్రఖ్యాతులున్న ఒక నిర్మాణ రంగ సంస్థ ఈ రహదార్ల నిర్మాణం కోసం తనకొచ్చిన కాంట్రాక్టును మాఫియాల కనుసన్నల్లో నడిచే కొన్ని సంస్థలకు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చిందని, ఇందువల్ల నిర్మాణం పనులు నాసిరకంగా ఉంటున్నాయని సోదాహరణంగా వివరించాడు. కోట్లాది రూపాయలు చేతులు మారుతున్న వైనాన్ని విశదీకరించాడు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఉన్నతాధికార గణం ఈ అవినీతిలో పాలు పంచుకుంటున్నది గనుక నేరుగా లేఖ రాయవలసివస్తున్నదని కూడా చెప్పాడు. తన వివరాలు బయటపెట్టకుండా దర్యాప్తు చేయించమని కోరాడు. ఏదీ చక్కబడలేదు కానీ... రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి ఆయనకు చీవాట్లొచ్చాయి. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే దుండగులు ఆయనను కాల్చిచంపారు. ఆ సమయానికి ఆ యువ అధికారి వయసు 31 ఏళ్లు. ఏడేళ్ల విచారణ అనంతరం 2010లో ముగ్గురు దుండగులకు న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధిస్తే దానిపై అప్పీల్ ఇంకా పెండింగ్‌లో ఉంది. ఇటీవలి కాలంలో హర్యానా ఐఏఎస్ అధికారి ఖేమ్కా, యూపీ ఐఏఎస్ అధికారిణి దుర్గాశక్తి నాగ్‌పాల్ నిజాయితీగా పని చేసినందుకు, ఉన్నత స్థాయి వ్యక్తుల బండారం బయటపెట్టినందుకు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ప్రజలంతా గమనించారు. తమ మాట శాసనం కావాలని, తమ చర్య నిరాటంకంగా సాగిపోవాలని వాంఛించే ఫ్యూడల్ భావజాలం ఉన్న పాలకులకు నీతినిజాయితీలతో పనిచేసే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కంటగింపవుతున్నారు. అయిదేళ్లు పాలించమని జనం అధికారమిస్తే మధ్యలో ఈ అధికార్ల ‘న్యూసెన్స్’ ఏమిటని పాలకులకు ఆగ్రహం కలుగుతున్నది. నిర్మాణరంగం, మైనింగ్, మద్యం, విద్య వంటి రంగాలు మాఫియాల అడ్డాగా మారుతున్నాయి. ప్రభుత్వాలనే శాసిస్తున్నాయి. దేశంలో అనూహ్యంగా విస్తరిస్తున్న నిర్మాణరంగం వల్ల ఇసుకకు నానాటికీ డిమాండు పెరుగుతోంది. ఏటా కోట్ల సంఖ్యలో ఇళ్లు, భవనాలు నిర్మిస్తున్న కారణంగా ఇసుకలో బంగారం పండుతోంది. పరిమితులకు మించి ఇసుక తవ్వడం ప్రమాదకరమని, అందువల్ల ఎన్నో విపత్తులకు ఆస్కారం ఉంటుందని పర్యావరణ వేత్తలు ఏనాటి నుంచో మొత్తుకుంటున్నారు. దానిపై ఒక సమగ్రమైన విధానం రూపొందించమని సుప్రీంకోర్టు ఈమధ్యే సూచించింది. అయినా ప్రభుత్వాలు మేల్కొనడం లేదు. రవి కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆయన ఆత్మహత్య చేసుకునేంత దుర్బలుడు కాడంటున్నారు. రవి ఎదుర్కొన్న బెదిరింపులు, ఒత్తిళ్ల నేపథ్యం వల్ల ఆయన మరణం చుట్టూ ఇప్పుడు ఎన్నో అనుమానాలు ముసురుకున్నాయి. కనుక ఈ విషయంలో ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నట్టు సీబీఐ దర్యాప్తు జరిపించడమే శ్రేయస్కరమని కర్ణాటక ప్రభుత్వం గుర్తించాలి. అంతకన్నా ముందు నిజాయితీగా పనిచేసే అధికారులకు రక్షణ కవచంగా ఉండాలని తెలుసుకోవాలి. -
యువ ఐఏఎస్ అనుమానాస్పద మృతి
-
యువ ఐఏఎస్ మరణంతో.. ఆందోళనలు
కోలార్: విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించి అక్రమార్కులపై కొరడా ఝుళిపించిన కర్ణాటకకు చెందిన ఐఏఎస్ అధికారి డీకే రవి మరణంపట్ల అక్కడి ప్రజలు ఆందోళనలు లేవనెత్తారు. ఆయన అనుమానాస్పద మృతి వెనుక పెద్ద కారణం ఉండి ఉంటుందని, స్వతంత్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ వీధుల్లో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. బంద్‌ను కూడా నిర్వహించారు. పాఠశాలలకు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించారు. ఇసుక మాఫియా, రియల్ ఎస్టేట్, ట్యాక్స్ అక్రమార్కుల విషయంలో ఏమాత్రం రాజీపడకుండా దర్యాప్తును ముందుకు తీసుకు వెళ్లారు. వివిధ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఆయన ప్రస్తుతం ట్యాక్స్ అధికారిగా పనిచేస్తుండగా ఇటీవల బెదిరింపు ఫోన్లు ఎక్కువవుతున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఆయన మరణం అనంతరం పెద్ద సంఖ్యలో గుమిగూడిన పౌరులు రవికి ఘన నివాళి అర్పించారు. స్థానిక ఎమ్మెల్యే కోలార్ వార్దుర్ ప్రకాశ్ ఇంటిపై రాళ్లు రువ్వారు. రహదారిపై టైర్లు తగులబెట్టారు. పోలీసులు ఈ కేసులో అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. -
యువ ఐఏఎస్ అనుమానాస్పద మృతి
* అసాంఘిక శక్తుల పీచమణిచిన ధీరశాలి *రియల్ ఎస్టేట్ మాఫియా నుంచి ముప్పు * హత్య గావించి ఆత్మహత్యగా చిత్రీకరించారన్న అనుమానాలు సాక్షి, బెంగళూరు/కోలారు: నిజాయితీ గల ఐఏఎస్ అధికారిగా ప్రజల మన్ననలను అందుకున్న యువ ఐఏఎస్ అధికారి డి.కె.రవి(36) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ ఎంఎన్ రెడ్డి అధికారికంగా ధ్రువీకరించారు. బెంగళూరులోని తావరెకెరెలో తన భార్య కుటుంబసభ్యులు నివాసముంటున్న ప్రాంతానికి సమీపంలోనే ఓ అపార్టమెంట్లో ఆయన ఉంటున్నారు. సోమవారం ఉదయం నుంచి ఆయన భార్య కుసుమ ఫోన్ చేస్తున్నా ఎలాంటి స్పందన లేదు. దీంతో సాయంత్రం ఆమె ఇంటికి చేరుకుని తన వద్ద ఉన్న మారు తాళంతో తలుపు తీసుకుని లోపలకు వెళ్లారు. ఆ సమయంలో ఉరివేసుకున్న స్థితిలో ఉన్న ఆయన శరీరాన్ని గుర్తించి, ఆమె తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, కోలారు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో అక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తనదైన ముద్ర వేయడంతో పాటు కోలారులో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపారు. కోలారు ప్రజలకు ఏ సమస్య వచ్చినా అత్యంత వేగంగా స్పందించే అధికారిగా డి.కె.రవికు మంచి పేరు ఉంది. కోలారులోని అనేక చెరువులను పునరుజ్జీవనం చేసి అక్కడి ప్రజలకు నీటిని అందించేందుకు తనవంతు కృషి చేశారు. అంతేకాదు రెవెన్యూ అదాలత్, పోడి అదాలత్ వంటి కార్యక్రమాలతో రైతుల మనసుల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక తాను ఒక ఐఏఎస్ అధికారి అనే భేషజాన్ని ఏ రోజూ దరికి రానివ్వని డి.కె.రవి కోలారులోని విద్యార్థులకు సైతం అతిథి ఉపన్యాసకుడిగా మారి పాఠాలు చెప్పేవారు. అదే సందర్భంలో కోలారులోని ఇసుక మాఫియాపై డి.కె.రవి ఉక్కుపాదం మోపడంతో అతన్ని అక్కడి నుంచి బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిళ్లు పెరిగాయి. డి.కె.రవిని కోలారు నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలీ చేయకూడదంటూ ఆ జిల్లా ప్రజలు బంద్‌ని పాటించారంటే అక్కడి ప్రజల మనసుల్లో ఆయన ఎంతటి సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ప్రజల మనోభావాలకు ఏమాత్రం విలువనివ్వని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిళ్లకు తలొగ్గి ఆయన్ను వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‌గా బదిలీ చేస్తూ బెంగళూరుకు పంపించింది. వాణిజ్య పన్నుల శాఖకు బదిలీ అయిన తర్వాత కూడా నగరంలోని అనేక రియల్ ఎస్టేట్ ఇతర సంస్థల నుంచి పన్నులను రాబట్టడంలో తనదైన ముద్ర కనబరిచారు. దీంతో ఆయనకు రియల్ ఎస్టేట్ మాఫియా నుంచి సైతం బెదిరింపులు ఎదురయ్యాయి. తనకు ఇసుక మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా నుంచి సైతం ప్రమాదం పొంచి ఉందని డి.కె.రవి అనేక సందర్భాల్లో తన సంబంధీకుల వద్ద, ఇతర అధికారుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అతన్ని హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారన్న అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబం నుంచి... కర్ణాటకలోని తుమకూరు జిల్లా కునిగల్‌కు చెందిన డీ.కే రవి మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగారు. 1979 జనవరి 10న జన్మించిన రవి 2009 ఐఏఎస్ బ్యాచ్ అధికారిగా ఎంపికయ్యారు. ఐఏఎస్ అయ్యే క్రమంలో అనేక కష్టాలను డి.కె.రవి ఎదుర్కొన్నారని స్థానికులు చెబుతుంటారు. కాగా, బెంగళూరుకు చెందిన కుసుమను డి.కె.రవి మూడేళ్ల ముందు పెళ్లి చేసుకున్నారు. నేడు కోలారు బంద్ తమ అభిమాన అధికారి అకాలమృతి కోలారు జిల్లా వాసులను తీవ్రంగా కలిచి వేసింది. ఆయన మృతికి సంతాపంగా మంగళవారం కోలారు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. -
కర్ణాటకలో ఐఏఎస్ అధికారి ఆత్మహత్య
బెంగళూరు: కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపిన ఐఏఎస్ అధికారి డీకే రవి(35) సోమవారం తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని మరణించారు. వాణిజ్య పన్నుల(ఎన్ఫోర్స్మెంట్) విభాగంలో ఈయన అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఉదయం కార్యాలయం నుంచి ఇంటికి తిరిగి వచ్చి ప్రాణాలు తీసుకున్నారని, ప్రాథమికంగా దీన్ని ఆత్మహత్యగానే పరిగణిస్తున్నట్లు పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి తెలిపారు. రవి ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదన్నారు. కర్ణాటక కేడర్ 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయినా రవి.. కోలార్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకొని ప్రజల మన్నలు పొందారు. గత అక్టోబర్‌లోనే వాణిజ్య పన్నుల శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. -
సారూ.. గుక్కెడు నీళ్లివ్వండి
= గోడు వెళ్లబోసుకున్న జనం = తూతూ మంత్రంగా సాగిన కరవు బృందం పర్యటన కోలారు, న్యూస్‌లైన్ :గంపెడాశలు పెట్టుకున్న జనాన్ని కరువు బృందం పర్యటన నిరాశ పరిచింది. కోలారు జిల్లాలోని ముళబాగిలు, బంగారుపేట, శ్రీనివాసపురం తాలూకాలను కరువు ప్రాంతాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సోమవారం కేంద్ర అధ్యయన బృందం ఈ ప్రాంతాల్లో పర్యటించింది. ఉదయం 9 గంటలకు కోలారు చేరుకున్న కేంద్ర బృందానికి జిల్లా కలెక్టర్ డీకే రవి తన కార్యాలయంలో కరువు పరిస్థితుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం బంగారుపేటకు చేరుకున్న అధ్యయన బృందం పట్టణంలోని గంగమ్మన పాళ్య కాలనీకి వెళ్లి పరిశీలించారు. కాలనీ వాసులు ఖాళీ బిందెలతో స్వాగతం పలికారు. ఏడాది కాలంగా తమ వార్డులో నీరు లేదని. ట్యాంకర్ల కోసమే వేచి ఉండాల్సి వస్తోందని తెలిపారు. బంగారుపేట ఎమ్మెల్యే నారాయణస్వామి కేంద్ర బృందానికి నీటి ఎద్దడి గురించి వివరించారు. తాలూకాలో సకాలంలో వానలు రాకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. అనంతరం తాలూకాలోని బడమాకన హళ్లి గ్రామంలో కూడా మహిళలు ఖాళీ బిందెలతోనే కేంద్ర బృందానికి స్వాగతం పలికారు. గ్రామంలో మూడేళ్లుగా నీరు సక్రమంగా రావడంలేదని, మూడు వేల జనాభా ఉన్న గ్రామంలో తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రంతా బిందె నీటి కోసం వేచి ఉండాల్సి వస్తోందని వాపోయారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షురాలు మంజుల వారికి పరిస్థితిని వివరించారు. అనంతరం టి గొల్లహళ్లి చెరువును పరిశీలించారు. అక్కడి నుంచి ముళబాగిలు తాలూకాలోని నత్త, బల్ల, కాశీపుర గ్రామాలలో పర్యటించారు. తాలూకాలోని ఊరుకుంట మిట్టూరు వద్ద వాటర్ రీచార్జి ప్లాంటును పరిశీలించారు. తాగునీటికే ప్రాధాన్యం కరువు పరిస్థితులను అధ్యయనం చేయడానికి వచ్చిన కేంద్ర బృందం రైతుల పంట నష్టం తదితర అంశాలపై కాకుండా తాగునీటి సమస్యపైనే దృష్టి కేంద్రీకరించింది. ఆయా గ్రామాలలో మహిళల నుంచి తాగునీటి సమస్య గురించి విన్నారే కాని పంట పొలాలను పరిశీలించలేదు. రైతులను ప్రశ్నించలేదు. వారి కష్టాలను అడిగి తెలుసుకోలేదు. కేంద్ర బృందం పరిశీలించాల్సిన జాబితాలో ఐపల్లి చెరువు ఉన్నా.. కేవలం కారులో నుంచే చెరువును పరిశీలిస్తూ ముందుకు సాగారు. రూ.318 కోట్ల ప్రస్తావన జిల్లాలో కరువు పరిస్థితులను ఎదుర్కోడానికి జిల్లా కలెక్టర్ రవి రూ. 318.86 కోట్ల ప్రతిపాదనలను కేంద్ర బృందం ముందు ఉంచారు. పశు పెంపకానికి రూ. 15 కోట్లు, తాగునీటి సమస్య పరిష్కారానికి రూ. 59.64 కోట్లు, పంటనష్టానికి రూ. 257.72 కోట్లు ఇవ్వాలని విన్నవించారు. అయితే వచ్చే ఐదేళ్లలో తాగునీటి సమస్యను ఎదుర్కోవడానికి అయ్యే ఖర్చుకు మాత్రమే ప్రతిపాదనలు ఇవ్వాలని కేంద్ర బృందం కలెక్టర్‌కు సూచించింది. కాగా, జిల్లాలోని కరువు పరిస్థితులపై ఈ నెల 26 న రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శితో కలిసి చర్చిస్తామని, అనంతరం జనవరి 10న కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని కేంద్ర బృందం వెల్లడించింది.