నా కొడుకు అస్థిపంజరంతో ధర్నా చేస్తా
నా కుమారుడి మృతికి వారే కారకులు !
ప్రభుత్వానికి వారం రోజులు గడువు ఇస్తున్నా
నివేదిక బయటపెట్టకపోతే
కుమారుడి అస్థిపంజరంతో ధర్నా చేస్తా
ప్రభుత్వాన్ని హెచ్చరించిన డీకే రవి తల్లి
బెంగళూరు(బనశంకరి) : ‘నా కుమారుడు, ఐఏఎస్ అధికారి డీ.కే రవి మృతికి ఆయన భార్య కుసుమ, ఆమె తండ్రి హనుమంతరాయప్ప కారణం’ అని గౌరమ్మ ఆరోపించారు. రవి మృతిపై సీబీఐ నివేదిక బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని ఆనందరావు సర్కిల్ వద్ద బుధవారం ఆమె అహోరాత్రి ధర్నాచేపట్టిన విషయం తెలిసిందే. గురువారం ఆమె ధర్నాలో మాట్లాడుతూ కోలారు కలెక్టర్‌గా డీ.కే రవి విధులు నిర్వర్తిస్తున్నప్పుడే ఆయన భార్య కుసుమతో పాటు తండ్రి హనుమంతరాయప్ప పట్టుబట్టి బెంగళూరుకు బదిలీ చేయించారన్నారు. బదిలీ అయిన కొన్ని రోజులకే డీ.కే రవి అనుమానాస్పద స్థితిలో మరణించారన్నారు. ఆ సమయంలో కుసుమ, హనుమంతరాయప్ప ప్రవర్తన, కుసుమ విదేశాలకు వెళ్లిపోవడం, తర్వాత వారిద్దరూ తమ కుటుంబంతో సరిగా మాట్లాడక పోవడం.. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత డీ.కే రవి మరణం వెనక వారి హస్తం కూడా ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ విషయమై ప్రభుత్వం దర్యాప్తు జరిపించి కుసుమ, హనుమంత రాయప్పను జైలులో పెట్టించాలని డిమాండ్ చేశారు. రవి మృతిపై పూర్తి వివరాలను వారం రోజుల్లో బయట పెట్టకపోతే డీకే రవి అస్థిపంజరంతో విధానసౌధ ఎదుట ధర్నా చేస్తానని గౌరమ్మ హెచ్చరించారు. డీకే రవిది ఆత్మహత్య, లేక హత్య అనే విషయంలో తేల్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం ఇంతవరకు తమకు ఎలాంటి సాయమందించలేదని మండిపడ్డారు. ఇదిలా ఉంగా ధర్నా సమయంలో గౌరమ్మ సొమ్మసిల్లిపడిపోయారు. ధర్నాలో పాల్గొన్న రైతుకావలి సమితినేత కరిగౌడ ఆత్మహత్యకు యత్నించి కలకలం రేపారు. డికే.రవి మృతిపై సీబీఐ నివేదికను వెల్లడించాలని డిమాండ్ చేస్తూ ఆయన విషం బాటిల్ ముందు పెట్టుకుని తాగుతానని బెదిరించాడు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆమె ఏ మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు: గౌరమ్మ ఆరోపణల పై ప్రతిస్పందించాలని హనుమంతరాయప్పను కోరగా...‘ఎందుకు ఆమె అలా మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ నివేదిక ప్రభుత్వానికి చేరి అందులోని విషయాలు వెళ్లడి అయ్యే వరకూ నేను ఏమీ మాట్లాడను. ఇక ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి పరిహారం అందలేదు.’ అని పేర్కొన్నారు.