నిరూపిస్తే రాజకీయ సన్యాసం
మహిళా ఐఏఎస్ అధికారికి డి.కె.రవి 44సార్లు ఫోన్ చేశారన్న
సీఎం వ్యాఖ్యలపై కుమారస్వామి సవాల్
బెంగళూరు:డి.కె.రవి అనుమానాస్పద మృతికి సంబంధించి ప్రజల మనసుల్లో విష బీజాలు నాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి విమర్శించారు. సోమవారమిక్కడ తన ను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ....‘ముఖ్యమం త్రి సిద్ధరామయ్య ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐఏఎస్ అధికారి డి.కె.రవి చనిపోవడానికి ముందు ఓ గంట వ్యవధిలో ఓ మహిళా ఐఏఎస్ అధికారికి 44 సార్లు ఫోన్ చేశారని చెప్పారు. తద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపించారు.
డి.కె.రవి అన్ని సార్లు మహిళా ఐఏఎస్ అధికారికి ఫోన్ చేశారని సిద్ధరామయ్య కనుక నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచే తప్పుకుంటాను. ఒకవేళ సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలను నిరూపించలేక పోతే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారా?’ అని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వ సీబీఐ విచారణకు ఆదేశించింది వారి హైకమాండ్ ఆదేశాల ప్రకారమే కానీ, ప్రజల మనోభావాలను గౌరవించి కాదని విమర్శించారు.