
బిడ్డ సంవత్సరీకానికి బొట్టు కూడా లేదు !
⇒ దివంగత ఐఏఎస్ అధికారి డీకే రవి తల్లి కన్నీటి గాథ
⇒నగలు తాకట్టు పెట్టి కుమారుడి సంవత్సరీకం చేస్తున్నాం
⇒{పభుత్వమూ ఆదుకోలేదు
⇒సమాధి వద్ద నుంచి 16న బెంగళూరుకు పాదయాత్ర
⇒డి.కె. రవి తల్లి గౌరమ్మ రవికి అభిమానుల ఘన నివాళి
తుమకూరు : దేశం గర్వించదగ్గ కలెక్టర్‌ను అందించిన ఆ కుటుంబం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. సదరు కలెక్టర్ సంవత్సరీకానికి కూడా డబ్బులు లేకపోవడంతో బంగారు ఆభరణాలు బ్యాంకులో కుదవ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరే కారణమని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు... నిజాయితీ కలిగిన కలెక్టర్‌గా పేరు గడించిన డీ.కే రవి గత ఏడాది మార్చి 16న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీ.కే రవి సంవ త్సరికాన్ని ఆదివారం ఆయన స్వగ్రామం దొడ్డకుప్పలు గ్రామంలో కుటుంబ సభ్యులు నిర్వహించారు. డీ.కే రవి సమాధి వద్ద ఆయన తల్లిదండ్రులు గౌరమ్మ, కరిప్పలు సంప్రదాయ పద్దతిలో పూజలు నిర్వహించారు. అనంతరం గౌరమ్మ మీడియాతో మాట్లాడారు. ‘చెట్టంత కొడుకు చనిపోవడంతో మా కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది. సవ ంత్సరీకం నిర్వహించడానికి కూడా డబ్బులు లేవు. దీంతో నా కొడుకు కొనిచ్చిన బంగారు నగను స్థానిక విజయాబ్యాంకులో కుదువ పెట్టి లక్ష రూపాయలు అప్పు తీసుకుని వచ్చా. మా కొడుకు చనిపోయిన తర్వాత ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇంతవరకూ మాకు అందలేదు.
అంతేకాకుండా డీ.కే రవి మరణం ఎలా జరిగిందో తేల్చాల్సిన సీబీఐ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కనీసం ఒక్కసారి కూడా మా గ్రామానికి రాలేదు. నా కొడుకు డి.కె.రవి ఎలా మరణించాడో ఇటు సీబీఐకాని, అటు ప్రభుత్వం కానీ ఇప్పటి వ రకు ప్రకటించలేదు. ఈనెల 16న తన కుమారుడి సమాధి వద్ద నుంచి బెంగళూరుకి పాదయాత్ర చేస్తాను. అదే రోజు విధానసౌధలోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని న్యాయం జరిగే వరకూ ధర్నా చేస్తాను.’ అని గౌరమ్మ తెలిపారు. ఇదిలా ఉండగా రవి సంవత్సరికంలో తల్లి గౌరమ్మతో పాటు తండ్రి కరియప్ప, అన్న రమేష్, బంధువులు పాల్గొన్నారు. అంతేకాకుండా వివిధ ప్రాంతాల నుంచి సుమారు 15 వందల మందికిపైగా రవి అభిమానులు ఆదివారం ఆయన సమాధి వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. అనంతరం బెంగళూరులోని కెంపెగౌడ వైద్యాలయం ట్రస్టు, మిలీనియం రక్తనిధి, డీకే రవి సేనే ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా పెద్ద సంఖ్యలో యువత రక్తదానం చేశారు. ఇదిలా డికే రవి సమాధి వద్ద అతని తల్లి విలపించడం స్థానికులను కన్నీళ్లు పెట్టించింది. రవి సంవత్సరిక కార్యక్రమంలో ఆయన భార్య కుసుమ, మామ హనుంతరాయప్ప పాల్గొనకపోవడం గమనార్హం.