'డీకే రవి' టైటిల్ కోసం పోటాపోటీ
బెంగళూరు: నైతిక విలువలు పతనమవుతున్న సమాజంలో నీతి నిజాయితీలకు కట్టుబడి సమాజ సేవయే పరమార్థంగా, జీవన సాఫల్యంగా భావించే ప్రభుత్వాధికారులు చాలా అరుదు. ఆ కోవకు చెందిన ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద పరిస్థితుల్లో అర్ధాంతరంగా అశువులు బాసిన విషయం తెల్సిందే. ఇప్పుడు ప్రజల కోసం పాటుపడిన ఆయన పోరాటాన్ని, సాధించిన విజయాలను, ఆయన ఎదుర్కొన్న సామాజిక పరిస్థితులను, మొత్తంగా ఆయన జీవిత నేపథ్యాన్నే ఇతి వృత్తంగా తీసుకొని చిలనచిత్రాన్ని నిర్మించేందుకు కన్నడ సినీ నిర్మాతలు పోటీ పడుతున్నారు. 'డీకే రవి' టైటిల్‌ను రిజిస్టర్ చేయించుకునేందుకు పలువురు కన్నడ సినీ నిర్మాతలు ఇప్పటికే కన్నడ చలనచిత్ర వాణిజ్య మండలి (కేఎఫ్‌సీసీ)ని ఆశ్రయించారు. వారిలో అనాజి నాగరాజ్, దినేష్ గాంధీ, శంకర్ గౌడ తదిదరులు ఉన్నారు.
ఇప్పుడే ఆయన పేరిట సినిమా టైటిల్‌ను రిజిస్టర్ చేయడమంటే తొందరపాటు అవుతుందనే ఉద్దేశంతో ఆ నిర్మాతల దరఖాస్తులను తిరస్కరించినట్టు కేఎఫ్‌సీసీ కార్యదర్శి బామా హరీష్ తెలియజేశారు. పైగా ఇలాంటి దరఖాస్తులు చేసుకునేమందు రవి కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరని ఆయన చెప్పారు. వారు అనుమతించినప్పుడు ఈ అంశాన్ని మళ్లీ పరిశీలించవచ్చని తెలిపారు. సమాజంతో పేరున్న వ్యక్తుల పేరిట టైటిల్ రిజిస్టర్ చేయకూడదనేది కేఎఫ్‌సీసీ నిబంధనల్లో ఉంది. అయితే ఈ నిబంధనలను నిర్మాతలు, దర్శకులు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. టైటిలే అభ్యంతరమైనప్పుడు మరో టైటిల్‌తో సినిమా తీసేందుకు తమకు అభ్యంతరం లేదని కొంతమంది నిర్మాతలు చెబుతున్నారు.