పరిగి, న్యూస్‌లైన్: అంతర్‌రాష్ట్ర రహదారి హైదరాబాద్ - బీజాపూర్ మార్గాన్ని నాలుగు లేన్లుగా మార్చేందుకు కృషి చేస్తానని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు పరమేశ్వర్ అన్నారు. ఆదివారం పీసీసీ కార్యదర్శి టీ.రామ్మోహన్‌రెడ్డి, కర్ణాటక మాజీ ఎమ్మెల్యే బోస్‌రాజ్‌లతో కలిసి ఆయన పరిగిలో విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక - హైదరాబాద్‌ల మధ్య ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగించడానికి అంతర్‌రాష్ట్ర రహదారిని విస్తరించాల్సి ఉందని, ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధ చూపనున్నట్టు చెప్పారు.
అలాగే పరిగి మీదుగా వికారాబాద్ - రాయచూర్ రైల్వేలైన్ ఏర్పాటుకు సహకరిస్తానన్నారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ చొరవతో కర్ణాటకలోని ఆరు నైజాం జిల్లాల్లో విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ప్రత్యేకంగా జీఓ అలాగే ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ మంజూరైందని చెప్పారు. ఏఐసీసీ అధినేత్రికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఫిబ్రవరి 1వతేదీన గుల్బర్గాలో 2లక్షల మందితో సభ నిర్వహించనున్నామన్నారు. సభకు సోనియాగాంధీ హాజరు కానున్నారని, హైదరాబాద్ - బీజాపూర్ రోడ్డు విస్తరణ అలాగే రైల్వే ఏర్పాటు ప్రతిపాదనలు ఆమె ముందు ఉంచుతామని పరమేశ్వర్ తెలిపారు.
ఏపీసీ కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని అన్నారు. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని సోనియాగాంధీని కోరతానని చెప్పారు. అనంతరం కాంగ్రెస్ పరిగి నాయకులు, కార్యకర్తలు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిని ఘనంగా సన్మానించారు.
హైదరాబాద్-బీజాపూర్ రహదారిని నాలుగు లేన్లుగా మార్చేందుకు కృషి
Published Sun, Jan 26 2014 11:11 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement