అరకులో రూ.80 వేలు..సిటీలో రూ.6 లక్షలు!  | An organized hash oil racket | Sakshi
Sakshi News home page

అరకులో రూ.80 వేలు..సిటీలో రూ.6 లక్షలు! 

Published Mon, Dec 11 2023 4:52 AM | Last Updated on Mon, Dec 11 2023 4:52 AM

An organized hash oil racket - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గంజాయి సంబంధిత మాదకద్రవ్యమైన హష్‌ ఆయిల్‌ను విశాఖ ఏజెన్సీలో ఉన్న అరకు ప్రాంతం నుంచి లీటర్‌ రూ.80 వేలకు ఖరీదు చేసుకుని వచ్చి..హైదరాబాద్‌లోని వినియోగదారులకు రూ.6 లక్షలకు విక్రయిస్తోంది ఒక ముఠా.

వ్యవస్థీకృతంగా సాగుతున్న ఈ డ్రగ్స్‌ దందాపై సమాచారం అందుకున్న పశ్చిమ మండల టాస్‌్కఫోర్స్‌ పోలీసులు చెక్‌ చెప్పారు. తొమ్మిది మంది నిందితుల్లో ఏడుగురిని అరెస్టు చేశామని, వీరి నుంచి హష్‌ ఆయిల్‌తో పాటు చెరస్‌ స్వా«దీనం చేసుకున్నట్లు డీసీపీ నితిక పంత్‌ ఆదివారం వెల్లడించారు. పట్టుబడిన వారిలో ఓ యువతి కూడా ఉండగా..పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.  

వినియోగం నుంచి విక్రేతలుగా మారి... 
గోల్కొండ పరిధిలోని సెవెన్‌ టూంబ్స్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ ముజఫర్‌ అలీ పదో తరగతి తప్పడంతో చదువుకు స్వస్తి చెప్పాడు. తన స్నేహితుడైన సబ్జా కాలనీ వాసి అబు బకర్‌ బిన్‌ అబ్దుల్‌ ఎజాజ్‌ ద్వారా ఇతడికి మాదకద్రవ్యాల వినియోగం అలవాటు అయింది.

వీరిద్దరూ కలిసి తరచుగా హష్‌ ఆయిల్‌ ఖరీదు చేసి నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్ళి వినియోగిస్తుండే వారు. కాలక్రమంలో వీరికి నగరంలో డ్రగ్స్‌కు ఉన్న డిమాండ్‌ అర్ధమైంది. దీంతో తామే హష్‌ ఆయిల్‌ దందా మొదలు పెడితే వినియోగించడంతో పాటు విక్రయించడానికి అవకాశం ఉంటుందని భావించారు. దీంతో తమ స్నేహితుడు, బైక్‌ మెకానిక్‌ మహ్మద్‌ ఖాసిమ్‌ అరకు సమీపంలోని పాడేరు ప్రాంతానికి పంపారు.  

చేతులు మారే కొద్దీ రేటు పైకి... 
ఆ ప్రాంతంలో లభించే హష్‌ ఆయిల్‌ను లీటర్‌ రూ.80 వేలకు ఖరీదు చేసిన ఖాసిమ్‌ బస్సుల్లో నగరానికి తీసుకువచ్చాడు. సోమాజిగూడ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ ముర్తుజా అలీ హుస్సేన్‌ ఇంటికి ఈ సరుకు తీసుకువచ్చేవారు. అక్కడే దాచి పెట్టడంతో పాటు అతడితో కలిసి ఈ హష్‌ ఆయిల్‌ను 5 మిల్లీ లీటర్ల పరిమాణం కలిగిన చిన్న సైజు ప్లాస్టిక్‌ టిన్నుల్లో నింపేవాళ్లు.

ఈ టిన్నుల్ని తమ వద్ద సబ్‌–పెడ్లర్స్‌గా పని చేస్తున్న విద్యార్థి ముబషిర్‌ ఖాన్‌ (మణికొండ), నితిన్‌ గౌడ్‌ (అయ్యప్ప సొసైటీ), క్యాటరింగ్‌ పని చేసే టి.పూనం కుమారీ కౌర్‌లకు ఒక్కో టిన్ను రూ.2 వేలకు అమ్మే వాళ్ళు. టోలిచౌకి వాసి జీషాన్‌ నవీద్, సమత కాలనీకి చెందిన సయ్యద్‌ అన్వరుల్లా హుస్సేనీ ఖాద్రీ కూడా వీరి నుంచి హష్‌ ఆయిల్‌ ఖరీదు చేస్తుండేవారు.  

వినియోగదారులకు రూ.3 వేలకు... 
హష్‌ ఆయిల్‌ నగరానికి తీసుకువచ్చే ఖాసిమ్, విక్రయించే ముజఫర్, అబుబకర్‌ తెర వెనుకే ఉండేవారు. వీరి సబ్‌–పెడ్లర్స్‌ మాత్రమే ఈ మాదకద్రవ్యాన్ని వినియోగదారులకు విక్రయించారు. 5 మిల్లీ లీటర్ల టిన్ను రూ.3 వేలు (లీటర్‌ రూ.6 లక్షలు) చొప్పున విక్రయించారు. కొన్నాళ్లుగా గుట్టుగా సాగుతున్న వీరి వ్యవహారంపై పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఖలీల్‌ పాషాకు సమాచారం అందింది.

ఆయన నేతృత్వంలో ఎస్సై షేక్‌ కవియుద్దీన్‌ బృందం రంగంలోకి దిగి వలపన్నింది. జీషాన్, అన్వరుల్లా మినహా మిగిలిన ఏడుగురిని పట్టుకున్నారు. వీరి నుంచి 310 మిల్లీ లీటర్ల హష్‌ అయిల్‌తో పాటు 70 గ్రాములు చెరస్‌ (గంజాయి సంబంధిత డ్రగ్‌) స్వా«దీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఇరువురి కోసం గాలిస్తున్న టాస్‌్కఫోర్స్‌ వీరికి చెరస్‌ ఎక్కడ నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? అనేవి ఆరా తీస్తున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును ఫిల్మ్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement