మత్తుగా...మాయాలోకంలో! | Number Of People Getting Addicted To Cannabis Across Country | Sakshi
Sakshi News home page

మత్తుగా...మాయాలోకంలో!

Published Sun, Jan 8 2023 2:54 AM | Last Updated on Sun, Jan 8 2023 2:54 AM

Number Of People Getting Addicted To Cannabis Across Country - Sakshi

►బెంగళూరుకు చెందిన ఇరవై రెండేళ్ల ఐఐటీయన్‌ శ్రీలత పాతికేళ్లలోపే ఐఏఎస్‌ అధికారి కావాలన్న కలను గంజాయి కారణంగా భగ్నం చేసుకుంది.  

►చండీగఢ్‌కు చెందిన 43 ఏళ్ల ప్రభుత్వరంగ బ్యాంక్‌ సీనియర్‌ మేనేజర్‌ సుస్మిత చౌధురి గంజాయికి అలవాటుపడ్డ తన 12 ఏళ్ల కొడుకును కాపాడుకోవడం కోసం ఉద్యోగాన్ని వదిలేశారు.

►గాంధీనగర్‌కు చెందిన 48 ఏళ్ల గృహిణి అనామిక పటేల్‌ తన 17 ఏళ్ల కుమారుడు గంజాయి సేవిస్తున్నాడన్న విషయం తెలుసుకుని పార్టీల్లో తప్ప ఎక్కడా గంజాయి సేవించకూడదని ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. 

కంచర్ల యాదగిరిరెడ్డి
మత్తులో గమ్మత్తుగా దొరికే అనందాన్ని వెతుక్కుంటూ దేశవ్యాప్తంగా గంజాయికి అలవాటు పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కళాశాల క్యాంపస్‌లు, నైట్‌ క్లబ్‌లు, పబ్‌లు, పేరు గాంచిన రెస్టారెంట్లు, విశ్వవిద్యాలయాలు, ప్రీమియర్‌ విద్యాసంస్థల హాస్టళ్లలో గంజాయి సేవించడం సర్వసాధారణంగా మారిపోయింది. అమ్‌స్టర్‌డ్యామ్‌ డ్రీమ్, మౌలానా క్రీమ్, బాంబే బ్లాక్‌ లాంటి గంజాయి రకాలు ఇప్పుడు యువత సంభాషణల్లో క్రేజీగా మారాయి.

‘గంజాయి అనేది మింట్, చాక్లెట్‌ లాగా సాధారణమైపోయింది, తక్షణ ఉల్లాసం కలిగించే మాదకద్రవ్యంగా 12 ఏళ్ల పిల్లలు సైతం దీనిని వాడుతున్నారు’అని అమృత్‌సర్‌కు చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సవీందర్‌ సింగ్‌ చెప్పారు. ఢిల్లీని ఆనుకుని ఉన్న రాష్ట్రాల్లో గంజాయి వినియోగం శరవేగంగా విస్తరిస్తోందన్నారు,  

హ్యాష్‌ అని ముద్దుపేరు 
గంజాయిని హ్యాష్, హ్యాషిన్‌ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఢిల్లీలోని పహర్‌గంజ్‌ ‘హ్యాషెర్ప్‌ స్ట్రీట్‌’గా గంజాయి సేవించే వారికి సుపరిచితమైన స్థలం. గొట్టాల సాయంతో గానీ, సిగరెట్ల మాదిరిగా కాగితంతో చుట్టి గానీ గంజాయిని పీలుస్తుంటారు. దేశవ్యాప్తంగా హ్యాషెర్‌ స్ట్రీట్‌ లాంటి కేంద్రాలు వేల సంఖ్యలో ఉన్నాయి. వేలాదిమంది యువతీ యువకులు గంజాయి సేవించడానికి ఆ సెంటర్లకు వెళ్తుంటారు.

ఐఏఎస్‌ హోదా సాధించాలని కలలు కన్న శ్రీలత వారాంతంలో స్నేహితులతో కలిసి ఢిల్లీలోని హ్యాషెర్స్‌ స్ట్రీట్‌కు వెళ్లడం ప్రారంభమైన తరువాత తన జీవన సరళి మారిపోయింది. ‘ఖరగ్‌పూర్‌లో ఐఐటీ పూర్తి చేసి సివిల్స్‌ ప్రిపరేషన్‌ కోసం ఢిల్లీ వచ్చి నా కూతురు హ్యాష్‌కు బానిసైంది. బంగారు భవిష్యత్‌ను పాడుచేసుకుంది’అని శ్రీలత తండ్రి గోపాలకృష్ణ హెగ్డే ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి నిషేధాన్ని పాలనా యంత్రాంగం సరిగ్గా అమలు చేయడం లేదంటూ ఆయన ఢిల్లీ హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇంకా పెండింగ్‌లో ఉంది.  

గంజాయికి విపరీతమైన డిమాండ్‌ 
ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా గంజాయికి దేశవ్యాప్తంగా డిమాండ్‌ పెరిగిందని నార్కో­టిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) సీనియర్‌ అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ‘గంజాయి అమ్మకాల గురించి తెలిసినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లు, పోలీసులతో స్మగ్లర్లకు సంబంధాల వల్ల ఏమీ చేయలేకపోతున్నామని’ఆయన అన్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్, జలంధర్‌ ప్రాంతాల్లో వయసుతో నిమి­త్తం లేకుండా అందరూ గంజాయిని నిత్యావసర వస్తువుగా వినియోగిస్తున్నారట.

అక్కడ భయానక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో స్థానిక పోలీసులు, స్వచ్ఛంద సంస్థల సాయంతో చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని ఆయన తెలిపారు. గడచిన పదేళ్లతో పోల్చి చూస్తే ఢిల్లీ మాత్రమే కాదు ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాలో దీని వాడకం పాతిక రెట్లు పెరిగిందని ఎన్‌సీబీ రికార్డులు చెపుతున్నాయి.

ఇటీవల నూతన సంవత్సర వేడుకలకు దేశవ్యాప్తంగా కొన్ని వందల టన్నుల గంజాయిని వాడి ఉంటారని అంచనా. న్యూఇయర్‌ కోసం సిద్ధం చేసి ఉంచిన 2.5 క్వింటాళ్ల గంజాయిని ఒడిశాలో, 3.5 క్వింటాళ్ల గంజాయిని కేరళలో సీజ్‌ చేశారు. ఒక్క 2022లో ఎన్‌సీబీ దేశవ్యా­ప్తంగా 5.5 టన్నుల గంజాయిని ధ్వంసం చేసింది. ఐక్యరాజ్యసమితిలో మాదక ద్రవ్యాలు, నియంత్ర­ణ విభాగం 2022లో విడుదల చేసిన ఓ నివేదికలో 2010–2020మధ్య భారత్‌లో గంజాయి స్మగ్లింగ్‌ విపరీతంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది.  

ధర తక్కువ ఉండటమూ ఓ కారణమే
సులువుగా దొరకడం, ధర తక్కువగా ఉండటమూ గంజాయి విస్తరించడానికి ప్రధాన కారణమని ఎన్‌సీబీ అధికారి ఒకరు విశ్లేషించారు. రూ.300 నుంచి రూ.1200 వరకు గంజాయి లభిస్తోందని చెప్పారు. ‘గతంలో 18–20 ఏళ్ల మధ్య యువత దీనికి బానిస అవుతున్నారని అనుకుంటే ఇప్పుడు 12 ఏళ్ల పిల్లలు కూడా దీని బారిన పడుతున్నారు. ఇటీవల కొన్ని కేసులను పరిశీలించినప్పుడు ముంబైలో స్కూల్‌ పిల్లలు గంజాయిని వాడుతున్నట్లు మాకు తెలిసింది.

గంజాయిని సేవిస్తున్న ఓ 13 ఏళ్ల కుర్రాడిని మా టీమ్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. గంజాయి తాగితే తప్పేమిటని ఆ బాలుడు ప్రశ్నించాడ’ని ఆ అధికారివాపోయారు. ముంబై. ఢిల్లీ, కోల్‌కతాలో విద్యాసంస్థల సమీపంలోనే ఉన్న పాన్‌ దుకాణాలు గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని విక్రయిస్తున్నాయి. ముంబైలో ఇటీవల కొన్ని పాన్‌ షాపుల మీద దాడి చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక పబ్‌లలో వెయిటర్లు దీనినే ప్రధాన వృత్తిగా ఎంచుకుంటున్నారు. ఢిల్లీలోని సాకేత్, వసంత్‌ కుంజ్, ముంబైలోని కొలాబా, బాంద్రా, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, గచ్చిబౌలి, చెన్నైలోని తేనాంపేట, గోపాలపురం, బెంగళూరులోని చిక్‌పేట, జయానగర్‌ ప్రాంతాల్లో గంజాయి వాడకం విపరీతంగా ఉంది. 

హైదరాబాద్‌లో వందలాదిగా ఏజెంట్లు 
హైదరాబాద్‌లో గంజాయి సరఫరా వ్యవస్థ పకడ్బందీగా ఉంది. సరైన వ్యక్తిని సంప్రదిస్తే నిమిషాల్లోనే కావాల్సిన వారి చేతికి అందుతుంది. గంజాయి కొనుగోలు చేయడం ఎంత సులువో.. ఓ ఏజెంట్‌ను పరిచయం చేసుకున్న ఈ ప్రతినిధికి అర్థమైంది. ఇటీవల ఓ పోలీసు అధికారి సాయంతో సాక్షి ప్రతినిధికి ఓ గంజాయి సరఫరా ఏజెంట్‌తో పరిచయమైంది. బాగా నమ్మకం కుదిరిన తరువాత ‘సాక్షి’ప్రతినిధి తనకు గంజాయి కావాలని అడిగితే ఆ ఏజెంట్‌ చేసిన సూచన ఇలా ఉంది.... ‘ఒంటరిగా కేబీఆర్‌ పార్క్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వైపు నడుస్తూ వెళ్లండి అయితే, మీరు అనుమానాస్పదంగా వ్యవహరించవద్దు.

గంజాయి కోసం తహతహలాడుతున్నట్లు మీ ఫీలింగ్‌ ఉండాలి. అప్పుడు మా ఏజెంట్‌ మీ దగ్గరకు వస్తాడు. నేను ఇప్పుడు చెబుతున్న కోడ్‌ అతనికి వినిపించేలా చెప్పండి. తక్షణమే మీ చేతిలో ఒక పాకెట్‌ పెడతాడు’. ఈ ఉదంతం శాంపిల్‌ మాత్రమే. గంజాయి సరఫరా చేయడానికి నగరంలో ఎన్నో మార్గాలు ఉన్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. ‘గంజాయి వినియోగాన్ని అరికట్టాలంటే, పాఠశాలలు, కళాశాలలు, ఐటీ పని ప్రదేశాల్లో పరీక్షలను తప్పనిసరి చేయాలి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లోని పాఠశాలల విద్యార్థులకు ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తుంటారు. అయితే, ఈ దేశంలో ఇలాంటి పరీక్షలను నిర్వహించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది’అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.  

మెదడు, కాలేయంపై ప్రభావం
కొకైన్‌ వంటి మాదకద్రవ్యాల కంటే గంజాయి సురక్షితమని కొందరు వాదిస్తున్నారు. అయితే, అది ఎంత మాత్రం నిజం కాదని వైద్యులు తేల్చిచెబుతున్నారు. గంజాయిని వినియోగిస్తున్న వారి సంఖ్య ఎలా పెరుగుతుందో దాని మూలంగా మానసిక సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య కూడా అంతే పెరుగుతుందని మెంటల్‌ హెల్త్‌ అండ్‌ బిహేవియరల్‌ సైన్సెస్‌ ముంబైకి చెందిన కన్సల్టెంట్‌ డాక్టర్‌ ఫెబియన్‌ ఆల్మెదా అన్నారు. గంజాయి దినచర్యగా మారితే మెదడు, కాలేయం దెబ్బతింటాయని, మానసిక భ్రాంతులు ఏర్పడతాయని చెప్పారు. ఇటీవల కాలంలో మానసిక సమస్యలతో వస్తున్న పిల్లల్లో 50 శాతానికి పైగా మాదకద్రవ్యాల బారిన పడ్డవారేనని ఆయన వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement