Hyderabad - Bijapur highway
-
అరకులో రూ.80 వేలు..సిటీలో రూ.6 లక్షలు!
సాక్షి, సిటీబ్యూరో: గంజాయి సంబంధిత మాదకద్రవ్యమైన హష్ ఆయిల్‌ను విశాఖ ఏజెన్సీలో ఉన్న అరకు ప్రాంతం నుంచి లీటర్ రూ.80 వేలకు ఖరీదు చేసుకుని వచ్చి..హైదరాబాద్‌లోని వినియోగదారులకు రూ.6 లక్షలకు విక్రయిస్తోంది ఒక ముఠా. వ్యవస్థీకృతంగా సాగుతున్న ఈ డ్రగ్స్ దందాపై సమాచారం అందుకున్న పశ్చిమ మండల టాస్‌్కఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. తొమ్మిది మంది నిందితుల్లో ఏడుగురిని అరెస్టు చేశామని, వీరి నుంచి హష్ ఆయిల్‌తో పాటు చెరస్ స్వా«దీనం చేసుకున్నట్లు డీసీపీ నితిక పంత్ ఆదివారం వెల్లడించారు. పట్టుబడిన వారిలో ఓ యువతి కూడా ఉండగా..పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వినియోగం నుంచి విక్రేతలుగా మారి... గోల్కొండ పరిధిలోని సెవెన్ టూంబ్స్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ముజఫర్ అలీ పదో తరగతి తప్పడంతో చదువుకు స్వస్తి చెప్పాడు. తన స్నేహితుడైన సబ్జా కాలనీ వాసి అబు బకర్ బిన్ అబ్దుల్ ఎజాజ్ ద్వారా ఇతడికి మాదకద్రవ్యాల వినియోగం అలవాటు అయింది. వీరిద్దరూ కలిసి తరచుగా హష్ ఆయిల్ ఖరీదు చేసి నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్ళి వినియోగిస్తుండే వారు. కాలక్రమంలో వీరికి నగరంలో డ్రగ్స్‌కు ఉన్న డిమాండ్ అర్ధమైంది. దీంతో తామే హష్ ఆయిల్ దందా మొదలు పెడితే వినియోగించడంతో పాటు విక్రయించడానికి అవకాశం ఉంటుందని భావించారు. దీంతో తమ స్నేహితుడు, బైక్ మెకానిక్ మహ్మద్ ఖాసిమ్ అరకు సమీపంలోని పాడేరు ప్రాంతానికి పంపారు. చేతులు మారే కొద్దీ రేటు పైకి... ఆ ప్రాంతంలో లభించే హష్ ఆయిల్‌ను లీటర్ రూ.80 వేలకు ఖరీదు చేసిన ఖాసిమ్ బస్సుల్లో నగరానికి తీసుకువచ్చాడు. సోమాజిగూడ ప్రాంతానికి చెందిన సయ్యద్ ముర్తుజా అలీ హుస్సేన్ ఇంటికి ఈ సరుకు తీసుకువచ్చేవారు. అక్కడే దాచి పెట్టడంతో పాటు అతడితో కలిసి ఈ హష్ ఆయిల్‌ను 5 మిల్లీ లీటర్ల పరిమాణం కలిగిన చిన్న సైజు ప్లాస్టిక్ టిన్నుల్లో నింపేవాళ్లు. ఈ టిన్నుల్ని తమ వద్ద సబ్–పెడ్లర్స్‌గా పని చేస్తున్న విద్యార్థి ముబషిర్ ఖాన్ (మణికొండ), నితిన్ గౌడ్ (అయ్యప్ప సొసైటీ), క్యాటరింగ్ పని చేసే టి.పూనం కుమారీ కౌర్‌లకు ఒక్కో టిన్ను రూ.2 వేలకు అమ్మే వాళ్ళు. టోలిచౌకి వాసి జీషాన్ నవీద్, సమత కాలనీకి చెందిన సయ్యద్ అన్వరుల్లా హుస్సేనీ ఖాద్రీ కూడా వీరి నుంచి హష్ ఆయిల్ ఖరీదు చేస్తుండేవారు. వినియోగదారులకు రూ.3 వేలకు... హష్ ఆయిల్ నగరానికి తీసుకువచ్చే ఖాసిమ్, విక్రయించే ముజఫర్, అబుబకర్ తెర వెనుకే ఉండేవారు. వీరి సబ్–పెడ్లర్స్ మాత్రమే ఈ మాదకద్రవ్యాన్ని వినియోగదారులకు విక్రయించారు. 5 మిల్లీ లీటర్ల టిన్ను రూ.3 వేలు (లీటర్ రూ.6 లక్షలు) చొప్పున విక్రయించారు. కొన్నాళ్లుగా గుట్టుగా సాగుతున్న వీరి వ్యవహారంపై పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషాకు సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్సై షేక్ కవియుద్దీన్ బృందం రంగంలోకి దిగి వలపన్నింది. జీషాన్, అన్వరుల్లా మినహా మిగిలిన ఏడుగురిని పట్టుకున్నారు. వీరి నుంచి 310 మిల్లీ లీటర్ల హష్ అయిల్‌తో పాటు 70 గ్రాములు చెరస్ (గంజాయి సంబంధిత డ్రగ్) స్వా«దీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఇరువురి కోసం గాలిస్తున్న టాస్‌్కఫోర్స్ వీరికి చెరస్ ఎక్కడ నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? అనేవి ఆరా తీస్తున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును ఫిల్మ్‌నగర్ పోలీసులకు అప్పగించారు. -
ఎన్నికల వరకు రేవంత్‌నే కొనసాగించాలి
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ముగి సేంతవరకు టీపీసీసీ అధ్య క్షుడిగా రేవంత్‌రెడ్డినే కొన సాగించాలని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అన్నారు. ఇప్పటికిప్పుడు రేవంత్‌రెడ్డిని దించేయాలని పార్టీలో ఎవరూ కోరుకోవడం లేదని చెప్పారు. సోమవారం అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షు డిగా ఎవరున్నా పార్టీలోని నేతలందరినీ కలుపుకొని పనిచేయాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని పేర్కొన్నారు. పాదయాత్ర చేయాలనే అభిప్రాయం పార్టీలో ఎవరికైనా ఉండవచ్చని, కానీ పీసీసీ అధ్య క్షుడికే ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేస్తే మనస్ఫూర్తిగా సహ కరిస్తానని తెలిపారు. అయితే రేవంత్ ఏ నిర్ణయం విషయంలోనూ తమను సంప్రదించడం లేదని విమర్శించారు. రేవంత్ ఇటీవల చేసిన కొన్ని తొందరపాటు వ్యాఖ్యల గురించి పార్టీ భేటీలో అడుగు తానని చెప్పారు. సీఎల్పీ నేత భట్టి ఒక నటుడని, ఆయన గురించి అర్ధం కాదని జగ్గారెడ్డి అన్నారు. డ్రామాలు ఓటు బ్యాంకును మార్చవు రాష్ట్రంలో టీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉంటే, కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉందని జగ్గారెడ్డి అభి ప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తాము మొదటి స్థానానికి వెళ్లి అధికారంలోకి రావాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని, టీఆర్ఎస్ రెండో స్థానా నికి వెళ్లాలన్నదే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో బీజేపీ హడావుడి చేస్తున్నా, హైటెక్ డ్రామాలు ఓటు బ్యాంకును మార్చలేవని పేర్కొన్నారు. సంగారెడ్డి రాంనగర్ వరకు మెట్రోరైల్ మెట్రో రైలును మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు పొడిగించాలని జగ్గారెడ్డి కోరారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌కు లేఖ రాసినట్టు తెలిపారు. బీహెచ్ఈఎల్, పటాన్చెరు, పోతిరెడ్డిపల్లి మీదుగా సంగారెడ్డిలోని రాంనగర్ వరకు మెట్రో రైల్ పొడి గించాలని కోరారు. అలాగే ఉప్పల్ మీదుగా యాద గిరిగుట్ట వరకు మెట్రో రైలును పొడిగించాలని, తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన గుట్ట వరకు ఈ రైలును పొడగించడం వల్ల పెద్ద ఎత్తున భక్తు లకు సౌకర్యంగా ఉంటుందని జగ్గారెడ్డి చెప్పారు. -
తెలంగాణకు మరో జాతీయరహదారి.. 2 బైపాస్‌లు.. 14 అండర్‌పాస్‌లు
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ వే తరహాలో మరో జాతీయ రహదారి రూపుదిద్దుకోనుంది. ఇది నాలుగు వరుసల జాతీయ రహదారే అయినప్పటికీ, మధ్యలో రోడ్డు మీదుగా ఇతర చిన్న రహదారుల నుంచి వచ్చే వాహనాలు వెళ్లకుండా ఎక్కడికక్కడ అండర్ పాస్‌లను నిర్మిస్తూ ఎక్స్‌ప్రెస్ వే తరహాలో నిర్మించనున్నారు. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారికి మార్గం సుగమమైంది. మరో రెండు నెలల్లో టెండర్ల కసరత్తు పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నారు. ఏడాదిన్నర నుంచి రెండేళ్ల కాలంలో ఇది అందుబాటులోకి రానుంది. నగర శివారులోని అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ దారిలోని మన్నెగూడ కూడలి వరకు ఈ నాలుగు వరుసల విశాలమైన రోడ్డు అందుబాటులోకి వస్తుంది. మన్నెగూడ నుంచి పరిగి మీదుగా కర్ణాటకలోని బీజాపూర్ వరకు కొనసాగుతుంది. మన్నెగూడ కూడలి వరకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) నాలుగు వరుసలుగా దీన్ని నిర్మించనుండగా, అక్కడి నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రోడ్డును వెడల్పు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని జాతీయ రహదారుల విభాగం పర్యవేక్షిస్తోంది. ఈ విభాగం ఇప్పటికే తన పరిధిలోని రోడ్డును 30 మీటర్లకు విస్తరించింది. ఇప్పుడు ఎన్హెచ్ఏఐ తన అధీనంలోని రోడ్డును 4 వరుసలుగా విస్తరించేందుకు సమాయత్తమైంది. చదవండి: రేవంత్ రెడ్డి మరోసారి జైలుకు వెళ్లకు తప్పదు 60 మీటర్ల వెడల్పుతో.. గతంలో రాష్ట్ర రహదారిగా ఉన్న బీజాపూర్ రోడ్డును 163వ నంబర్ జాతీయ రహదారిగా కేంద్రం ప్రక టించింది. ఇప్పుడు దాన్ని భారత్‌మాల పరియోజన పథకంలో చేర్చి ఇటీవలే ఎన్హెచ్ఏఐకి అప్పగించింది. అప్పా కూడలి వరకు విశాలంగానే ఉన్న రోడ్డు ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో 25 మీటర్లు, కొన్ని చోట్ల 30 మీటర్లుగా ఉంది. ఇప్పుడు దాన్ని 60 మీటర్లకు విస్తరించనున్నారు. ఇందులో ప్రధాన రోడ్డు 45 మీటర్లుగా ఉండనుంది. మధ్యలో నాలుగున్నర మీటర్ల సెంట్రల్ మీడియన్ ఉంటుంది. ప్ర ధాన క్యారేజ్ వే 30 మీటర్లుగా ఉంటుంది. దీనికి చివరలో వాలు, ఆ తర్వాత డ్రెయిన్ ఇలా మొత్తం 45 మీటర్ల వెడల్పుతో రోడ్డు ఉంటుంది. ఇక రెండు వైపులా విద్యుత్తు స్తంభాలు, చెట్లు, ఇతర అవసరాల కోసం 15 మీటర్ల (రెండువైపులా కలిపి) స్థలం ఉంటుంది. చదవండి:ఒక్క డ్యాన్స్‌తో సెలబ్రిటీగా మారిన ‘బుల్లెట్టు బండి’ వధువు పెరిగిన ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని.. తాండూరు, వికారాబాద్, పరిగి, బీదర్ సహా కర్ణాటకలోని పలు ప్రాంతాలకు ఈ రోడ్డునే వినియోగిస్తుండటంతో కొంతకాలంగా ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగింది. గతంలో శివారు ప్రాంతంగా ఉండి అంతగా రద్దీలేని మొయినాబాద్ ప్రాంతం ఇప్పుడు కిక్కిరిసిపోతోంది. మొయినాబాద్ నుంచి వికారాబాద్ వరకు ఫామ్‌హౌస్‌లు బాగా పెరిగాయి. వాటికి నిత్యం వచ్చిపోయే వారితో రద్దీ మరింత తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో దీన్ని విస్తరించాలన్న డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది. కాగా, అప్పా కూడలి నుంచి 46.405 కి.మీ. దూరం వరకు, అంటే పరిగి కూడలిలో ఉండే మన్నెగూడ వరకు ఎన్హెచ్ఏఐ ఇప్పుడు పనులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది. మొత్తం 221.90 హెక్టార్ల భూమిని కేంద్ర భూసేకరణ చట్టం కింద సమీకరిస్తున్నారు. చిన్న రోడ్లతో ఇబ్బంది లేకుండా.. ఈ రోడ్డుపై వాహనాల రద్దీ నేపథ్యంలో ఎక్కడా ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా ప్లాన్ చేశారు. ముఖ్యంగా మధ్యలో ఉండే గ్రామాల వద్ద చిన్న రోడ్ల మీదుగా వచ్చే వాహనాలతో ఇబ్బంది లేకుండా అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నారు. ఆ వాహనాలు ప్రధాన రోడ్డు దిగువగా అండర్‌పాస్‌ల నుంచి ముందుకుసాగుతాయి. చిన్న రోడ్లలోవాహనాల సంఖ్య ఎక్కువగా ఉండే ఆరు చోట్ల భారీ అండర్‌పాస్‌లు నిర్మిస్తారు. వీటి నుంచి బస్సులు, ట్రక్కులు, కంటెయినర్ వాహనాల లాంటి భారీ వాహనాలు వెళ్లిపోతాయి. ఇక 8 చోట్ల చిన్న అండర్‌పాస్‌లు నిర్మిస్తారు. వీటి నుంచి కార్లు లాంటి తక్కువ ఎత్తుండే వాహనాలు వెళ్తాయి. మొయినాబాద్ వద్ద 4.35 కి.మీ. మేర, చేవెళ్ల వద్ద 6.36 కి.మీ. మేర రెండు బైపాస్ రోడ్లను నిర్మిస్తారు. మన్నెగూడకు సమీపంలోని అంగడి చిట్టంపల్లి వద్ద 12 లేన్ల టోల్‌ప్లాజా నిర్మిస్తారు. ప్రమాదకరంగా మలుపులున్న 0.725 కి.మీ. పరిధిలో రోడ్డును నేరుగా ఉండేలా(రీఅలైన్మెంట్) మారుస్తారు. చదవండి: వ్యాక్సిన్ డోసులు ఫుల్.. స్పందన నిల్ -
హైదరాబాద్-బీజాపూర్ రహదారిని నాలుగు లేన్లుగా మార్చేందుకు కృషి
పరిగి, న్యూస్‌లైన్: అంతర్రాష్ట్ర రహదారి హైదరాబాద్ - బీజాపూర్ మార్గాన్ని నాలుగు లేన్లుగా మార్చేందుకు కృషి చేస్తానని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు పరమేశ్వర్ అన్నారు. ఆదివారం పీసీసీ కార్యదర్శి టీ.రామ్మోహన్‌రెడ్డి, కర్ణాటక మాజీ ఎమ్మెల్యే బోస్‌రాజ్‌లతో కలిసి ఆయన పరిగిలో విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక - హైదరాబాద్‌ల మధ్య ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగించడానికి అంతర్రాష్ట్ర రహదారిని విస్తరించాల్సి ఉందని, ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధ చూపనున్నట్టు చెప్పారు. అలాగే పరిగి మీదుగా వికారాబాద్ - రాయచూర్ రైల్వేలైన్ ఏర్పాటుకు సహకరిస్తానన్నారు. యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ చొరవతో కర్ణాటకలోని ఆరు నైజాం జిల్లాల్లో విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ప్రత్యేకంగా జీఓ అలాగే ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ మంజూరైందని చెప్పారు. ఏఐసీసీ అధినేత్రికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఫిబ్రవరి 1వతేదీన గుల్బర్గాలో 2లక్షల మందితో సభ నిర్వహించనున్నామన్నారు. సభకు సోనియాగాంధీ హాజరు కానున్నారని, హైదరాబాద్ - బీజాపూర్ రోడ్డు విస్తరణ అలాగే రైల్వే ఏర్పాటు ప్రతిపాదనలు ఆమె ముందు ఉంచుతామని పరమేశ్వర్ తెలిపారు. ఏపీసీ కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని అన్నారు. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని సోనియాగాంధీని కోరతానని చెప్పారు. అనంతరం కాంగ్రెస్ పరిగి నాయకులు, కార్యకర్తలు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిని ఘనంగా సన్మానించారు. -
నెత్తురోడ్డుతోంది!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ‘రోడ్డు భద్రత’ను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రయాణం సజావుగా సాగేందుకు వీలుగా రహదారుల స్వరూపాన్ని మార్చాలనే ప్రపంచ బ్యాంకు సూచనలను పక్కన పెట్టింది. మరణ మృదంగం మోగిస్తున్న మార్గాలను ప్రమాదరహితంగా తీర్చిదిద్దేందుకు చేయూతనిచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ ముందుకొచ్చింది. ఏపీ రోడ్ సెక్టార్ ప్రాజెక్టు (ఏపీఆర్‌ఎస్‌పీ) కింద రాష్ట్రంలోని మూడు రహదారులను అభివృద్ధి చేసేందుకు అంగీకరించింది. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు రూ.94 కోట్లను రాష్ట్ర రోడ్ల అభివృద్ధి సంస్థ (ఏపీఆర్డీసీ)కు కేటాయించింది. ఈ మేరకు హైదరాబాద్ - బీజాపూర్ (80కిలోమీటర్లు), రేణిగుంట - రాయలచెరువు (190కి.మీ), అనకాపల్లి - ఆనందపురం (58కి.మీ)మార్గాలను పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన ప్రభుత్వం.. ఈ హైవేలను ఇంటర్నేషనల్ రోడ్ అసెస్మెంట్ ప్రొగ్రాం (ఐఆర్ఏపీ) సంస్థతో సర్వే చేయించింది. ఇందులో భాగంగా సంస్థ ఈ మూడు మార్గాల్లో వాహనాల రాకపోకలు, రహదారి స్థితిగతులు, ప్రమాదాలకు కారణమవుతున్న మలుపులు, ప్రాంతాలపై వీడియోగ్రఫీ చేపట్టింది. 15 నుంచి 20 శాతం ప్రమాదాలకు రోడ్డు డిజైనే కారణమని గుర్తించిన ఐఆర్ఏపీ ఇంజనీరింగ్ లోపాల సవరణకు పలు సూచనలు చేసింది. రోడ్ల డిజైన్‌ను మార్చాలని నాలుగేళ్ల క్రితం ఐఆర్ఏపీ నివేదిక సమర్పించినా ప్రభుత్వ శాఖలు పట్టించుకోవడం లేదు. జిల్లా పరిధి జాతీయ రహదారిపై ఏడాదిలో 50 ప్రమాదాలు... పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసిన హైదరాబాద్ - బీజాపూర్ హైవే ప్రమాదాలతో నిత్యం నెత్తురోడుతోంది. హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్, చేవెళ్ల, పూడూరు, పరిగి, గండేడ్ల మీదుగా కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ వరకూ ఈ జాతీయ రహదారి విస్తరించి ఉంది. రెండు వరుసల ఈ రహదారిపై రోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. తెలంగాణ ప్రాంతంలోనే అత్యధికంగా నాపరాతి, సిమెంట్ పరిశ్రమలు గల తాండూరు నుంచి కూడా ఈ మార్గం గుండా పరిమితికి మించిన లోడ్‌తో సరుకు రవాణా వాహనాలు దౌడు తీస్తుంటాయి. అసలే ఇరుకు..అపై గతుకులకు తోడు వాహనాల వాయువేగం రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోంది. గత ఏడాదికాలంగా జిల్లా పరిధిలోనే ఈ జాతీయ రహదారిపై సుమారు 50 ప్రమాదాలు జరిగాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. తాజాగా చేవెళ్ల మండలంలో దసరా పండుగ రోజున కారును సిమెంట్ లారీ ఢీకొన్న ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబం దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి పూర్తిగా లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, పరిమితికి మించిన వేగమే కారణమని తేలింది. ఇలాంటి సంఘటనలు రోజూ జరుగుతూనే ఉన్నా... ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్లయినా లేదు. లంగర్‌హౌస్ నుంచి మొయినాబాద్ వరకు రేడియల్ రోడ్డు వేయడంతో కాస్తో కూస్తో ప్రమాదాల శాతం తగ్గుముఖం పట్టినప్పటికీ, ఆ తర్వాత నిడివి(60 కి.మీ)లో మాత్రం ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. పట్టణీకరణ నేపథ్యంలో చేవెళ్లలో ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య భారీగా పెరిగింది. దీనికితోడు బెంగళూరు నేషనల్ హైవేను శంషాబాద్ నుంచి చేవెళ్ల మీదుగా దారిమళ్లించడం కూడా ప్రమాదాల సంఖ్య పెరిగేందుకు కారణమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ మార్గంలో ప్రమాదాల నివారణకు, రోడ్డు విస్తరణకు వరల్డ్ బ్యాంకు ఆర్థిక సాయం అందిస్తున్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు అమలులో ఆలస్యమవుతోంది. సమన్వయ లేమి! రోడ్ల అభివృద్ధి, భద్రత బాధ్యతలను ప్రభుత్వం మూడు శాఖలకు అప్పగించింది. రాష్ట్రస్థాయిలో ప్రత్యేకంగా రోడ్ సేఫ్టీ సెల్‌ను ఏర్పాటు చేయాలని రవాణా శాఖను నిర్దేశించింది. అయితే పోలీసు, ఆర్డీసీ, వైద్య, రవాణా శాఖల మధ్య కొరవడిన సమన్వయంతో ప్రాజెక్టు మొదలైన మూడేళ్లకు గానీ ప్రత్యేక సెల్ కార్యరూపం దాల్చలేదు. నిర్దేశిత మారా ్గల్లో ట్రామాకేర్ సెంటర్లు, ఆస్పత్రుల నిర్వహణ, అంబులెన్స్‌ల కొనుగోళ్లు వైద్య, ఆరోగ్యశాఖ పర్యవేక్షణలో కొనసాగించాల్సివుండగా... ప్రమాద సూచికల ఏర్పాటు, పెట్రోలింగ్, ట్రా ఫిక్ క్రమబద్ధీకరణను రవాణా, పోలీసు శాఖ లు పర్యవేక్షించాలని ప్రభుత్వం సూచించింది. అలాగే గుర్తించిన ప్రమాద కారకాల (బ్లాక్‌స్పాట్స్)ను తొలగించడం, రోడ్డును నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా మలిచే బాధ్యతను ఆర్డీసీకి కట్టబెట్టింది. ముఖ్యంగా ప్రమాదాలకు హేతువుగా మారిన మలుపులను సవరించడం ద్వారా ఘోరాలకు అడ్డుకట్ట వేయవచ్చని భావించింది. ఈ మేరకు ఆయా శాఖల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసినప్పటికీ, టెండర్లను ఇప్పటివరకు ఖరారు చేయకపోవడం గమనార్హం. కాగా, ప్రపంచ బ్యాంకు సాయంతో అమలవుతున్న ఈ ప్రాజెక్టు 2015 సంవత్సరంతో ముగియనుంది.