సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ‘రోడ్డు భద్రత’ను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రయాణం సజావుగా సాగేందుకు వీలుగా రహదారుల స్వరూపాన్ని మార్చాలనే ప్రపంచ బ్యాంకు సూచనలను పక్కన పెట్టింది. మరణ మృదంగం మోగిస్తున్న మార్గాలను ప్రమాదరహితంగా తీర్చిదిద్దేందుకు చేయూతనిచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ ముందుకొచ్చింది. ఏపీ రోడ్ సెక్టార్ ప్రాజెక్టు (ఏపీఆర్‌ఎస్‌పీ) కింద రాష్ట్రంలోని మూడు రహదారులను అభివృద్ధి చేసేందుకు అంగీకరించింది. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు రూ.94 కోట్లను రాష్ట్ర రోడ్ల అభివృద్ధి సంస్థ (ఏపీఆర్‌డీసీ)కు కేటాయించింది.
ఈ మేరకు హైదరాబాద్ - బీజాపూర్ (80కిలోమీటర్లు), రేణిగుంట - రాయలచెరువు (190కి.మీ), అనకాపల్లి - ఆనందపురం (58కి.మీ)మార్గాలను పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన ప్రభుత్వం.. ఈ హైవేలను ఇంటర్నేషనల్ రోడ్ అసెస్‌మెంట్ ప్రొగ్రాం (ఐఆర్‌ఏపీ) సంస్థతో సర్వే చేయించింది. ఇందులో భాగంగా సంస్థ ఈ మూడు మార్గాల్లో వాహనాల రాకపోకలు, రహదారి స్థితిగతులు, ప్రమాదాలకు కారణమవుతున్న మలుపులు, ప్రాంతాలపై వీడియోగ్రఫీ చేపట్టింది. 15 నుంచి 20 శాతం ప్రమాదాలకు రోడ్డు డిజైనే కారణమని గుర్తించిన ఐఆర్‌ఏపీ ఇంజనీరింగ్ లోపాల సవరణకు పలు సూచనలు చేసింది. రోడ్ల డిజైన్‌ను మార్చాలని నాలుగేళ్ల క్రితం ఐఆర్‌ఏపీ నివేదిక సమర్పించినా ప్రభుత్వ శాఖలు పట్టించుకోవడం లేదు.
జిల్లా పరిధి జాతీయ రహదారిపై ఏడాదిలో 50 ప్రమాదాలు...
పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసిన హైదరాబాద్ - బీజాపూర్ హైవే ప్రమాదాలతో నిత్యం నెత్తురోడుతోంది. హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్, చేవెళ్ల, పూడూరు, పరిగి, గండేడ్‌ల మీదుగా కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ వరకూ ఈ జాతీయ రహదారి విస్తరించి ఉంది. రెండు వరుసల ఈ రహదారిపై రోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. తెలంగాణ ప్రాంతంలోనే అత్యధికంగా నాపరాతి, సిమెంట్ పరిశ్రమలు గల తాండూరు నుంచి కూడా ఈ మార్గం గుండా పరిమితికి మించిన లోడ్‌తో సరుకు రవాణా వాహనాలు దౌడు తీస్తుంటాయి. అసలే ఇరుకు..అపై గతుకులకు తోడు వాహనాల వాయువేగం రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోంది. గత ఏడాదికాలంగా జిల్లా పరిధిలోనే ఈ జాతీయ రహదారిపై సుమారు 50 ప్రమాదాలు జరిగాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. తాజాగా చేవెళ్ల మండలంలో దసరా పండుగ రోజున కారును సిమెంట్ లారీ ఢీకొన్న ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబం దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.
ఈ ప్రమాదానికి పూర్తిగా లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, పరిమితికి మించిన వేగమే కారణమని తేలింది. ఇలాంటి సంఘటనలు రోజూ జరుగుతూనే ఉన్నా... ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్లయినా లేదు. లంగర్‌హౌస్ నుంచి మొయినాబాద్ వరకు రేడియల్ రోడ్డు వేయడంతో కాస్తో కూస్తో ప్రమాదాల శాతం తగ్గుముఖం పట్టినప్పటికీ, ఆ తర్వాత నిడివి(60 కి.మీ)లో మాత్రం ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. పట్టణీకరణ నేపథ్యంలో చేవెళ్లలో ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య భారీగా పెరిగింది. దీనికితోడు బెంగళూరు నేషనల్ హైవేను శంషాబాద్ నుంచి చేవెళ్ల మీదుగా దారిమళ్లించడం కూడా ప్రమాదాల సంఖ్య పెరిగేందుకు కారణమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ మార్గంలో ప్రమాదాల నివారణకు, రోడ్డు విస్తరణకు వరల్డ్ బ్యాంకు ఆర్థిక సాయం అందిస్తున్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు అమలులో ఆలస్యమవుతోంది.
సమన్వయ లేమి!
రోడ్ల అభివృద్ధి, భద్రత బాధ్యతలను ప్రభుత్వం మూడు శాఖలకు అప్పగించింది. రాష్ట్రస్థాయిలో ప్రత్యేకంగా రోడ్ సేఫ్టీ సెల్‌ను ఏర్పాటు చేయాలని రవాణా శాఖను నిర్దేశించింది. అయితే పోలీసు, ఆర్‌డీసీ, వైద్య, రవాణా శాఖల మధ్య కొరవడిన సమన్వయంతో ప్రాజెక్టు మొదలైన మూడేళ్లకు గానీ ప్రత్యేక సెల్ కార్యరూపం దాల్చలేదు. నిర్దేశిత మారా ్గల్లో ట్రామాకేర్ సెంటర్లు, ఆస్పత్రుల నిర్వహణ, అంబులెన్స్‌ల కొనుగోళ్లు వైద్య, ఆరోగ్యశాఖ పర్యవేక్షణలో కొనసాగించాల్సివుండగా... ప్రమాద సూచికల ఏర్పాటు, పెట్రోలింగ్, ట్రా ఫిక్ క్రమబద్ధీకరణను రవాణా, పోలీసు శాఖ లు పర్యవేక్షించాలని ప్రభుత్వం సూచించింది. అలాగే గుర్తించిన ప్రమాద కారకాల (బ్లాక్‌స్పాట్స్)ను తొలగించడం, రోడ్డును నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా మలిచే బాధ్యతను ఆర్‌డీసీకి కట్టబెట్టింది. ముఖ్యంగా ప్రమాదాలకు హేతువుగా మారిన మలుపులను సవరించడం ద్వారా ఘోరాలకు అడ్డుకట్ట వేయవచ్చని భావించింది. ఈ మేరకు ఆయా శాఖల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసినప్పటికీ, టెండర్లను ఇప్పటివరకు ఖరారు చేయకపోవడం గమనార్హం. కాగా, ప్రపంచ బ్యాంకు సాయంతో అమలవుతున్న ఈ ప్రాజెక్టు 2015 సంవత్సరంతో ముగియనుంది.
నెత్తురోడ్డుతోంది!
Published Sun, Oct 20 2013 12:40 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement