t.rammohan reddy
-
కృష్ణా, గోదావరిలో వాటా సాధిస్తాం
సాక్షి,పరిగి: ఉమ్మడి జిల్లాకు కృష్ణా, గోదావరి జలాలు సాధించే వరకు చేవెళ్ల జలసాధన సమితి పోరాటం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం పరిగిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు కృష్ణా, గోదావరి జలాలు రాకుండా కుట్రలు చేస్తున్న కేసీఆర్ ఇక్కడి రైతాంగానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాకు రెండు నదుల నుంచి 20 టీఎంసీలు సాధించేందుకు క్షేత్రస్థాయి నుంచి పార్టీల రహితంగా ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు.దివంగత వైఎస్సార్ జిల్లాను సస్యశ్యామలం చేసేందకు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నుంచి 10 టీఎంసీలు, పాలమూరు ఎత్తిపోతల నుంచి 10 టీఎంసీల నీళ్లు కేటాయించారని తెలిపారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ప్రాణహితను దూరం చేసి పాలమూరు ఎత్తిపోతల నుంచి రావాల్సిన నీటి వాటాను 10 టీఎంసీల నుంచి 2.8 టీఎంసీలకు కుదించారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓ పక్క సాగు నీటి ప్రాజెక్టులు జిల్లాకు దూరం చేస్తూ టీఆర్ఎస్ సర్కారు మోసం చేస్తుంటే మరోవైపు రంజిత్‌రెడ్డి సాగునీరు తెస్తాడంటా.. అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రాణహిత –చేవెళ్ల ప్రాజుక్టు డిజైన్ మార్చి ద్రోహం చేసింది సీఎం కాదా...? అని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో ఎవరూ లేరని వరంగల్ జిల్లా నాయకుడిని ఎంపీ అభ్యర్థిగా దిగుమతి చేసుకున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ అతిథిలాగా ఎన్నికలప్పుడే కనిపిస్తారని ఆరోపించారు. ఐదేళ్ల క్రితం ఎన్నికల సమయంలో జిల్లాకు వచ్చిన సీఎం మళ్లీ ఈ ఎన్నికల్లో కనిపించారని ఎద్దేవా చేశారు. మోసం చేసిన టీఆర్ఎస్కు ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ...నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. చార్మినార్ జోన్లో కలపాలని ఉద్యమిస్తే పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు ఎన్నికల సమయంలో సమస్యను పరిష్కరిస్తానని మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. సంగారెడ్డికి, చార్మినార్‌కు, వికారాబాద్‌కు జోగులాంబకు సంబంధమేంటని ఈ సందర్భంగా రామ్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుభాష్‌చందర్‌రెడ్డి, కొమిరె లక్ష్మయ్య, నారాయణ్‌రెడ్డి, లాల్‌కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎత్తిపోతలు పథకం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పరిగి శాసనసభ్యుడు టి.రామ్మోహన్‌రెడ్డి సభలో ప్రస్తావించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని ఆయన లేవనెత్తగా.. మంత్రి హరీష్‌రావు అందుకు వివరణ ఇచ్చారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. టీఆర్ఆర్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తాజా బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయించారు.? హరీష్‌రావు: 2014-15 ఆర్థిక బడ్జెట్లో ప్రాజెక్టుకు రూ.5కోట్లు కేటాయించాం. టీఆర్ఆర్: టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవడంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయా..? హరీష్‌రావు: అలాంటిదేమీ లేదు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఒనగూరే ప్రయోజనాలపై టీఆర్ఆర్ వివరణ కోరగా.. మంత్రి స్పందిస్తూ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో మొత్తం 13,01,521 ఎకరాలుండగా.. ఇందులో సాగుకు యోగ్యమైన విస్తీర్ణం 4,50,000 ఎకరాలుగా మంత్రి తెలిపారు. ఇందులో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో 2,70,000 ఎకరాలకు సాగునీరందించే వీలున్నట్లు పేర్కొన్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్టుతో జిల్లాలోని 17 మండలాలు సస్యశ్యామలం కానున్నట్లు వివరించారు. -
జూరాలతో రైతాంగానికి మేలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూగర్భజలాలపై ఆధారపడిన జిల్లా రైతాంగానికి ‘పాలమూరు-రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల’ పథకంతో మేలు చేకూరనుందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పది లక్షల ఎకరాలను స్థిరీకరించే ఈ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వ హయాంలోనే అంకురార్పణ జరిగిందని, సమగ్ర సర్వే కూడా పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే జిల్లాలోని 18 మండలాలకు సాగు, తాగు నీరు అందుతుందని స్పష్టం చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో టీఆర్ఆర్ మాట్లాడారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు సర్వే పనులకు గత ప్రభుత్వం రూ.6.91 కోట్లు కేటాయించిందని, వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని కేసీఆర్ సర్కారు ప్రకటించడం జిల్లా రైతాంగానికి శుభపరిణామం అని అన్నారు. గండేడ్‌లో నిర్మించే 45టీఎంసీల జలాల సామర్థ్యం గల రిజర్వాయర్‌ను ప్రతిపాదిస్తున్నారని, తద్వారా పరిగి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. బీడువారిన పొలాలను సస్యశ్యామలం చేయాలనే ఉద్ధేశంతో దివంగత నేత వైఎస్ రాజ శేఖరరెడ్డి జూరాల-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించాలనే యోచన చేశారని, అందులో భాగంగానే కిరణ్ సర్కారు ప్రాజెక్టు ప్రాథమిక సర్వేకు నిధులు విడుదల చేసిందని తెలిపారు. దాదాపు రూ.10వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదిస్తున్న ఈ పథకం అమలుకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు ప్రక టించారని గుర్తు చేశారు. -
దిగ్విజయ్‌కు టీఆర్ఆర్ ఆతిథ్యం
పరిగి, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు శుక్రవారం రాత్రి పరిగిలో పీసీసీ కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. కర్ణాటకలోని గుల్బర్గాలో శనివారం నిర్వహించనున్న సోనియా సభకు వెళ్తూ ఆయన పరిగిలో గంటపాటు గడిపారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాత్రి 7.30 గంటలకు నేరుగా పరిగికి చేరుకున్న దిగ్విజయ్‌సింగ్ స్థానిక ఇందిరాగాంధీ చౌరస్తాలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అక్కడే ఆయనకు కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో హారతి ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన దిగ్విజయ్.. పీసీసీ కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. రాత్రి భోజనంగా చపాతీ, నాన్‌వెజ్ కర్రీ తీసుకున్నారు. అనంతరం కాసేపు కార్యకర్తలతో ముచ్చటించారు. ఉద్యోగ సంఘాలు, విద్యార్థి జేఏసీ నాయకులు ఆయన్ను కలిసి తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పరిగి టికెట్ ఎవరికి ఇస్తారని కొందరు కార్యకర్తలు, విలేకరులు అడగ్గా ఆ విషయం మీకే తెలుసు అంటూనే.. ఎవరు బాగా పనిచేస్తే వారికే వస్తుందని సమాధానమిచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు కష్టపడాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకు డు భాస్కర్.. దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి పం చాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రెగ్యులరైజ్ చేసి న జీఓను ఆయన నుంచి తీసుకున్నారు. -
‘కోయిల్‌సాగర్’ పనులు వేగవంతం
గండేడ్, న్యూస్‌లైన్: మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌సాగర్ నుంచిపరిగి నియోజకవర్గానికి తాగునీటిని తీసుకువచ్చేందుకు సోమవారం గ్రామీణ నీటి సరఫరా పథకం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు, పీసీసీ కార్యదర్శి టి. రామ్మోహన్‌రెడ్డి రూట్ సర్వే చేశారు. పరిగి ప్రాంత ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం ఇటీవల రూ.150 కోట్లతో పనులు చేపట్టేందుకు జీఓను విడుదల చేసింది. మొదటి విడతగా రూ.50 లక్షలతో అధికారులు సర్వే పనులు ప్రారంభించారు. సోమవారం గండేడ్ మండలం పగిడ్యాల్ ప్రాంతం నుంచి కోయిల్ సాగర్ వరకు లిఫ్ట్ పద్ధతిన పైపులైన్ ద్వారా నీటిని తీసుకువచ్చేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సర్వే చేపట్టారు. పనులు చేసేందుకు టెండర్లు తీసుకున్న జేసీఏ కంపెనీ అధికారులు కూడా సర్వే కోసం వచ్చారు. కోయిల్‌సాగర్ నుంచి తాగునీటిని పరిగికి తీసుకురావడంలో పీసీసీ కార్యదర్శి టీఆర్ఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించి సంబంధిత అధికారులతో సర్వే సనులు చేయిస్తున్నారు. కోయిల్ సాగర్ నుంచి పగిడ్యాల్ వరకు సుమారు 38 కిలోమీటర్ల దూరం పైపులైన్ నిర్మాణం చేపట్టనున్నారు. పగిడ్యాల్ ప్రాంతంలో నీటిని శుద్ధి చేసి అక్కడి నుంచి పరిగి నియోజకవర్గంలోని గండేడ్, కుల్కచర్ల, దోమ, పరిగి, పూడూరు మండలాలకు 3 ప్రత్యేక పైపులైన్ల ద్వారా తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ పనులు ఏడాదిలోగా పూర్తి కావచ్చని ఆయన తెలిపారు. అధికారులు కోయిల్ సాగర్ నుంచి మహబూబ్‌నగర్ వెళుతున్న తాగునీటి పంపింగ్‌ను పరిశీలించారు. ఇక ప్రజల దాహార్తి సమస్య తీరినట్లే.. పరిగి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల తాగునీటి సమస్యను తీర్చేందుకే 2007 నుంచీ.. అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖరరెడ్డి ద్వారా ప్రయత్నం కొనసాగించినట్లు పీసీసీ కార్యదర్శి టీఆర్ఆర్ గుర్తు చేశారు. పరిగి నియోజక వర్గంలోని కొన్ని గ్రామాల్లోని ప్రజలు ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కోయిల్ సాగర్ జలాలతో ఇక ఈ సమస్య తీరినట్లేనని టీఆర్ఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తాగునీరే కాకుండా పాలమూరు ఎత్తిపోతల ద్వారా సాగునీరు, రైల్వేలైన్, చేవెళ్ల ప్రాణహిత వంటి అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈ నర్సింలు గౌడ్, గండేడ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, కార్యదర్శి జితేందర్‌రెడ్డి, నర్సింహారావు, గండేడ్, వెన్నాచేడ్ సర్పంచ్‌లు వెంకటయ్యగౌడ్, బోయిని గోపాల్, నాయకులు బాల్‌రెడ్డి, ఆశిరెడ్డి ఉన్నారు. -
హైదరాబాద్-బీజాపూర్ రహదారిని నాలుగు లేన్లుగా మార్చేందుకు కృషి
పరిగి, న్యూస్‌లైన్: అంతర్రాష్ట్ర రహదారి హైదరాబాద్ - బీజాపూర్ మార్గాన్ని నాలుగు లేన్లుగా మార్చేందుకు కృషి చేస్తానని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు పరమేశ్వర్ అన్నారు. ఆదివారం పీసీసీ కార్యదర్శి టీ.రామ్మోహన్‌రెడ్డి, కర్ణాటక మాజీ ఎమ్మెల్యే బోస్‌రాజ్‌లతో కలిసి ఆయన పరిగిలో విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక - హైదరాబాద్‌ల మధ్య ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగించడానికి అంతర్రాష్ట్ర రహదారిని విస్తరించాల్సి ఉందని, ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధ చూపనున్నట్టు చెప్పారు. అలాగే పరిగి మీదుగా వికారాబాద్ - రాయచూర్ రైల్వేలైన్ ఏర్పాటుకు సహకరిస్తానన్నారు. యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ చొరవతో కర్ణాటకలోని ఆరు నైజాం జిల్లాల్లో విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ప్రత్యేకంగా జీఓ అలాగే ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ మంజూరైందని చెప్పారు. ఏఐసీసీ అధినేత్రికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఫిబ్రవరి 1వతేదీన గుల్బర్గాలో 2లక్షల మందితో సభ నిర్వహించనున్నామన్నారు. సభకు సోనియాగాంధీ హాజరు కానున్నారని, హైదరాబాద్ - బీజాపూర్ రోడ్డు విస్తరణ అలాగే రైల్వే ఏర్పాటు ప్రతిపాదనలు ఆమె ముందు ఉంచుతామని పరమేశ్వర్ తెలిపారు. ఏపీసీ కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని అన్నారు. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని సోనియాగాంధీని కోరతానని చెప్పారు. అనంతరం కాంగ్రెస్ పరిగి నాయకులు, కార్యకర్తలు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిని ఘనంగా సన్మానించారు.